'రాజా నరసింహా' మూవీ రివ్యూ

Wednesday,January 01,2020 - 04:34 by Z_CLU

నటీ నటులు : మమ్ముటీ , జై, జగపతిబాబు, సన్నీలియోన్‌, సలీం కుమార్ తదితరులు.

ఛాయాగ్రహణం : షాజీ కుమార్

సంగీతం : గోపీ సుందర్‌

కథ -స్క్రీన్ ప్లే : ఉదయ్ కృష్ణ

దర్శకత్వం : వైశాక్

సహ నిర్మాత: నూల అశోక్‌

నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ

నిడివి : 150 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 1 జనవరి 2020

కొందరు స్టార్ హీరోల సినిమాలు భాషా బేధం లేకుండా ప్రేక్షకులను మెప్పించి హిట్టవుతాయి. అయితే ఈ ఆశతోనే కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మమ్ముట్టి సినిమా ‘రాజా నరసింహ’ టైటిల్ తో విడుదలైంది. మరి మమ్ముట్టి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

కేరళలో కొచ్చిమారుమూల అటవీ ప్రాంతంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా గీరేశం(జగపతి బాబు) తయారు చేసే కల్తీ మందుతాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా (మమ్ముట్టి). నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. అయితే పాలకొల్లుకు రాజా తన తండ్రి , తమ్ముడు చిన్నా(జై) కోసం ఆ అటవీ ప్రాంతంలో అడుగుపెడతాడు. అలా కొచ్చిలో అడుగుపెట్టిన రాజా గిరీశం చేసే అవినీతిని బయటపెట్టి అక్కడ గిరీశంకి అపోజిట్ గా ఎం.ఎల్.ఏ పదవికి పోటీ చేస్తాడు.

అయితే రాజా తన అవినీతి జీవితానికి అడ్డుతగలడంతో చిన్నాను రాజాకి సహాయం చేసే మరో మహిళను తన వేట కుక్కలచేత చంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రాజా చివరికి గిరీశంను ఎలా అంతమొందించాడనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

కొంత మంది సూపర్ స్టార్స్ నటన గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసం లేదు. ఆ లిస్టులో మమ్ముట్టి ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఈ సినిమాలో రాజా పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ తనదైన కామెడీతో నవ్వించాడు. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. జై చిన్నా పాత్రల్లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా మహిమ నంబియార్ నటనతో పాటు క్యూట్ ఫేస్ తో ఎట్రాక్ట్ చేసింది. వాసంతి పాత్రలో అనుశ్రీ పర్ఫెక్ట్ అనిపించుకుంది. పూర్ణ కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేసింది.

కొన్ని సన్నివేశాల్లో జగపతి బాబు నటన ఆకట్టుకున్నా విలనిజం పండే సన్నివేశాలు అరకొర ఉండటంతో జగపతి విలనిజం పండలేదు. సలీం కుమార్ కామెడీ నవ్వించకపోగా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉంది. కమీషనర్ పాత్రలో సిద్దిక్ , సీ .ఐ పాత్రలో సురేష్ పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీ నటులంతా పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు గోపిసుందర్ నేపథ్య సంగీతం బాగా కలిసొచ్చింది. సినిమాలో ఉన్న అరకొర బలమైన సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు అదిరిపోయే రీ రికార్డింగ్ ఇచ్చాడు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగిన విజువల్స్ ఇవ్వడంలో షాజీ సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ పరవాలేదు. సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ తో ఎట్రాక్ట్ చేసింది.

ఆర్ట్ వర్క్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా కంపోజ్ చేసారు. ఉదయ కృష్ణ అందించి కథతో పాటు కథనం కూడా రొటీన్ గానే ఉంది. వైశాఖ్ డైరెక్షన్ లో లోపాలున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక భాషలో హిట్టైన సినిమా అందరికీ నచ్చుతుందనుకోవడం పొరపాటే. కొన్ని సినిమాలు మాత్రమే ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయి హిట్టవుతాయి. అయితే డబ్బింగ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాజా నరసింహ’ ఆ లిస్టులోకి చేరలేకపోయింది. నిజానికి ‘పులి మురుగన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసిన దర్శకుడు వైశాక్ ఈ సినిమా కథ-కథనంతో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఉదయ్ కృష్ణ అందించిన కథ ఇది వరకూ తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలను గుర్తుచేస్తుంది. అందువల్ల సినిమాలో కొత్తదనం కనిపించదు.

విలన్ తనకి అడ్డొచ్చిన వారిని వేట కుక్కలతో ఉసిగొలిపి చంపించడం అనేది కూడా గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్షీ కళ్యాణం’ సినిమాలో తెలుగు ప్రేక్షకులు చూసేసారు. అందువల్ల కుక్కలా ఎటాక్ ఎపిసోడ్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఆ సన్నివేశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులు ఉత్కంఠతో చూసేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మమ్ముట్టి బట్లర్ ఇంగ్లీష్ కామెడీ కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది. సినిమాలో మమ్ముట్టి పాత్రకు మనో డబ్బింగ్ చెప్పడంతో చాలా సందర్భాల్లో రజినీ కాంతే గుర్తొస్తాడు. జగపతి బాబు కి మనోజ్ ఇచ్చిన డబ్బింగ్ సింక్ అవ్వలేదు. అందువల్ల జగపతి బాబు విలనిజం చూపించే కొన్ని సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.

మొదటి భాగంలో వచ్చే సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. అయితే మమ్ముట్టి నటన , జగపతి బాబు విలనీ , సన్నీ లియోన్ సాంగ్ , సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ , యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక కథలో ప్రస్తావించిన కల్తీ మందు , అవయవాల మాఫియా గురించి కూడా ఇది వరకే చాలా సినిమాలు వచ్చేయడంతో ఆ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఎట్రాక్ట్ చేయవు. అవన్నీ పక్కన పెడితే మమ్ముట్టి కోసం కొన్ని సన్నివేశాల కోసం ‘రాజా నరసింహా’ ను  ఒకసారి చూడుచ్చు.

రేటింగ్ : 2.5/5