Movie Review - కనెక్ట్

Thursday,December 22,2022 - 12:15 by Z_CLU

నటీ నటులు :  అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస

సంగీతం : పృథ్వి చంద్రశేఖర్‌

సినిమాటోగ్రఫీ : మణికంఠన్ కృష్ణమాచారి

ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్

నిర్మాత : విఘ్నేష్ శివన్

రచన – దర్శకత్వం : అశ్విన్‌ శరవణన్‌

విడుదల తేది :  22 డిసెంబర్ 2022

నిడివి : 99 నిమిషాలు

గంట నలబై నిమిషాల నిడివితో ఇంటర్వల్ లేకుండా దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ‘కనెక్ట్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నయనతార ప్రధాన పాత్రలో రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

సూసన్ (నయనతార) భర్త జోసెఫ్ (వినయ్ రాయ్) డాక్టర్. కోవిడ్ టైంలో పేషంట్స్ ట్రీట్ మెంట్ చేస్తూ కరోన బారిన పడతాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే తన కూతురు అన్నా (హనియా నాఫిసా) తో భర్త ట్రీట్ మెంట్ ను వీడియో కాల్ ద్వారా చూస్తూ బాధ పడుతుంటుంది సూసన్. అయితే కరోన నుండి కోలుకునే ప్రయత్నంలో జోసెఫ్ మరణిస్తాడు. తండ్రి మరణంతో అన్నా డిస్టర్బ్ అవుతుంది. జోసెఫ్ మరణించిన కొన్ని వారాలకి ఓ విజార్డ్ బోర్డ్ ద్వారా తన తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.

అక్కడి నుండి సూసన్ , అన్నా జీవితం తలకిందులవుతుంది. అన్నా కి దెయ్యం పట్టిందని గమనించి సూసన్ తండ్రి ఆర్థర్ (సత్య రాజ్) ఆత్మను వదిలే దారి కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న పాస్టర్ (అనుపమ్ ఖేర్) ను ఆశ్రయిస్తాడు ఆర్థర్. మరి చివరికి ముంబై చర్చ్ పాస్టర్ ద్వారా అన్నా లో ఉన్న ఆత్మ ను ఎలా బయటికి పంపారు ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

నయనతార తన పాత్రలో ఒదిగిపోయింది. కూతురి ఆరోగ్యం గురించి తల్లడిల్లిపోయే తల్లి పాత్రలో ఆకట్టుకుంది. కాకపోతే నయనతార నుండి ఎక్కువ ఊహించి వెళ్తే మాత్రం పాత్ర నిరాశ పరుస్తుంది. సత్య రాజ్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. కొన్ని హారర్ సన్నివేశాల్లో సత్య రాజ్ నటన బాగుంది. హనియా నఫీస్ మంచి నటన కనబరిచి సినిమాకు ప్లస్ అయ్యింది. క్లైమాక్స్ లో కనిపించే ఓ స్పెషల్ కేరెక్టర్ లో అనుపమ్ ఖేర్ నటన బాగుంది. మిగతా నటీ నటులంతా వారి వారి పాత్రలతో అలరించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు అశ్విన్ శరవణన్ టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకోవడంలో దిట్ట. గేమ్ ఓవర్ , మయూరి సినిమాల్లో కూడా టెక్నికల్ వర్క్స్ గురించి అందరూ అదే చెప్పుకున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకి కూడా టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ వర్క్ ఇచ్చారు. మ్యూజిక్ , సౌండ్ డిజైనింగ్ , కెమెరా వర్క్ , విజివల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.  మణికంఠన్ కృష్ణమాచారి విజువల్స్ తో పాటు పృథ్వి చంద్రశేఖర్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. అశ్విన్ శరవణన్ కథ -కథనం రొటీన్ గా ఉన్నాయి. విజ్ఞేష్ శివన్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష : 

కొన్నేళ్లుగా అన్ని భాషల్లో కలిపి చాలానే హారర్ సినిమాలు వచ్చాయి. కొందరు దర్శకులు హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమాలను ఆదర్శంగా తీసుకొని మెప్పిస్తే మరికొందరు హారర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ తో మెస్మరైజ్ చేశారు. తాజాగా వచ్చిన ‘మసూద’ వరకూ తెలుగులో చాలా హారర్ సినిమాలొచ్చాయి. అయితే హారర్ సినిమా అంటే అదే కథ ఉంటుంది అన్నట్టుగా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించేశాయ్. అందుకే ఈ జానర్ సినిమా సూపర్బ్ అనే టాక్ తెచ్చుకుంటే  తప్ప ప్రేక్షకులు ఇల్లు కదలని పరిస్థితి. అయితే ఇంటర్వెల్ లేకుండా అశ్విన్ శరవణన్ ఓ కొత్త ప్రయత్నం చేశాడు. అందరికీ కనెక్ట్ అయ్యే కోవిడ్  19 బ్యాక్ డ్రాప్ కథ ఎంచుకున్నాడు. కానీ  రొటీన్ సినిమాగా తీర్చి దిద్ది మెప్పించలేకపోయాడు.

సినిమా ప్రారంభమైన పది నిమిషాల వరకూ దర్శకుడు కరోన , లాక్ డౌన్ టైంలో ఓ హారర్ కథ చెప్పబోతున్నాడని ఊహించిన ప్రేక్షకులకు కాసేపటికే ఒక అమ్మాయికి దెయ్యం పట్టడం , ఇంట్లోనే భయపెడుతూ తిరగడం చూపించాడు అశ్విన్. అక్కడి నుండి సినిమా రొటీన్ హారర్ థ్రిల్లర్ గా ముందుకు నడుస్తుంది. ఆత్మను వదిలించే ప్రయత్నం చేయడం , క్లైమాక్స్ లో ఓ ప్రేయర్ ద్వారా ఆత్మను శరీరం నుండి పంపించడం లాంటివి చూపించి రొటీన్ అనిపిస్తూ బోర్ కొట్టించాడు. అక్కడక్కడా భయపెట్టే సన్నివేశాలు బాగానే డిజైన్ చేసుకున్నాడు కానీ కొత్త రకంగా థ్రిల్ చేయలేకపోయాడు. ఆన్లైన్  బఫరింగ్ ని కొన్ని సార్లు బాగానే వాడుకొని ఎంటర్టైన్ చేశాడు. ఇక దెయ్యం పట్టిన పాప తాతయ్య తల్లడిల్లిపోతుంటే ఆమె తల్లి పాత్ర చేసిన నయనతార మాత్రం అస్సలు భయపడకుండా ఇంట్లో క్యాజువల్ గా తిరుగుతుండటం ప్రేక్షకుడికి మింగుడు పడదు.

నిజానికి అశ్విన్ కరోన టైంలో చనిపోయిన ఓ డాక్టర్ ఆత్మ కథతో కాసింత హారర్ జోడించి కొత్తగా తీస్తే బాగుండు కానీ ఇప్పటికే ఎన్నో చూసేసిన హారర్ సినిమాల్లో లానే అదే ఫార్మేట్ ప్లాన్ చేసుకొని భయపెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అశ్విన్ గత సినిమాలు చూసి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి వెళ్తే నిరాశ పడటం ఖాయం. ఓవరాల్ గా నయనతార ‘కనెక్ట్’ హారర్ లవర్స్ కి కూడా ఓ మోస్తరుగా కనెక్ట్ అవుతుంది తప్ప పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

 

రేటింగ్ : 2/5