Movie Review - అరణ్య

Friday,March 26,2021 - 12:34 by Z_CLU

నటీ నటులు :రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావోంక‌ర్‌, అనంత్ మహదేవన్ రఘు బాబు తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎ.ఆర్. అశోక్ కుమార్

సంగీతం: శంతను మొయిత్రా

మాటలు, పాటలు: వనమాలి

నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్

నిడివి : 140 నిమిషాలు

విడుదల తేది : 26 మార్చ్ 2021

కొన్ని నెలలుగా పోస్ట్ అవుతూ వస్తున్న రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి అడవి నేపథ్యంలో ఏనుగుల కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? రానా ఈ సినిమాతో విజయం అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

aranya movie telugu review 3
కథ :

లక్ష మొక్కలు నాటి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా) నిత్యం అడవి సంరక్షణ మూగ జీవాల శ్రేయస్సు కోరుతూ పోరాడుతుంటాడు. ఈ క్రమంలో అడవిలో DLR టౌన్ షిప్ పేరుతో తన డ్రీం ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తుంటాడు ఫారెస్ట్ మినిస్టర్ రాజ గోపాలం(అనంత్ మహాదేవన్). అడవిలో అక్రమ కట్టడాలపై మినిస్టర్ కి ఎదురెళ్ళి అడవిని కాపాడే ప్రయత్నంలో భాగంగా డిల్లీ వెళ్లి కేసు వేసి స్టే తీసుకొస్తాడు అరణ్య.

అరణ్య తన ప్లాన్ కి అడ్డు రావడంతో అతన్ని జైలుకి చేర్చి పిచ్చివాడిగా ముద్ర వేస్తాడు మినిస్టర్. టౌన్ షిప్ కట్టే ప్రదేశానికి ఏనుగులు రాకుండా చుట్టూ భారీ ప్రహరీ గోడ కట్టడంతో మంచి నీళ్ళు తాగలేక ఆ గోడను దాటి వెళ్ళలేక అడవి ఏనుగులు ఇబ్బంది పడుతుంటాయి. చివరికి ఏనుగులతో కలిసి అరణ్య ఆ అక్రమ కట్టడాన్ని ఆపించి గోడను ఎలా తొలగించాడు? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

ఫారెస్ట్ మ్యాన్ గా రానా మంచి నటన కనబరిచాడు. కొన్ని సన్నివేశాల్లో నటన పరంగా ఇంకో మెట్టు ఎక్కాడనిపించింది. కాకపోతే స్లిమ్ లుక్ తో ఆకట్టుకోలేకపోయాడు. సింగ పాత్రలో విష్ణు విశాల్ నటన పరవాలేదు. కాకపోతే దర్శకుడు ఆ క్యారెక్టర్ ని ప్రాపర్ గా డిజైన్ చేయకపోవడం వల్ల విష్ణు విశాల్ కథలో తేలిపోయాడు. హీరోయిన్ జోయ హుస్సేన్ జర్నలిస్ట్ పాత్రతో ఆకట్టుకుంది. శ్రియా పిల్గావోంక‌ర్‌ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది.

విలన్ గా మినిస్టర్ పాత్రలో అనంత్ మహదేవన్ పరవాలేదనిపించాడు తప్ప సరైన విలనిజం చూపించలేకపోయాడు. రఘు బాబు ,బోస్ వెంకట్ , భువన అరోరా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

అడవి నేపథ్యంతో తీసే ఇలాంటి సినిమాలకు టెక్నీకల్ సపోర్ట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా విజువల్స్, సౌండింగ్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. ఆ రెండూ సినిమాకు చక్కగా కుదిరాయి. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. అడవిని తన కెమెరా వర్క్ తో మరింత అందంగా చూపించాడు. కొన్ని సందర్భాల్లో కనిపించే విజువల్స్ బాగా ఎట్రాక్ట్ చేశాయి. భువన్ ఎడిటింగ్ సినిమాకు మైనస్.

శంతను మొయిత్రా కంపోజ్ చేసిన సాంగ్స్ చూస్తున్నప్పుడు బాగున్నప్పటికీ సినిమా నుండి బయటికొచ్చేసరికి ఒక్కటి కూడా గుర్తురాదు. జార్జ్ జోసెఫ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ విజువల్స్ కి ఇంకాస్త బలాన్నించ్చింది. మయూర్ శర్మ ఆర్ట్ వర్క్ బాగుంది. కీర్తి కొల్వాంకర్, మరియా తారకన్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ క్యారెక్టర్స్ కి చక్కగా కుదిరాయి. ప్రభు సోలమాన్ మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానికి సరైన కథనం రాసుకొని ఆకట్టుకునే విధంగా సినిమాను తీయడంలో దర్శకుడిగా విఫలమయ్యాడు.ఎరోస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

aranya movie telugu review 3

జీ సినిమాలు సమీక్ష :

అడవి నేపథ్యంలో ఏనుగుల కథతో సినిమా తీయాలంటే దర్శకుడికి ధైర్యం కావాలి. సరిగ్గా అరణ్యతో అలాంటి ధైర్యమే చేశాడు డైరెక్టర్ ప్రభు సోల్మాన్. ఒక అడవి, అందులో ఏనుగుల సమస్య, ఆ సమస్య కోసం పోరాడే హీరో… ఈ ఎలిమెంట్స్ తో మంచి కథనే ఎంచుకున్నాడు ప్రభు. కాకపోతే ఈ కథకి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే కథనం రాసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అడవి వీరుడు రేంజ్ లో ఊహించుకొని అరణ్య కోసం థియేటర్ కొచ్చే ప్రేక్షకుడికి ఓ సాదా సీదా సినిమాను చూపించాడు దర్శకుడు. సినిమలో అరణ్య పాత్రలో రానా నుండి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఊహించే ప్రేక్షకులు నిరుత్సాహ పడటం ఖాయం.

తను నమ్మిన కథను కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళకుండా నిజాయితిగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్కోప్ ఉన్న ఇలాంటి కథను ఏదో సాదా సీదా స్క్రీన్ ప్లేతో స్లో నరేషన్ తో నడిపించిన తీరు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అసలు సినిమాలో విష్ణు విశాల్ క్యారెక్టర్ అవసరమా అనిపించేలా సింగడు క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఏనుగు మీద ఆదారపడి పడి బ్రతికే సింగడు ఆ ఏనుగు చనిపోయాక మళ్ళీ కనిపించడు. బహుశా ఆ క్యారెక్టర్ తాలూకు సన్నివేశాలు ఎడిటింగ్ లో లేపేసి ఉండొచ్చు. ఇక సీరియస్ గా సాగుతున్న కథలో అనవసరంగా లవ్ ట్రాక్ ని ఇరికించే ప్రయత్నం చేశాడు ప్రభు సోల్మాన్. ఆ లవ్ ట్రాక్ ప్రేక్షకుడిని మరింత ఇబ్బంది పెడుతుంది.

అడవి నేపథ్యం ఉన్న ఈ కథలో రాజకీయం , నక్సలిజం , మనుషుల్లో వస్తున్న మార్పు, మూగజీవాలను పట్టించుకోకుండా కేవలం డబ్బుకోసం ఆరాటపడే మనుషులు ఇలా చాలా విషయాలు టచ్ చేసాడు దర్శకుడు ప్రభు. కాకాపోతే ఇందులో కొన్ని విషయాలను ఇంకా డెప్త్ లో చెప్పలేకపోయాడు. ఇక సినిమాలో యానిమల్ , మ్యాన్ కాన్ఫ్లిక్ట్ కూడా క్లిక్ అవ్వలేదు. సినిమా ఆరంభంలో ఏనుగులు నీళ్ళు తాగే చోట, ఓ పక్షితో మాట్లాడే చోట , పులి వెనుక వచ్చే సన్నివేశంలో మాత్రమే జంతువులతో అరణ్య రిలేషన్ చూపించాడు దర్శకుడు. ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా బాగా చూపిస్తే ఆడియన్ అరణ్య పాత్రకి ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాడు. చివర్లో వచ్చే సన్నివేశాల్లో మాత్రం ఏనుగులతో అరణ్య బాండింగ్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏనుగులు చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, నీటి కోసం ఏనుగులు పడే ఇబ్బందులతో కూడిన సన్నివేశాలు హృదయాలను కదిలిస్తాయి. ఇలా కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ‘అరణ్య’ పూర్తి స్థాయిలో మెప్పించదు. ఫైనల్ గా ఏనుగుల కథ కోసం , రానా నటన కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5