'కిల్లర్' మూవీ రివ్యూ

Friday,June 07,2019 - 02:41 by Z_CLU

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్ తదితరులు

సంగీతం : సైమన్ కె. కింగ్

సాహిత్యం, సంభాషణలు : భాష్యశ్రీ

సినిమాటోగ్రఫీ : మాక్స్

ఎడిటర్ : రిచర్డ్ కెవిన్

బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌

నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్

రచన & దర్శకత్వం : ఆండ్రూ లూయిస్

విడుదల తేది : 7 జూన్ 2019

‘బిచ్చగాడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు విజయ్ ఆంటొని… కాకపోతే అవేవి తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాయి. అందుకే ఈసారి అర్జున్ తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేసాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిల్లర్’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈసారైనా విజయ్ ఆంటొని మెప్పించాడా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. హత్య చేయబడిన వ్యక్తి మినిస్టర్ సత్యానంద్ కొడుకు వంశీ అని పసిగడతారు పోలీసులు. ఆ మర్డర్ ని సీరియస్ గా తీసుకొని ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి కేసుని టేకప్ చేస్తాడు డీసీపి కార్తికేయ(అర్జున్).. ఈ కేసులో జయతి(అషిమా నర్వాల్) ఆమె తల్లి(సీత) ను అనుమానిస్తాడు కార్తికేయ. ఈ క్రమంలో ఆ హత్య చేసింది తనేనని, చేసింది జయతి కోసమే అని పోలీసులకు లొంగిపోతాడు ప్రభాకర్(విజయ్ ఆంటొని).

ఇంతకీ ప్రభాకర్ ఎవరు..? అతనికి జయతికి సంబంధం ఏమిటి..? జయతి కోసం హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయిన ప్రభాకర్ ని ఇంటరాగేషన్ ని చేసి కార్తికేయ తెలుసుకుందేమిటి..? అనేది కిల్లర్ చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు :

నటుడిగా ఇప్పటికే తనేంటో రుజువు చేసుకున్న విజయ్ ఆంటొని ప్రభాకర్ పాత్రలో మెప్పించాడు. కిల్లర్ గా సీరియస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించాడు. గతంలో చేసిన పోలీస్ పాత్రే కావడంతో కార్తికేయ పాత్రని అవలీలగా చేసేసాడు. అషిమా నర్వాల్ నటనతో ఆకట్టుకుంది. పాటల్లో గ్లామర్ గా కనిపించి ఎట్రాక్ట్ చేసింది.

సీనియర్ నటి సీత, నాజర్ వారి పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసారు. గౌతమ్, సతీష్ తో పాటు మిగతావాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మెయిన్ హైలైట్ సైమన్ కే కింగ్ మ్యూజిక్. క్రైం థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో సైమన్ సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంత సేపు అతని మ్యూజిక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక సైమన్ తర్వాత మాట్లాడుకోవాల్సింది మాక్స్ గురించి… మాక్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. కథను తన విజువల్స్ తో బాగా చూపించాడు.

వినోద్ రాజ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటర్ గా రిచర్డ్ కెవిన్ తన పనితనం చూపించాడు. సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేయడంలో అతని ప్రతిభ కనిపిస్తుంది. భాష్యశ్రీ అందించిన మాటలు, పాటలు బాగున్నాయి. ఆండ్రూ లూయిస్ తన విజన్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయగలిగాడు. రెండో భాగంలో వచ్చే కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు రివ్యూ :

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో డిసప్పాయింట్ చేసిన విజయ్ ఆంటోనీ, ఈసారి మాత్రం టార్గెట్ రీచ్ అయ్యాడు. కిల్లర్ సినిమాతో తన జానర్ ఆడియన్స్ ను మరోసారి ఎట్రాక్ట్ చేశాడు. పక్కా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కిల్లర్ సినిమా ఈ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఒక్క సీన్ మిస్ అయినా, టోటల్ సినిమా థ్రెడ్ మిస్ అయ్యేలా చక్కగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు ఆండ్రూ లూయీస్. దానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు మ్యూజిక్ డైరక్టర్ సైమన్. సినిమా క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం వీళ్లిద్దరే. తర్వాతే  హీరోలు.

తన బాడీలాంగ్వేజ్, యాక్టింగ్ కు సూట్ అయ్యే కథల్ని వదిలిపెట్టి ఈమధ్య రకరకాల ప్రయోగాలు చేశాడు విజయ్ ఆంటోనీ. ఆ ప్రయోగాలన్నీ వరుసగా బెడిసికొడుతూ వచ్చాయి. దీంతో మళ్లీ తన పాత ఫార్ములాలోకి వచ్చి కిల్లర్ సినిమా చేశాడు ఈ నటుడు. గతంలో ఇతడు చేసిన నకిలీ, డాక్టర్ సలీమ్ సినిమాల టైపులో పూర్తిగా స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని తెరకెక్కింది ‘కిల్లర్’.

సినిమా స్టోరీలైన్ చాలా సింపుల్. ఓ మర్డర్ జరుగుతుంది. దాన్ని అర్జున్ ఛేదిస్తాడు. కానీ మినిమం గ్యాప్స్ లో ఇచ్చిన ట్విస్టులు సినిమాను నిలబెడతాయి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అందరికీ నచ్చుతుంది. ఫస్టాఫ్ కాస్త సాదాసీదాగా నడుస్తుంది. ఇలాంటి కథలు, స్క్రీన్ ప్లేకు ఇది సహజం. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి క్లయిమాక్స్ వరకు సినిమా గుక్కతిప్పుకోలేని విధంగా మలుపులతో సాగిపోతుంది.

విజయ్ ఆంటొని నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశించిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఫస్టాఫ్ లో వచ్చే రెండు పాటలు మాత్రం విసిగిస్తాయి. వినడానికి బాగున్నప్పటికీ, అవి అసందర్భంగా వచ్చినట్టు ఫీలవుతాం. స్క్రీన్ ప్లే రేసీగా సాగుతున్న టైమ్ లో వచ్చిన పాటలు ఇబ్బంది పెడతాయి. అయితే ఆ పాటలకు కూడా క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు.

ఓవరాల్ గా కిల్లర్ గా విజయ్ ఆంటొని ఈసారి మెప్పిస్తాడు.

రేటింగ్2.75/5