అతడే శ్రీమన్నారాయణ మూవీ రివ్యూ

Wednesday,January 01,2020 - 04:40 by Z_CLU

నటీనటులు: రక్షిత్, శాన్వి, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి తదితరులు
ఛాయాగ్రహణం: కర్మ్ చావ్లా
సంగీతం: చరణ్ రాజ్
నేపథ్య సంగీతం : అజనీష్ లోకనాథ్
బ్యానర్: పుష్కర్ ఫిలిమ్స్
నిర్మాతలు : హెచ్.కె.ప్రకాష్, మల్లికార్జునయ్య
విడుదల: దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ )
దర్శకత్వం: సచిన్ రవి
రన్ టైమ్: 3 గంటల 6 నిమిషాలు
సెన్సార్: U/A
విడుదల తేదీ: జనవరి 1, 2020

కేజీఎఫ్ స్ఫూర్తితో, పాన్-ఇండియా అప్పీల్ తో మరో కన్నడ సినిమా వచ్చింది. దీని పేరు అతడే శ్రీమన్నారాయణ. ఆల్రెడీ కన్నడలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇండియా మొత్తం హిట్టవుతుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

అమరావతిలో ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని కొల్లగొట్టి తెచ్చిన వాడే అభీరా వంశానికి రాజు అవుతాడు. ఈ విషయంలో దొర రామరామ విఫలమౌతాడు. నిధిని కొల్లగొట్టి రాజు అవ్వాల్సిందిగా కొడుకు జయరామకు ఆ బాధ్యత అప్పగించి చనిపోతాడు. అయితే జయరామ ఆ ప్రయత్నాల్లో ఉండగా.. కొంతమంది నాటకాలు వేసే బ్యాచ్ అమరావతిలో ఆ నిధిని దొంగిలిస్తుంది. నిధిని దొంగిలించిన వ్యక్తుల్ని జయరామ పట్టుకుంటాడు. బ్యాండ్ మాస్టర్ ను తప్ప అందర్నీ చంపేస్తాడు. కానీ వాళ్లు ప్రయాణిస్తున్న లారీలో ఆ నిధి ఉండదు. పిచ్చెక్కిన బ్యాండ్ మాస్టర్ మాత్రం ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అది జయరామకు అర్థంకాదు.

అదే సమయంలో అమరావతికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ నేరుగా వెళ్లి జయరామతో పెట్టుకుంటాడు. వారం రోజుల్లోగా నిధిని కనుక్కోకపోతే చంపేస్తానని జయరామ వార్నింగ్ ఇస్తాడు. అయితే శ్రీమన్నారాయణ నిధిని కనుక్కుంటే, సింహాసనం జయరామకు వెళ్లిపోతుంది కాబట్టి.. ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి జయరామ తమ్ముడు ప్రయత్నిస్తుంటాడు.

ఇంతకీ నిధి ఎక్కడుంది.. పిచ్చిపట్టిన బ్యాండ్ మాస్టర్ చెబుతున్న మంత్రాన్ని శ్రీమన్నారాయణ ఛేదించాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ

 

టెక్నీషియన్స్ పనితీరు

నటీనటుల కంటే ముందుగా టెక్నీషియన్స్ గురించే మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రాఫర్ కర్మ్ చావ్లా ఈ సినిమాకు బ్యాక్ బోన్. ఈ మూవీకి పాన్-ఇండియా అప్పీల్ తీసుకొచ్చింది ఇతడే. ఎడిటింగ్ బాగుంది కానీ అనవసర సన్నివేశాలు చాలా ఉన్నాయి. కష్టపడి, ఎఁతో డబ్బు పెట్టిన సీన్స్ ఎందుకు తీసేయాలనుకున్నారో ఏమో అలానే ఉంచేశారు. లోక్ నాథ్ కంపోజ్ చేసిన పాటల్లో టైటిల్ సాంగ్ ఒకటే బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం వందశాతం న్యాయం చేశాడు లోక్ నాథ్. పుష్కర్ ఫిలిమ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అవసరం ఉన్నా లేకపోయినా వందల్లో జూనియర్ ఆర్టిస్టుల్ని పెట్టి సినిమా తీశారు.

ఇక దర్శకుడు సచిన్ విషయానికొస్తే, అతడు ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాడు. ప్రీ-ప్రొడక్షన్ బాగానే చేసుకున్నాడు. అతడి డైరక్షన్ కూడా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో అతడు మరింత జాగ్రత్తపడాల్సింది. పైగా రన్ టైమ్ విషయంలో కూడా అతడు తప్పులు చేశాడు. మొదటి సినిమా కావడంతో ఈ విషయంలో రక్షిత్, దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు లేదు. పైగా స్క్రీన్ ప్లేలో రక్షిత్ పేరు కూడా ఉందంటేనే మేటర్ సగం అర్థమైపోతుంది ఎవరికైనా.

నటీనటుల పనితీరు

రక్షిత్ యాక్టింగ్ బాగుంది. హీరోయిజం చూపించడంలో, కామెడీ పండించడంలో రక్షిత్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు కామెడీ పోలీస్ క్యారెక్టర్ అతడు చేయలేదు. ఇలాంటి ఫాంటసీ మూవీ కూడా చేయలేదు. అయినప్పటికీ రక్షిత్ బాగా చేశాడు. అయితే గెటప్ విషయంలో అతడు మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. ఎందుకంటే.. పాత్రల గెటప్స్, డ్రెస్సింగ్స్ కు రక్షిత్ గెటప్ కు సింక్ అవ్వలేదు.

ఇన్నాళ్లూ గ్లామర్ రోల్స్ కే పరిమితమైన శాన్వి ఈసారి యాక్టింగ్ బాగానే చేసింది. సినిమా మెయిన్ ట్విస్ట్ ఆమె పాత్రపైనే ఉండడంతో శాన్వికి ఈసారి నటించే అవకాశం బాగానే దక్కింది. శ్రీమన్నారాయణ పక్కనే ఉండే కానిస్టేబుల్ అచ్యుత్ పాత్రలో అచ్యుత్ కుమార్ నటన బాగుంది. ఇక బాలాజీ మనోహర్, ప్రమోద్ షెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు.

జీ సినిమాలు రివ్యూ

పాన్-ఇండియా సినిమా తీయాలనే కోరిక సౌత్ లో ఇప్పుడు చాలామందికి ఉంది. ఈ విషయంలో బడ్జెట్ సమస్యలు కూడా లేవు. మంచి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో అంతా తలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో బేసిక్స్ మరిచిపోతున్నారు. దీంతో పాన్-ఇండియా అప్పీల్ సంగతి అటుంచి, లోకల్ గానే నెగెటివ్ కామెంట్స్
వినాల్సి వస్తుంది. అతడే శ్రీమన్నారాయణ అనే సినిమా పరిస్థితి కూడా ఇదే.

బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా హిట్టవ్వడంతో ఆ స్ఫూర్తితో ఈ సినిమా తీశారనే విషయం అర్థమౌతూనే ఉంది. భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథను తీసుకున్నారు కానీ ఆ కథను అంతే ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారు. ఒక్కోసారి తెరపై ఏం జరుగుతుందో కూడా అర్థంకాని విధంగా స్క్రీన్ ప్లే తయారైందంటే సినిమా చేజారిపోయిందనే విషయం మనకు తెలియకుండానే అర్థమైపోతుంది. దీనికితోడు భారీ రన్ టైమ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హీరో-విలన్ ఎలివేషన్లు, కొన్ని అనవసర సన్నివేశాలు తీసేస్తే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది. ఇంకా చెప్పాలంటే.. 3 గంటల నిడివి ఉన్న ఈ మొత్తం కథను 2 గంటల్లో చెబితే సరిపోయేది. ఇంత రన్ టైమ్ తో పాన్-ఇండియా అప్పీల్ కోసం ప్రయత్నించడమే మొదటి తప్పు.

లెంగ్తీ రన్ టైమ్ మాత్రమే కాదు.. సినిమాలో మరికొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు చాలా చోట్ల డైరక్టర్ కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. మరికొన్నిచోట్ల లాజిక్స్ మిస్ అయ్యాడు. అన్నింటికీ మించి ఇది ఏ కాలంలో జరిగిన స్టోరీ అనేది కూడా చెప్పలేదు. వీటికితోడు హీరోయిజం కోసం చాలా రన్ టైమ్ వేస్ట్ చేశారు. కన్నడ ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది కానీ సదరు హీరో ఇంట్రడక్షన్లు మిగతా రాష్ట్రాల ప్రేక్షకులకు అవసరం లేదు. దీనికి తోడు కన్నడ నేటివిటీ కాస్త ఇబ్బంది పెడుతుంది.

ఇన్ని నెగిటివ్స్ మధ్య సినిమాలో పాజిటివ్ అంశాలు లేకుండా పోలేదు. సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రం శ్రీమన్నారాయణ పాన్-ఇండియా మూవీ అనిపించుకుంది. దీనికితోడు భారీగా వేసిన సెట్టింగ్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్ ఈ సినిమాకు మంచి లుక్ అండ్ ఫీల్ ను తీసుకొచ్చాయి. మేకింగ్ లో ఎక్కడా రాజీపడలేదు నిర్మాతలు. సినిమా మొత్తమ్మీద మెయింటైన్ చేసిన కలర్ టిల్ట్ కూడా చాలా బాగుంది. దీనికితోడు సినిమా మొత్తాన్ని రక్షిత్ అద్భుతంగా నడిపించాడు. అతడి బాడీలాంగ్వేజ్, స్టయిల్ బాగుంది. ఫన్నీ పోలీస్ గా రక్షిత్ యాక్టింగ్ బాగుంది.

ఇక కథ విషయానికొస్తే,.. సాగతీత సన్నివేశాలు పక్కనపెడితే, నిధి అన్వేషణకు సంబంధించిన ఈ కథలో ట్విస్టుల్ని మినిమం గ్యాప్స్ లో రివీల్ చేయడం బాగుంది. చివరివరకు వచ్చే ట్విస్టులు ఎట్రాక్ట్ చేస్తాయి. దర్శకుడు ఎంచుకున్న ఫాంటసీ బ్యాక్ డ్రాప్, అతడు డిజైన్ చేసుకున్న వాతావరణంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో స్పెషల్ ఎట్రాక్షన్.

ఓవరాల్ గా “అతడే శ్రీమన్నారాయణ” సినిమాను గ్రాండియర్ విజువల్స్, భారీ సెట్, మంచి ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ కోసం ఓసారి చూడొచ్చు. 3 గంటల లాంగ్ రన్ టైమ్, స్లోగా సాగే కథనాలు మాత్రం ఇబ్బందిపెట్టడం ఖాయం.

రేటింగ్2.5/5