Movie Review - దసరా మూవీ రివ్యూ

Thursday,March 30,2023 - 02:33 by sumanth

నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహబ్ తదితరులు
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
నిడివి : 156 నిమిషాలు
విడుదల తేదీ: 30 మార్చి 2023

నేచురల్ స్టార్ నాని, ఊర మాస్ అవతార్ లో నటించిన మోస్ట్ ఏవైటింగ్ మాస్ మూవీ ‘దసరా’ ఈరోజే భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చింది. మరి దసరా నాని కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకుందా? ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ మూవీ తో మెస్మరైజ్ చేశాడా? జీ సినిమాకు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

dasara telugu review

కథ :
వీర్లపల్లి గ్రామంలో ఉండే మనుషులంతా తాగుడుకి బానిసలవుతారు. మందు త్రాగడం సంప్రదాయంగా ఫీలవుతుంటారు. ఆ ఊర్లో ఉండే సిల్క్ బార్ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు మద్యపాన నిషేధం కారణంగా మూత పడుతుంది. ఆ బార్ మూసివేత ఆ ఊరి రాజకీయకీయాల్లో పెను మార్పు తీసుకొస్తుంది. దాంతో చిన్నతనం నుండి స్నేహితులుగా కలిసి పెరిగిన ధరణి, సూరి, వెన్నెల జీవితంలో కూడా పెను మార్పు వస్తుంది. ఓ సందర్భంలో వెన్నెల, సూరి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ధరణి తన జీవితంలో జరిగిన ఓ సంఘటన తర్వాత ఆ ఊరి పెద్ద చిన్ననంబియ్యపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:
ధరణి పాత్రలో నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాకు అతడి నటనే బ్యాక్ బోన్. ధరణి కోసం దసరాను కచ్చితంగా ఓసారి చూడాల్సిందే. ఇక వెన్నెల గా కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె మేనరిజమ్స్ కూడా బాగున్నాయి. కథను, క్యారెక్టర్ ను, నేపథ్యాన్ని బాగా అర్థం చేసుకొని నటించింది. ఒక సన్నివేశంలో బెస్ట్ నటన కనబరిచింది. దీక్షిత్ శెట్టి కి కథలో మంచి ఇంపార్టెన్స్ దక్కింది. సముద్రఖని కి స్కోప్ లేని పాత్ర దక్కగా.. సాయి కుమార్, జరీనా వహబ్ కి మంచి సన్నివేశాలు పడ్డాయి.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తను అనుకున్న సబ్జెక్ట్ ను అనుకున్నట్టు తెరకెక్కించాడు. తొలిసారి దర్శకత్వం వహించినప్పటికీ, అతడి మేకింగ్ విధానం ఆకట్టుకుంటుంది. చిన్నచిన్న డీటెయిలింగ్ కూడా మిస్సవ్వలేదు. ఇక రైటింగ్ పరంగా కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ధరణి, వెన్నెల పాత్రల్ని అతడు రాసుకున్న విధానం బాగుంది. తనకు బాగా తెలిసిన తెలంగాణ నేపథ్యం, భాష కావడంతో.. శ్రీకాంత్ పని మరింత ఈజీ అయిపోయింది.

ఇక దర్శకుడి తర్వాత సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడికి క్రెడిట్ ఇవ్వాలి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ దసరాకు హైలెట్ గా నిలవగా.. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతకుమించి అన్నట్టుంది. వీళ్లిద్దరి వర్క్స్ సినిమాలో పోటాపోటీగా సాగాయి. ఎక్కడా తగ్గలేదు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కొత్త దర్శకుడ్ని నమ్మి ఇంత ఖర్చు చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.

dasara telugu review

జీ సినిమాలు సమీక్ష:
నాని ఇప్పటివరకు చాలా పాత్రలు, కొత్త సినిమాలు చేశాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు.  దసరా నాని లో మరో కోణాన్ని ఆవిష్కరించి నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా కోసం రొటీన్ రివేంజ్ కథే ఎంచుకున్నాడు కానీ దాన్ని బొగ్గు గని ప్రాంతంలో చూపించడంతో సినిమాకు కొంత ఫ్రెష్ లుక్ వచ్చింది.

అలాగే ఈ కథతో ఓ గ్రామంలో తాగుడును వ్యసనంలా మార్చుకున్న కొందరి వ్యక్తులను చూపిస్తూ చివరిగా ఓ సందేశం కూడా ఇచ్చాడు దర్శకుడు. ఓ ఊరు, అందులో తాగుడుకి బానిసలైన వ్యక్తులతోనే కథను స్టార్ట్ చేసి అక్కడి నుండి ధరణి, సూరి, వెన్నెల చైల్డ్ ఎపిసోడ్ ట్రాక్ తో సినిమాను నడిపించాడు. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సినిమాపై ఆసక్తి పెంచి అక్కడి నుండి సినిమాను రివెంజ్ డ్రామాగా నడిపించిన తీరు బాగుంది.

నాని మంచి నటుడని చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో గొప్ప నటుడు అనిపించాడు. సరైన కేరెక్టరైజేషన్ లేకపోయినా తన నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించాడు. సెకండాఫ్ లో వచ్చే ఇంటెన్స్ సీన్స్ లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో మంచి మార్కులు దక్కించుకున్నాడు. క్లైమాక్స్ లో తన నట విశ్వరూపం చూపించి మెస్మరైజ్ చేశాడు. సెకండాఫ్ లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ బోర్ కొట్టించకుండా డ్రామాతో నడిపించిన విధానం చాలా బాగుంది.

అయితే సెకండాఫ్ లో సినిమా స్లో పేస్ లో నడవడం, ఇలాంటి మాస్ సినిమాలో కిక్ ఇచ్చే హై మూమెంట్స్ లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. ఇవి పక్కన పెడితే నాని నటన, కథ నడిచే బ్యాక్ డ్రాప్, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి. క్లైమాక్స్ లో కాంతారలో ఇచ్చినట్టు హై  ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు.  తనలో విషయం ఉందని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. ఫైనల్ గా  ‘దసరా’ పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్.

రేటింగ్3/5