Movie Review - 18 పేజీస్

Friday,December 23,2022 - 02:00 by Z_CLU

నటీ నటులు : నిఖిల్ సిద్ధార్థ్, అనుప‌ర‌మేశ్వ‌ర‌న్ , అజయ్ , శత్రు , గోపరాజు , దినేష్, సరయు త‌దిత‌ర‌లు

సంగీతం : గోపి సుందర్

కెమెరా : వసంత్

ఎడిటింగ్ : న‌వీన్ నూలీ

సమర్పణ : అల్లు అరవింద్

నిర్మాణం : గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్

నిర్మాత : బన్నీ వాస్

కథ : సుకుమార్

స్క్రీన్ ప్లే -దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్

విడుదల తేది : 23 డిసెంబర్ 2022

నిడివి : 137 నిమిషాలు

‘కార్తికేయ 2’ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత నిఖిల్ , అనుపమ జంటగా తెరకెక్కిన 18 పేజిస్ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. మరి సుకుమార్ కథతో దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను అలరించి ఆకట్టుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

18 pages movie nikhil Anupama parameswaran

కథ :

సిద్దు ఓ ప్రైవేట్ కంపెనీలో యాప్ డెవలపర్ గా వర్క్ చేస్తుంటాడు. తను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తట్టుకోలేకపోతాడు. ఈ క్రమంలో సిద్దు కి అనుకోకుండా ఓ డైరీ దొరుకుతుంది. నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయికి చెందిన ఆ డైరీ లో 18 పేజిస్ చదివి సిద్దు ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రతీ పేజీ చదువుతూ ప్రెజెంట్ లో జరుగుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెతో ప్రేమలో పడతాడు. అసలు నందిని ఎవరు ? ఆమె డైరీ సిద్దు చేతికి ఎలా వచ్చింది ?ఫైనల్ గా నందిని ని సిద్దు కలిశాడా ? లేదా ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

నిఖిల్ తన పెర్ఫార్మెన్స్ తో సిద్దుగా మెప్పించాడు. నందిని డైరీ చదివే సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రీ క్లైమాక్స్ లో నిఖిల్ నటన ఆకట్టుకుంది. నందిని కేరెక్టర్ కి అనుపమ పరమేశ్వరన్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. తన క్యూట్ ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. సరయుకి మంచి పాత్ర దక్కడంతో తన డైలాగ్స్ తో అలరించింది. సందీప్ పాత్రకు దినేష్  సూటయ్యాడు.

లాయర్ గా పోసానీ కృష్ణ బస్ కండక్టర్ గా గోపరాజు ఆకట్టుకున్నారు. అజయ్ , శత్రు నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ ప్లే చేసి ఆ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించిన కొత్తవాళ్ళు నేచురల్ గా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరీకైనా మెస్మరైజ్ చేసే మ్యూజిక్ చాలా అవసరం. ఈ సినిమాకు గోపి సుందర్ నుండి బెస్ట్ మ్యూజిక్ లభించింది. సాంగ్స్ తో పాటు కొన్ని సందర్భాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్స్ స్కోర్ మంచి ఫీల్ తీసుకొచ్చింది. మ్యూజిక్ పరంగా సినిమాకు బెస్ట్ అవుట్ అందింది. వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. న‌వీన్ నూలీ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్ప్ గా ఎడిట్ చేసి పర్ఫెక్ట్ రన్ టైం లాక్ చేయడం బాగా కలిసొచ్చింది.

సుకుమార్ అందించిన లవ్ స్టోరీ బాగుంది. దానికి ప్రతాప్ రాసుకున్న స్క్రీన్ ప్లే తో నెరేట్ చేసిన విధానం ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ వేల్యూస్ క్వాలిటీ మిస్ అవ్వకుండా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

18 pages movie nikhil Anupama parameswaran

జీ సినిమాలు సమీక్ష :

సుకుమార్ రైటింగ్స్ నుండి ఏదైనా కథ వచ్చిందంటే అందులో యునిక్ నెస్ ఉంటుంది. ‘కుమారి 21 ఎఫ్’ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ -ప్రతాప్ కాంబినేషన్ లో ఓ లవ్ స్టోరీ వస్తుందనగానే 18 పేజిస్ పై ఆటోమేటిక్ గానే మంచి ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. టైటిల్ , ఫస్ట్ లుక్ ఇలా అన్ని ఎట్రాక్ట్ చేశాయి. సాంగ్స్ మంచి బజ్ తీసుకొచ్చాయి. అయితే ట్రైలర్ చూసి ఇది ‘కుమారి 21’ఎఫ్ లాంటి కథే అనుకొని ఊహించి థియేటర్స్ కి వెళ్తే మాత్రం పొరపాటే. ఇందులో ’18 పేజిస్’ అంటూ డైరీ ద్వారా సరికొత్త ప్రేమకథ చూపించారు.

ముఖ్యంగా క్యారెక్టరైజేషణ్స్ చక్కగా కుదరడం, నిఖిల్ -అనుపమ ఆ పాత్రల్లో ఒదిగిపోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. మొబైల్ వాడకుండా మనుషులతో కనెక్ట్ ఉండాలనుకునే అమ్మాయి, ఆ లక్షణం నచ్చి ఆమెను చూడకుండానే ఇష్టపడే అబ్బాయి ప్రేమకథతో 18 పేజిస్ మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతూ ప్లీసేంట్ మ్యూజిక్ తో ఆకట్టుకున్న ఈ సినిమా సెకండాఫ్ నుండి కొత్త టర్న్ తీసుకొని అసలు ఏం జరిగిందనే ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకుడు కూడా ఊహించని ట్విస్ట్ లతో సినిమా ముగుస్తుంది.

సుకుమార్ అందమైన లవ్ స్టోరీకి ప్రతాప్ రాసుకున్న ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే , నెరేషన్ మెప్పిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ , ఫీల్ కలిగించే సన్నివేశాలు , ఆసక్తి నెలకొల్పే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పర్ఫెక్ట్ రన్ టైం లాక్ చేసుకోవడం సినిమాకి కలిసొచ్చింది. క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంది. అసలు విషయం తెలిసాక సినిమాను ఇంకాస్త నడిపించే సన్నివేశాలు మాత్రం డ్రాగ్ అనిపిస్తాయి. కానీ ఎండ్ టైటిల్స్ కి ముందు వచ్చే సీన్ ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సినిమాలో ఎంటర్టైన్ మెంట్ మిస్ అయ్యిందనిపిస్తుంది కానీ సుకుమార్ -ప్రతాప్ ఈ కథను కాస్త సీరియస్ గా చెప్పాలని భావించినట్టున్నారు. అలాగే అక్కడక్కడా సినిమా కాస్త స్లో గా సాగడం మైనస్. “ప్రేమించడానికి కారణం ఉండకూడదు కరెక్టే , కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన ఇంత గొప్ప ప్రేమని ఎలా కాదనగలం” అంటూ సుకుమార్ వాయిస్ తో సినిమాను ఎండ్ చేసిన విధానం బాగుంది. సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకూ తన మ్యూజిక్ తో మంచి ఫీల్ తీసుకొచ్చాడు గోపి సుందర్. సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు బిగ్ ఎస్సెట్ అనిపించాడు.

నిఖిల్ నటన , అనుపమ పరమేశ్వరన్ కేరెక్టర్ – క్యూట్ పెర్ఫార్మెన్స్ , సుకుమార్ కథ , పల్నాటి సూర్య ప్రతాప్ స్క్రీన్ ప్లే -నెరేషన్, గోపి సుందర్ మ్యూజిక్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ అనిపిస్తాయి. ఓవరాల్ గా 18 పేజీల ప్రేమ కథ ప్రేక్షకులను మెప్పించి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది.

రేటింగ్ : 3 /5