Movie Review - శశి

Friday,March 19,2021 - 05:59 by Z_CLU

నటీనటులు: ఆది సాయికుమార్‌, సుర‌భి, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాష్‌, అజ‌య్‌, వెన్నెల కిశోర్‌, రాశీ సింగ్‌, తుల‌సి, తదితరులు..
ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
నిర్మాత‌లు: ఆర్‌.పి.వ‌ర్మ‌, సి.రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు
బ్యానర్: శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ: అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
ఎడిటింగ్‌: స‌త్య జి
సెన్సార్: U/A
రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు
రిలీజ్ డేట్: మార్చి 19, 2021

ఆది సాయికుమార్ లుక్స్ ఎట్రాక్ట్ చేశాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాట సూపర్ హిట్టయింది. ట్రయిలర్ క్లిక్ అయింది. దీంతో శశి సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా అనుకున్న టార్గెట్ అందుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

sashi-movie-telugu-review 1

కథ

రాజ్ కుమార్ (ఆది సాయికుమార్) జులాయిగా తిరుగుతుంటాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. నచ్చితే మ్యూజిక్ బ్యాండ్ లో పాల్గొంటాడు. తమ్ముడ్ని గాడిలో పెట్టేందుకు అన్నయ్య అజయ్ (అజయ్) విపరీతంగా ప్రయత్నిస్తుంటాడు కానీ తమ్ముడు మారడు. రాజ్ మాత్రం నిత్యం దొర (జయప్రకాష్) ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంటాడు.
ఇలాంటి టైమ్ లో అనుకోకుండా శశి (సురభి)ని చూస్తాడు రాజ్. ఆమెను చూసిన వెంటనే వెంటపడడం మొదలుపెడతాడు. అప్పటివరకు రెబల్ గా కనిపించిన వ్యక్తి సాఫ్ట్ గా కూడా మారిపోతాడు. ఇంతకీ శశి ఎవరు? రాజ్ జీవితానికి శశికి లింక్ ఏంటి? రాజ్-దొర మధ్య సంబంధం ఏంటి?

నటీనటుల పనితీరు

ఇలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులున్న ఈ కథలో రాజ్ కుమార్ అలియాస్ ఆది సాయికుమార్ పెర్ ఫెక్ట్ గా ఫిట్టయ్యాడు. కేర్ లెస్ గా కనిపించే అతడి లుక్స్, యాటిట్యూడ్ బాగున్నాయి. అక్కడక్కడ అర్జున్ రెడ్డిని తలపించినా ఆది కూడా తన మార్క్ చూపించాడు. హీరోయిన్ సురభి, రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో బాగా నటించింది. మరో హీరోయిన్ రాశి సింగ్ చూడ్డానికి బాగుంది. కానీ ఆమెను యాక్టింగ్ పరంగా, గ్లామర్ పరంగా రెండు విధాలుగా వాడుకోలేకపోయారు.

హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల, హీరో అన్నగా అజయ్, తల్లిగా తులసి, ఫ్రస్ట్రేషన్ లెక్చరర్ గా వెన్నెల కిషోర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు

ఈ సినిమాకు ఓ హైప్ తీసుకొచ్చిన టెక్నీషియన్ గా ముందుగా మ్యూజిక్ డైరక్టర్ అరుణ్ చిలువేరు గురించే చెప్పుకోవాలి. ఒకే ఒక లోకం పాట మ్యూజిక్ పరంగా ఎంత బాగుందో పిక్చరైజేషన్ పరంగా కూడా అంతే బాగుంది. మరో డ్యూయట్ తో పాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆకట్టుకున్నాడు అరుణ్. ఇక సినిమాటోగ్రాఫర్ అమర్ నాథ్ కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.

ఇక దర్శకుడి విషయానికొస్తే శ్రీనివాస్ నాయుడు మంచి కథ రాసుకున్నాడు. కానీ ఆ కథకు తగ్గట్టు మంచి స్క్రీన్ ప్లే పడలేదు. మంచి డైలాగ్స్ పడలేదు. ఎడిటింగ్ కుదరలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

sashi-movie-telugu-review 1

జీ సినిమాలు రివ్యూ

కథలో కీలకమైన పాయింట్లను చివర్లో చెప్పాలనుకున్నప్పుడు ముందు భాగాన్ని ఇంట్రెస్టింగ్ స్టఫ్ తో నింపాలి. ఫస్టాఫ్ లో విషయం లేనప్పుడు, సెకెండాఫ్ లో ఎన్ని ట్విస్టులు ఇచ్చినా ఆసక్తి తగ్గిపోతుంది. శశి సినిమాలో ఇదే లోపించింది. దర్శకుడు మంచి పాయింట్ అనుకున్నాడు. దానికి మంచి ట్విస్టులు కూడా ఇచ్చాడు. కానీ చివరి వరకు ఆ ట్విస్టుల్ని దాచడం కోసం లేదా ఒక్కో ట్విస్ట్ ను నెమ్మదిగా రివీల్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. ఈ ప్రాసెస్ లో కొన్ని నీరసమైన సన్నివేశాలతో బోర్ కొట్టించాడు.

శశి సినిమాలో మంచి స్టఫ్ ఉంది. చాన్నాళ్ల తర్వాత ఆది సాయికుమార్ కు మంచి కథ, క్యారెక్టర్ పడ్డాయి. అంతేకాదు, అతడిలో నటుడ్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా పడ్డాయి. కానీ స్క్రీన్ ప్లే లోపాలు, ఎడిటింగ్ మిస్టేక్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను తగ్గించేశాయి. దీంతో ఆది బాగా నటించినప్పటికీ ”ఓకే” లెవెల్ దాటి సినిమా ముందుకెళ్లలేకపోయింది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు శశిలో బలమైన పాయింట్ ఉంది. బలమైన 4 పాత్రలున్నాయి. వాటికి తగ్గట్టు మంచి సబ్-ప్లాట్స్ కూడా పడ్డాయి. కానీ వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాల్లో మాత్రం ఆ బలం లేదు. చివరికి మంచి నటుడు అనిపించుకున్న రాజీవ్ కనకాల సన్నివేశాలు కూడా పండలేదంటే అది దర్శకుడి కథనంలో లోపమనే చెప్పాలి. దీనికితోడు కథలో ట్విస్టుల కోసం సన్నివేశాల్ని సాగదీయడం,
మరికొన్ని సీన్స్ ను ఇరికించడం, రొటీన్ సన్నివేశాలతో కాలక్షేపం చేయడం ఎక్కువగా కనిపించింది.

ఇన్ని మైనస్ పాయింట్స్ మధ్య మెరిసిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆది సాయికుమార్ యాక్టింగ్ తో పాటు సినిమాలో 2 పాటలు బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ”ఒకే ఒక లోకం నువ్వే” పాటతో పాటు మరో డ్యూయట్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. శశి సినిమా కంటే ఆ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాటే పెద్ద హిట్.

బాటమ్ లైన్ – అక్కడక్కడ ఆకట్టుకున్న శశి
రేటింగ్2.25/5