Movie Review - లాఠీ

Thursday,December 22,2022 - 04:46 by Z_CLU

విశాల్ నుంచి మరో సినిమా వచ్చింది. ఈసారి పాన్ ఇండియా కథ అంటూ లాఠీ రిలీజ్ చేశాడు ఈ నటుడు. మరి విశాల్ చెప్పినట్టు ఈ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందా? చాన్నాళ్లుగా ఊరిస్తున్న విజయాన్ని ఈ సినిమాతో విశాల్ అందుకున్నాడా లేదా?

Vishal Laatti Movie review

కథ
మురళీ కృష్ణ (విశాల్) ఓ సాధారణ కానిస్టేబుల్. అతడి భార్య కవి (సునైన), కొడుకుతో హ్యాపీగా ఉంటాడు. అయితే ఉన్నట్టుంది ఓ అమ్మాయి మర్డర్ కేసులో తనకు సంబంధం లేకుండానే సస్పెండ్ అవుతాడు మురళి. ఆ తర్వాత తన పై అధికారి సిఫార్సుతో తిరిగి డ్యూటీలో చేరతాడు. అప్పట్నుంచి లాఠీ పట్టకూడదని నిర్ణయించుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల మధ్య మురళి లాఠీ పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ సమస్య తన కుటుంబం వరకు వస్తుంది. మరి ఆ సమస్య నుంచి ఆ సాధారణ కానిస్టేబుల్ ఎలా బయటపడ్డాడు? అనేది స్టోరీ.

నటీనటుల పనితీరు
విశాల్ లో మంచి నటుడున్నాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విశాల్ యాక్టింగ్ ను ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ కథను ఒంటి చేత్తే నడిపించాడు. ఎప్పట్లానే రిస్కీ ఫైట్లు చేశాడు. నిజంగానే దెబ్బలు తిన్నాడు. హీరోయిన్ సునైన పాత్ర చాలా చిన్నది. ఫస్టాఫ్ లో ఆమె పాత్ర మెరుస్తుంది, సెకండాఫ్ లో ఒక సీన్ లో తప్ప కనిపించదు. మిగతా పాత్రలన్నీ తమ పరిథి మేరకు నటించాయి.

టెక్నీషియన్స్ పనితీరు
సినిమాలో బోలెడన్ని ఫైట్స్ కనిపిస్తాయి. అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ క్రెడిట్ పీటర్ హెయిన్ కు దక్కుతుంది. ఇక యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరోసారి మెప్పించాడు. పాటతో ఆకట్టుకోలేకపోయాడు. బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో సినిమాను ఇంకాస్త తగ్గించొచ్చు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో ట్రిమ్స్ అవసరం. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

Vishal Laatti Movie review
జీ సినిమాలు రివ్యూ
తన సినిమాల్లో యాక్షన్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు విశాల్. మరి అదే యాక్షన్ అడుగడుగునా కనిపిస్తే ఎలా ఉంటుంది? యాక్షన్ తో పాటు కూసింత ఎమోషన్ కూడా ఉండేలా జాగ్రత్తపడతాడు? మరి అదే ఎమోషన్ సెకెండాఫ్ మొత్తం పీక్స్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? విశాల్ నటించిన తాజా చిత్రం లాఠీ అచ్చంగా ఇలానే ఉంది. ఇదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్, సేమ్ టైమ్ ఇదే ఈ సినిమాకు మైనస్ పాయింట్ కూడా.

క్లయిమాక్స్ కు వచ్చిందనుకున్న పాయింట్ దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు దర్శకుడు. ఇక అక్కడ్నుంచి కథను ఓ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోకి మారుస్తాడు. సింగిల్ లొకేషన్, గంటన్నర డ్యూరేషన్, మొత్తం ఫైట్స్.. లాఠీ సినిమాలో సెకండాఫ్ మొత్తం ఇదే. క్లయిమాక్స్ ఏంటనేది ఇంటర్వెల్ కే తెలుస్తుంది కాబట్టి, ఎప్పుడు సినిమా ముగుస్తుందా అని ఎదురుచూడడం మన వంతు.

ఈ గంటన్నర సెకెండాఫ్ లో వరుసగా ఫైట్స్ పెడితే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకేనేమో దర్శకుడు ఇక్కడ విక్రమ్, కేజీఎఫ్ లాంటి సినిమాల నుంచి ఫుల్లుగా స్ఫూర్తి పొందాడు. చిన్నచిన్న ట్విస్టులు ఇచ్చాడు. అయితే అలానే కథను క్లయిమాక్స్ వరకు తీసుకెళ్తే బాగుండేది. చివర్లో మళ్లీ ఎమోషన్ పెట్టాడు, ఫాదర్ సెంటిమెంట్ అద్దాడు, టైటిల్ కు జస్టిఫికేషన్ ఇస్తూ లాఠీతో మళ్లీ ఇంకో ఫైట్ పెట్టాడు. దీంతో ఇక చాలురా బాబూ అనిపిస్తుంది లాఠీ. ఎంత కొట్టిగా ఆ లాఠీ విరగదా అనే అనుమానం కూడా కలిగిస్తుంది.

యాక్షన్ ఎంతయినా పెట్టొచ్చు, కానీ ఎమోషన్ ను మాత్రం పెర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే పండుతుంది. ఏమాత్రం తగ్గినా లేదా ఓవర్ డోస్ అయినా తేడా కొట్టేస్తుంది. లాఠీ సెకండాఫ్ లో ఆ తేడా స్పష్టంగా కనిపించింది. కేవలం హీరో, అతడి కొడుకు, విలన్లతో గంటన్నర పాటు నడిపిన విధానం ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, హై ఎమోషన్ వల్ల ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ అనిపిస్తుంది సినిమా.

ప్రజలకు సమస్య వస్తే పోలీస్ దగ్గరకు వెళ్తారు. రాజకీయ నాయకుడికి సమస్య వస్తే టోటల్ డిపార్ట్ మెంట్ కదులుతుంది. మరి ఓ కానిస్టేబుల్ కు సమస్య వస్తే ఏమౌతుంది? ఆ సమస్య అతడి కుటుంబానికి కూడా చుట్టుకుంటే ఏంటి పరిస్థితి? కానిస్టేబుల్ ను ఆదుకోవడానికి డిపార్ట్ మెంట్ రాదు, అతడి సమస్యను అతడే తీర్చుకోవాలనే కోణంలో కథను అల్లుకున్నారు. కానీ ఆ పాయింట్ ను మరో హెడ్ కానిస్టేబుల్ తో చెప్పించి మమ అనిపించారు. పూర్తిస్థాయిలో జస్టిఫికేషన్ ఇవ్వలేదు.

ఈ హై ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఒంటిచేత్తో నడిపించాడు విశాల్. ఇలాంటి సినిమాలు ఎన్నో చేసిన అనుభవం ఉన్న ఈ నటుడు, తన ఎక్స్ పీరియన్స్ మొత్తం ఈ సినిమాలో చూపించాడు. విశాల్ నటన ‘లాఠీ’లో హైలెట్. హీరోయిన్ సునైన పాత్రను సరిగ్గా రాసుకోలేదు. ఫస్టాఫ్ లో కథతో సమానంగా నడిపించిన హీరోయిన్ పాత్రను, సెకండాఫ్ కు వచ్చేసరికి కేవలం ఒకే ఒక సీన్ కు పరిమితం చేశారు. కేవలం హీరోయిన్ పాత్ర ఒక్కటే కాదు, దాదాపు సినిమాలోని పాత్రలన్నీ (విలన్లు తప్ప) సెకెండాఫ్ నుంచి పూర్తిగా కనుమరుగవుతాయి.

టెక్నికల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ల గురించే ముందుగా మాట్లాడుకోవాలి. దర్శకుడి కంటే ఫైట్ మాస్టర్ల వర్క్ ఎక్కువగా కనిపించిన చిత్రమిది. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన ఫైట్స్ అన్నీ బాగున్నాయి. సెకండాఫ్ మొత్తాన్ని ఇతడి ఫైట్సే నడిపించాయి. ఇక దర్శకుడిగా వినోద్ కుమార్ బాగానే మెప్పించాడు. స్క్రీన్ ప్లే కూడా బాగా నడిపించాడు. కాకపోతే హెవీ డోస్ ఎమోషన్ కాస్త తగ్గించాల్సింది. ఉన్న ఎమోషన్ ను కూడా కనెక్ట్ అయ్యేలా తీయలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్టాఫ్ లో పెట్టిన పాట అనవసరం. డీవోపీ, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా విశాల్ నుంచి ఆశించిన యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్న సినిమా ఈ లాఠీ. క్లయిమాక్స్ ఏంటనేది అందరూ ముందుగానే ఊహించుకుంటారు కాబట్టి, కాస్త ఓపిగ్గా సెకండాఫ్ మొత్తం చూడగలిగితే సినిమా బాగుంటుంది.

రేటింగ్2.5/5