విశ్వామిత్ర మూవీ రివ్యూ

Friday,June 14,2019 - 11:01 by Z_CLU

నటీనటులు: నందితరాజ్, సత్యంరాజేశ్, ప్రసన్న, అశుతోష్ రానా, విద్యుల్లేఖ, చమ్మక్ చంద్ర, ఇందు ఆనంద్, సీవీఎల్ నరసింహారావు తదితరులు
మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ
ఫోటోగ్రఫీ: అనిల్ బండారి
ఎడిటర్: ఉపేంద్ర
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: 14 జూన్ 2019

థ్రిల్లర్లు వస్తున్నాయి, హారర్లు వస్తున్నాయి, యాక్షన్ సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ విశ్వామిత్ర సినిమా ఏ జానర్ కు చెందుతుందంటే ఠక్కున చెప్పడం కష్టం. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాస్ అయిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

కథ

అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. ఆమె అంటే అందరికీ ఇష్టమే. ఆఫీస్ లో ఆమె బాస్ మాత్రం నందితను మరో రకంగా చూస్తుంటాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నందిత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు సమస్య ఎదురైన ప్రతిసారి ఓ అజ్ఞాతవ్యక్తి వచ్చి రక్షిస్తుంటాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.

నందితకు పోలీసాఫీసర్ ప్రసన్న మంచి ఫ్రెండ్. మాటల సందర్భంలో ఓసారి తన అజ్ఞాత స్నేహితుడి గురించి ప్రసన్నకు చెబుతుంది. నందిత ఎలాంటి అమ్మాయో, ఎంత అమాయకురాలో తెలుసు కాబట్టి ఆమె మోసపోకూడదనే ఉద్దేశంతో, ఆ అజ్ఞాత స్నేహితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసన్న.

ఎంక్వయిరీలో భాగంగా ప్రసన్న, నందితకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నందితను అతడు పదేపదే ఎందుకు రక్షిస్తుంటాడు? తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రసన్న తెలుసుకున్న రహస్యాలేంటి? చివరికి నందిత తన అజ్ఞాత స్నేహితుడ్ని కలుసుకుందా లేదా అనేది క్లయిమాక్స్.


నటీనటుల పనితీరు

ఇలాంటి పాత్రలకు నందిత పెట్టింది పేరు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. కాస్త బరువైన పాత్ర అయినప్పటికీ చక్కగా చేసింది. సత్యం రాజేశ్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. క్షణం సినిమా తర్వాత అతడు చేసిన బెస్ట్ క్యారెక్టర్ గా దీన్ని చెప్పుకోవచ్చు. జానర్ పరిమితుల వల్ల సత్యం రాజేష్ క్యారెక్టర్ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కానీ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు ఈ నటుడు. నందిత స్నేహితుడిగా, పోలీసాఫీసర్ గా ప్రసన్న పెర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు.

నందిత బాబాయ్ గా నరసింహారావు, సత్యంరాజేశ్ తల్లి పాత్రలో అంధురాలిగా ఇందు ఆనంద్, విలన్ పాత్రలో అశుతోష్ బాగా నటించారు. ఇక సినిమాలో కామెడీ పండించే బాధ్యతను విద్యుల్లేఖ, చమ్మక్ చంద్ర తీసుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా ఈ సినిమా ఇంకాస్త రిచ్ గా ఉంటే బాగుండేది. కానీ ఉన్నంతలో టెక్నీషియన్స్ అంతా తమ పరిథిలో బాగానే చేశారు. అనీల్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ మెరిసింది. ఉపేంద్ర ఎడిటింగ్ ఫర్వాలేదు. అనూప్ రూబెన్స్ తన స్థాయికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఫరవాలేదు.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాల్లో రాజకిరణ్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. ఎక్కడెక్కడో జరిగిన వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ జోడించి అతడు రాసుకున్న కథ మెప్పిస్తుంది. ఆ కథను చెప్పిన విధానం (స్క్రీన్ ప్లే) కూడా ఆకట్టుకుంటుంది.


జీ సినిమాలు రివ్యూ

అసలు ఈ సినిమాకు విశ్వామిత్ర అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది పెద్ద సస్పెన్స్. రివ్యూలో ఆ సస్పెన్స్ ను రివీల్ చేయడం లేదు. ఇక సినిమా విషయానికొస్తే ఓ కొత్త ఎలిమెంట్ తో రాజకిరణ్ రాసుకున్న ఈ కథ, థ్రిల్లర్ జానర్లు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ప్రతిక్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ సినిమాను నిలబెట్టింది. ఉన్న బడ్జెట్ లోనే దర్శకుడు ఈ సినిమాను క్వాలిటీగా తీయడం మెచ్చుకోదగ్గ విషయం.

దర్శకుడు రాజకిరణ్ సినిమాలకు ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంది. గతంలో అతడు తీసిన గీతాంజలి, త్రిపుర సినిమాలు ఆకట్టుకున్నాయి. అందుకే విశ్వామిత్రపై అంచనాలు పెరిగాయి. తన గత సినిమాల టైపులోనే ఈ మూవీ కోసం కూడా ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ను సెలక్ట్ చేసుకున్నాడు దర్శకుడు. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అనే కాన్సెప్ట్ కు కొన్ని వాస్తవ సంఘటనల్ని జోడించి విశ్వామిత్రను తీశాడు. అతడు బాగా రీసెర్చ్ చేశాడనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది.

సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచే ఓ రకమైన సస్పెన్స్ ను మెయింటైన్ చేశారు. ప్రతి ఎపిసోడ్ లో ఓ థ్రెడ్ పెడుతూ, చిన్నచిన్న ట్విస్ట్ లు పెడుతూ క్లైమాక్స్ వరకు తీసుకెళ్లారు. ఈ ట్విస్టులన్నింటినీ క్లయిమాక్స్ లో రివీల్ చేయడం బాగుంది. కథకు అడ్డంగా ఉండకూడదనే ఉద్దేశంతో సినిమాలో పాటల్ని కూడా తగ్గించారంటే, కంటెంట్ పై మేకర్స్ కు ఎంత నమ్మకం ఉందో అర్థమౌతుంది.

నిజానికి ఈ సినిమా క్లైమాక్స్ ఇలానే ఉంటుందని ఎవరూ ఊహించరు. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందనే సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూనే, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కొన్ని బ్లాక్స్ రాసుకోవడం విశ్వామిత్రకు ప్లస్ అయింది. కామెడీ లేకపోయినా, మసాలా సాంగ్స్ కనిపించకపోయినా ప్రేక్షకుడు ఈ సినిమాలో లీనమైపోతాడు. దీనికి కారణం ఈ ఎమోషనల్ బ్లాక్సే.

ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ లో కాంప్రమైజ్ కావడం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకాస్త బడ్జెట్ పెట్టి ఉంటే మంచి అవుట్-పుట్ వచ్చేది. గ్రాఫిక్స్ పై కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవడం మరో మైనస్. దీనికితోడు మంచి కాస్టింగ్ లేకపోవడం కూడా వెలితి అనిపిస్తుంది. మూవీలో కొన్ని పాత్రలు చూస్తుంటే ఓ పాత్రను రావురమేష్, మరో పాత్రను ప్రకాష్ రాజ్, ఇంకో పాత్రను బ్రహ్మానందం లాంటి సీనియర్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ విశ్వామిత్ర కంటెంట్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే వాటన్నింటినీ మరిపిస్తుంది. ఈ వీకెండ్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది.

రేటింగ్2.75/5