'మత్తు వదలరా' మూవీ రివ్యూ

Wednesday,December 25,2019 - 11:15 by Z_CLU

నటీ నటులు : శ్రీసింహా, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు

ఛాయాగ్రహణం : సురేష్ సారంగం

సంగీతం: కాలభైరవ

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత

రచన, దర్శకత్వం: రితేష్ రానా

విడుదల తేది : 25 డిసెంబర్ 2019

నిడివి : 130 నిమిషాలు

సెన్సార్ : U/A

 

లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయులు శ్రీ సింహ , కాల భైరవ ‘మత్తు వదలరా’ అనే సినిమాతో హీరోగా , సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది.. మరి సింహ , కాల భైరవ మొదటి సినిమాతో మెప్పించారా…జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

సిటీలో అభి(నరేష్ అగస్త్య), ఏసు దాస్(సత్య) లతో కలిసి ఉంటూ డెలివరీ బాయ్ గా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు బాబు మోహన్(శ్రీ సింహ). నెలంతా కష్టపడినా చేతికి కేవలం నాలుగు వేలు రావడంతో ఉద్యోగం మానేసి తన సొంత ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు.

అదే సమయంలో బాబుకి నచ్చచెప్పి డెలివరీ బాయ్ గా మరింత డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాడు ఏసు. అదే చివరి చాన్స్ గా భావించి అది వర్కౌట్ అవ్వకపోతే ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు బాబు. అయితే అలా ఏసు మాటలు విని ఆ రోజు డెలివరీ ఉద్యోగం చేసిన బాబుకి ఊహించని ఓ భయంకర సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన బాబుని హంతకుడిగా మారుస్తుంది. ఇంతకీ ఆ రోజు ఏమైంది..? ఒక అపార్ట్ మెంట్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన బాబు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? చివరికి ఆ హత్య ద్వారా ఓ డ్రాగ్ రాకెట్ గుట్టు ఎలా బయటపడింది.. అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ బాబు పాత్రలో శ్రీ సింహ నటన ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. డబ్బింగ్ కూడా బాగా చెప్పుకున్నాడు. సినిమాలో కీ రోల్ చేసిన నరేష్ అగస్త్య నటన బాగుంది. అభి అనే క్యారెక్టర్ కి అతను పూర్తి న్యాయం చేసాడు. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో సత్య హిలేరియస్ గా నవ్వించాడు. కొన్ని సందర్భాల్లో సినిమాను భుజం మీద వేసుకొని తన కామెడీతో నడిపించాడు. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ పాత్ర దొరకడంతో పావలా శ్యామల తన డైలాగ్ కామెడీ తో నవ్వించింది.

అతుల్య చంద్ర నూతన పరిచయం అయినప్పటికీ మంచి నటన కనబరిచింది. వెన్నెల కిషోర్ ఓ టిపికల్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. అజయ్ , బ్రహ్మాజీ తమ రోల్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. గుండు సుదర్శన్ , అజయ్ ఘోష్ , జీవ తదితరులు చిన్న పాత్రలే చేసినప్పటికీ మెప్పించారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్ ఇచ్చారు. ముఖ్యంగా కాల భైరవ తన నేపథ్య సంగీతంతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు.కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి . సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా వర్క్ మెస్మరైజ్ చేసింది. ఏ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ వర్క్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఇంకాస్త స్పీడ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది.

ఇక రితేష్ కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. ఒక రోజులో జరిగే కథను ఎగ్జైట్ మెంట్ తో ఆసక్తికరంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేసాడు. క్లాప్ ఎంటర్టైన్ మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

కీరవాణి తనయులిద్దరూ కలిసి చేసిన సినిమా కావడం, రాజమౌళి ప్రమోట్ చేయడంతో సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయింది. టీజర్ , ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసాయి. దీంతో కీరవాణి కొడుకుల సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే టీజర్, ట్రైలర్ కంటెంట్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డ రితేష్ థియేటర్ లో ఆడియన్స్ ను సప్రయిజ్ చేసాడు. ఓ  డ్రగ్ రాకెట్ పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథనం రాసుకొని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , ఫన్ తో ఎంటర్టైన్ చేశాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా థ్రిల్లర్ జోనర్ లో ప్రయోగం చేసి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు.

చిన్న బడ్జెట్ లో తక్కువ మంది ఆర్టిస్టులతో ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించి అక్కడక్కడా మెస్మరైజ్ చేసాడు. థ్రిల్లర్ కథకు కామెడీను యాడ్ చేసి మేజిక్ చేసాడు. ప్రారంభం నుండి ఎండింగ్ వరకూ సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు కలిసొచ్చాయి. తనదైన నేపథ్య సంగీతంతో కీరవాణి తనయుడిగా తన టాలెంట్ చూపించాడు భైరవ. కొన్ని సాదా సీదా సన్నివేశాలను కూడా నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ఇక మొదటి భాగంలో వచ్చే ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం నత్త నడకన సాగడం వల్ల కొంతవరకూ బోర్ కొడుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి స్క్రీన్ ప్లే వేగం అందుకుంటుంది. మొదటి భాగంలో హీరో మత్తులో ఉండగా తన పక్కన స్నేహితుల పాత్రలను ఊహించుకోవడంతో అక్కడ సత్య కామెడీ పండించడానికి మంచి స్కోప్ దొరికింది. ఆ స్విచువేషణ్ ని సత్యను సరిగ్గా వాడుకొని హిలేరియస్ గా నవ్వించాడు రితేష్. ఆ టోటల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ నిలిచింది. అలాగే వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ మధ్య వచ్చే సీరియస్ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది.

అయితే సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం గతంలో వచ్చిన కొన్ని థ్రిల్లర్ సినిమాలను గుర్తుచేస్తాయి. కాకపోతే  ఊహించని ట్విస్టుతో ప్రీ క్లైమాక్స్ ను తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక పాటలు , హీరోయిన్, ఫైట్స్ లేకుండా తన డెబ్యూ సినిమాకు ఇలాంటి ఓ ప్రయోగాత్మకమైన కథను ఎంచుకున్న సింహను మెచ్చుకోవాల్సిందే. బేసిక్ గా థ్రిల్లర్ జోనర్ సినిమాలకు సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. మాస్ ప్రేక్షకులు ఈ జోనర్ సినిమాలకు కొంత దూరంగానే ఉంటారు. సో ‘మత్తు వదలరా’ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి మంచి ఛాయిస్ అవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మాస్ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోవడం కష్టమే. మరి కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ మెప్పుతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ సాదిస్తుందో చూడాలి.

రేటింగ్ : 2.75 /5