'లక్ష్మీస్ NTR'మూవీ రివ్యూ

Friday,March 29,2019 - 05:27 by Z_CLU

నటీ నటులు : విజయ్ కుమార్ , య‌జ్ఞా శెట్టి, శ్రీతేజ్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ : రమ్మీ

రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి

మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి

నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి

దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు

విడుదల తేది : 29 మార్చ్  2019

రామ్ గోపాల్ వర్మ ఎప్పటి నుండో ఊరిస్తున్న ‘లక్ష్మీస్ NTR’ ఎట్టకేలకు ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. 1989లో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా..? వర్మ ఈ సినిమా ద్వారా ఏం చూపించాడు.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ‌ :

1989లో ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు ఆయన దగ్గరికి వస్తుంది లక్ష్మీ (యజ్ఞ శెట్టి). ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌ తన జీవిత చరిత్ర రాసేందుకు ఆమెకు అనుమతి ఇస్తాడు. అలా పుస్తకం రాసేందుకు ఒక రచయిత్రిగా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ కి బాగా దగ్గరవుతుంది. మరో వైపు ఎన్టీఆర్ కుటుంబం వాళ్ళిద్దరినీ దూరం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ఎన్టీఆర్-లక్ష్మి పార్వతి లపై దుష్ప్రచారం మొదలవుతుంది.

మేజర్ చంద్రకాంత్ శత దినోత్సవ వేడుకలో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వేదికపై ప్రకటిస్తాడు ఎన్టీఆర్‌. తర్వాత లక్ష్మీ పార్వతి ని సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకుంటాడు. 1994లో లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ అధికారం చేపడతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి.. కుటుంబాన్ని తనవైపు తిప్పుకున్న బాబు రావు(శ్రీ తేజ్) ఎలాంటి కుట్రలు పన్నుతాడు… కుటుంబ సభ్యులను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ ఎలా లాక్కుంటాడు. పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌ చివరికి ఎలా చనిపోయారు.. అనేదే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథ.

 

నటీ నటుల పనితీరు :

విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు ఆయనలో ఎన్టీఆర్ కనిపిస్తారు. లక్ష్మి పార్వతి పాత్రలో యజ్ఞా శెట్టి పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంది. సీ.బి.నాయుడు పాత్రలో శ్రీ తేజ్ బాగా నటించాడు. మిగతా నటీ నటులంతా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించాడు కళ్యాణి కోడూరి. ముఖ్యంగా ‘నువ్వు నా సర్వస్వం’ , ‘విజయం విజయం ఘన విజయం’ పాటలు ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలను ఆర్.ఆర్ ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సార్లు మాత్రమే ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా తెలియజేసేలా కెమెరా వర్క్ ఉంది. ఎడిటింగ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఆర్ట్ వర్క్ బాగుంది. పాటలకు సిరా శ్రీ సాహిత్యం చక్కగా కుదిరింది. యతి రాజు సౌండ్ డిజైనింగ్ బాగుంది. కథ ఆసక్తికరంగా ఉన్నా కథనం నెమ్మదిగా సాగింది. వర్మ -అగస్త్య డైరెక్షన్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా డీల్ చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

వర్మ ఎప్పటి నుండో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఊరించిన సినిమాను ఎట్టకేలకు విడుదల చేయగలిగాడు. ఎన్నికల సమయం కావడంతో నిన్నటి వరకూ ఈ సినిమా విడుదలపై రకరకాల అనుమానులున్నాయి. ఆంధ్రప్రదేశ్ మినహా  ఈరోజు ఉదయం ఆటతో సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు సంబంధించి మొదటి నుండి అందరికీ తెలిసిన కథే అయినా అసలు వర్మ ఎంత వరకూ నిజా నిజాలు చూపించారనేది ఆసక్తిని నెలకొల్పింది. వర్మ కూడా తన స్టైల్ పబ్లిసిటీ తో సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళాడు.

1989లో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయిన రోజుల నుండి 1996లో ఆయన మరణం వరకూ సినిమా కథను తీసుకున్నారు. అయితే అందరూ ఊహించినట్టే కథలో అగ్ర తాంబూలం మాత్రం లక్ష్మీ పార్వతి పాత్రకే ఇచ్చారు. ఆమె ఎన్టీఆర్ మొదటి సారి కలుసుకోవడం నుండి ఆయన మరణం వరకూ ఆమె రామారావు జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారనే అంశంపై శ్రద్ధ పెట్టి సినిమాను తెరకెక్కించారు. ఎన్టీఆర్ అల్లుడు బాబు ఆయనను వెన్నుపోటు పొడవడం అనే సన్నివేశాలను బాగా హైలైట్ చేసారు.

ఏ బయోపిక్ అయినా ఆ వ్యక్తిని గుర్తుచేసే నటుడు దొరకాలి. అప్పుడే ప్రేక్షకులకు ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎక్కువ మార్కులు అందుకుంది. ఎన్టీఆర్ ని పోలిన నటుడు విజయ్ కుమార్ అచ్చం ఆయన లాగే నటిస్తూ సినిమాను రక్తి కట్టించాడు. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞా శెట్టి పాటు మిగతా వారందరి పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించే నటులను ఎన్నుకున్నాడు వర్మ. కాకపోతే డ్రామా మరీ ఎక్కువైంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్లో నెరేషన్ తో పాటు డ్రాగ్ అనిపించడం సినిమాకు మైనస్.

మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుకలో లక్ష్మీ పార్వతి తో అనుబంధం గురించి చెప్పే సన్నివేశం , 1994 లో ఎన్నికల సన్నివేశాలు , సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు , ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ , స్లో నెరేషన్, మెలో డ్రామా మరీ ఎక్కువ కావడం, ఊహించిన రేంజ్ లో లేకపోవడం మైనస్.

బాటమ్ లైన్ : లక్ష్మీస్ మెలోడ్రామా

రేటింగ్ : 2.5/5