Movie Review - దాస్ కా ధమ్కీ

Wednesday,March 22,2023 - 03:50 by Z_CLU

నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పెతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్ తదితరులు..
కథనం-మాటలు-దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
కథ: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
రన్ టైమ్: 2 గంటల 31 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: మార్చి 22, 2023

das-ka-dhamki-Review

కథ
ఓ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తుంటాడు కృష్ణ దాస్ (విశ్వక్ సేన్). ఇతడొక అనాధ. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ మాత్రమే ఇతడికి తోడు. మరోవైపు అదే సిటీలో ఎస్ఆర్ ఫార్మాకు సీఈవోగా ఉంటాడు సంజయ్ రుద్ర (మరో విశ్వక్ సేన్). ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకుంటాడు కృష్ణ దాస్. అనుకోకుండా ఇతడి జీవితంలోకి సంజయ్ రుద్ర వస్తాడు. ప్రపంచంలో కాన్సర్ అనేది లేకుండా చేయాలని చూస్తాడు సంజయ్ రుద్ర. ఇతడి రాకతో కృష్ణ దాస్ జీవితం ఎలా మారింది? మధ్యలో ఎంటరైన కీర్తి (నివేత పెతురాజ్) ఎవరు? అసలు దాస్, సంజయ్ కలిసి ఏం చేశారనేది బ్యాలెన్స్ స్టోరీ.

నటీనటుల పనితీరు
కథగా కంటే స్క్రీన్ ప్లే, ట్విస్టులే సినిమాలో కీలకం కాబట్టి కథలో వాటిని టచ్ చేయడం లేదు. ఈ మలుపులతో తిరిగే కథను విశ్వక్ సేన్ ఒంటిచేత్తో నడిపించాడు. దాస్ గా, సంజయ్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో మెప్పించాడు. వీటిలో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ కూడా కావడంతో, విశ్వక్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఇక నివేత పెతురాజ్ గ్లామరస్ హీరోయిన్ గా మెప్పించింది. ఆమె పాత్రకు కూడా సినిమాలో వెయిట్ ఉంది. కీలక పాత్రలు పోషించిన రావు రమేష్, రోహిణి, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ కామెడీతో మెప్పించారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది పంచ్ లు కొన్ని సినిమాలో బాగా పేలాయి.

టెక్నీషియన్స్ వర్క్
దర్శకుడిగా విశ్వక్ సేన్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమా తీశాడు. పైగా ఈసారి అతడికి బడ్జెట్ అడ్డంకులు కూడా లేకపోవడంతో, అనుకున్నది అనుకున్నట్టుగా బాగా తీయగలిగాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ తడబడ్డాడు. ఇక డైలాగ్ రైటర్ గా తను ఉండకుండా, మరో వ్యక్తికి ఆ బాధ్యత అప్పగిస్తే బాగుండేది. బెజవాడ ప్రసన్నకుమార్ రాసుకున్న కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ, లేయర్స్, ట్విస్టులు బాగున్నాయి.

లియాన్ జేమ్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మామా బ్రో సాంగ్ కంపోజ్ చేసిన రామ్ మిరియాల మరోసారి తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. స్వయంగా నిర్మాత కూడా కావడంతో, విశ్వక్ సేన్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

das-ka-dhamki-Review

జీ సినిమాలు సమీక్ష
రీసెంట్ గా ధమాకా వచ్చింది. గోపీచంద్ హీరోగా గౌతమ్ నందా కూడా వచ్చింది. ఆమధ్య డీజే టిల్లూ కూడా వచ్చింది. వీటి మధ్యలో రవితేజ నటించిన ఖిలాడీ కూడా ఉంది. దాస్ కా ధమ్కీ గురించి చెప్పడం మొదలుపెడితే, ముందుగా ఈ సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాల్లో కనిపించిన ఎలిమెంట్స్ అన్నీ అక్కడక్కడ ధమ్కీలో కనిపిస్తాయి. బహుశా అందుకేనేమో ఈ సినిమా ఛాయలు కనిపించకుండా చేయడానికి కథకుడు బెజవాడ ప్రసన్నకుమార్, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు విశ్వక్ సేన్ చాలా కష్టపడ్డారు. కథలో చాలా ట్విస్టులిచ్చారు. వీటిలో కొన్ని మెప్పిస్తాయి, మరికొన్ని అంతగా ఆకట్టుకోవు.

స్టార్ హోటల్ లో వెయిటర్ గా కృష్ణ దాస్ పాత్రలో విశ్వక్ సేన్ ఎంట్రీతో కథ మొదలవుతుంది. ఇలా వస్తూనే, సూపర్ హిట్ సాంగ్ ‘మామా బ్రో’ పాటతో మొదలుపెడతాడు హీరో. ఆ పాటలోనే పాత్రల పరిచయం, ఆ పాటపైనే టైటిల్స్ వేస్తూ నేరుగా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు.

అక్కడ్నుంచి హీరోయిన్ పరిచయం, ఆమె దగ్గర తన బ్యాక్ గ్రౌండ్ దాచడం, మధ్యలో స్నేహితులు హైపర్ ఆది, రంగస్థలం మహేష్ కామెడీతో ఫస్టాఫ్ ను నడిపించిన దర్శకుడు… ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేవరకు కథలో పెద్దగా మలుపులు చూపించలేదు. హీరోయిన్ తో దోబూచులాటలు మాత్రమే కనిపిస్తాయి. అలా సరదాగా సాగిపోతున్న కథకు మంచి ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ వేశారు.

సెకెండాఫ్ నుంచి అసలు కథలోకి దూసుకుపోతాడు మన హీరో కమ్ డైరక్టర్. ఇక్కడ్నుంచి మనకు ట్విస్టులు, టర్న్ లు బోలెడు కనిపిస్తాయి. వీటిలో కొన్ని మెప్పిస్తాయి, కొన్ని అంతగా నచ్చవు, మరికొన్ని ఊహించినట్టుగా ఉంటాయి. వీటి మూలంగా ఫస్టాఫ్ మొత్తం రొమాంటిక్ కామెడీగా కనిపించిన సినిమా, ఇంటర్వెల్ తర్వాత థ్రిల్లర్ గా మారిపోతుంది.

మల్టీ లేయర్స్ ఉన్న ఈ కథపై విశ్వక్ సేన్ అండ్ టీమ్ బాగానే వర్క్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే కథ-స్క్రీన్ ప్లే పరంగా పైన చెప్పుకున్న సినిమాలు గుర్తుకురావడం ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. వావ్ అనిపించే, ఆశ్చర్యం కలిగించే ట్విస్టులు సినిమాలో తక్కువ. ఉదాహరణకు రావురమేష్ పాత్రనే తీసుకుంటే, ఓపెనింగ్ లో అతడ్ని చూసినప్పుడే ఏదో ఉందనే అనుమానం కొడుతుంది. ఇలాంటి అనుమానాస్పద పాత్రలు కథలో మరో 3-4 ఉన్నాయి. నివేత పెతురాజ్ క్యారెక్టర్ మాత్రం షాక్ ఇస్తుంది.

రైటింగ్ లో లోపాల్ని పక్కనపెడితే.. విశ్వక్ సేన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెరవెనక కష్టపడుతూనే, తెరపై హీరోగా తన ముద్ర వేశాడు. మరీ ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ను అద్భుతంగా పండించాడు. ఇక సినిమా ముగిసిన తర్వాత, పార్ట్-2 కూడా ఉందంటూ చివర్లో చూపించిన 10 నిమిషాల ట్విస్ట్ హైలెట్. ఫుట్ పాత్ కుర్రాడిగా, కన్నింగ్ ధనవంతుడిగా విశ్వక్ రెండు షేడ్స్ ను అద్భుతంగా పండించాడు. హీరోయిన్ నివేత పెతురాజ్ మరోసారి మంచి పాత్ర పోషించింది. రావురమేష్, రోహిణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడిగా విశ్వక్ సేన్ కు ఫుల్ మార్కులు పడతాయి. ఫలక్ నుమా దాస్ తర్వాత మరోసారి తన టాలెంట్ చూపించాడు విశ్వక్. ఈ సినిమాను ఏరికోరి మరీ అతడే ఎందుకు డైరక్ట్ చేశాడో సినిమా చూస్తే అర్థమౌతుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. డైలాగ్స్ లో కూడా మ్యూట్స్ ఎక్కువయ్యాయి. సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ ఈ సినిమాతో మెరిశాడు. పాటలన్నీ బాగున్నాయి. ఓపెనింగ్ సాంగ్ మామా బ్రోను కంపోజ్ చేసి, సినిమాకు సూపర్ హిట్ సాంగ్ అందించిన రామ్ మిరియాలకు స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కథ కోసం ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ ఓకే.

ఓవరాల్ గా ధమ్కీ టైటిల్ తో వచ్చిన విశ్వక్ సేన్ టైటిల్ కు న్యాయం చేశాడు. హీరోగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు పాత సినిమాల్ని గుర్తుకు తెచ్చుకోకుండా, ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా, ఓపెన్ మైండ్ తో వెళ్తే ఈ ధమ్కీ నచ్చుతుంది. కామెడీ, సాంగ్స్ బోనస్.

రేటింగ్2.5/5