'సెవెన్' మూవీ రివ్యూ

Thursday,June 06,2019 - 03:40 by Z_CLU

నటీనటులు : హవీష్,రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ తదితరులు.

సంగీతం : చైతన్ భరద్వాజ్

సహా నిర్మాత : కిరణ్ కె. తలశిల (న్యూయార్క్)

కథ -కథనం-నిర్మాణం : రమేష్ వర్మ

ఛాయాగ్రహణందర్శకత్వం : నిజార్ షఫీ

విడుదల తేది : 5 జూన్ 2019

 

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సెవెన్’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. ఆరుగురు హీరోయిన్స్ నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో ఎట్రాక్ట్ చేసింది. మరి డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందా..? హవీష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ:

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడర్ గా పనిచేసే కార్తీక్ (హవీష్) అదే కంపెనీలో పనిచేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. పెళ్ళైన వెంటనే రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే విధంగా జెన్నీ (అనిషా అంబ్రోస్), ప్రియా (త్రిథా చౌదరీ) కూడా తమ భర్త కార్తీక్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ ( రెహమాన్) కార్తీక్ కేసుని టేకప్ చేస్తాడు.

ఈ క్రమంలో వేణు గోపాల్ ఆ వ్యక్తి కార్తీక్ కాదని, అతని పేరు కృష్ణమూర్తి అంటూ పోలీసు స్టేషన్ కొచ్చి చెప్తాడు. అలా చెప్పిన వెంటనే వేణు గోపాల్ హాస్పిటల్ లో దారుణంగా హత్య చేయబడతాడు. ఆ హత్య జరిగాక కార్తీక్ మిస్సింగ్ కేస్ పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఆ హత్య కార్తీక్ చేస్తున్నట్టు భావించి పోలీసులు వేట మొదలుపెడతారు. హత్యలన్నీ చేసేది కార్తీక్ కాదు కృష్ణమూర్తి అనే కథను మరో మలుపు తిప్పుతుంది.

ఇంతకీ కార్తీక్ ఎవరు? అతను వరుసగా పెళ్ళిళ్ళు చేసుకొని ఎందుకు పరారయ్యాడు..? అసలు సరస్వతి(రెజినా)కి అతనికి సంబంధం ఏమిటి..? పూజిత పొన్నాడ (భాను), అదితి ఆర్య పాత్రలు కథను ఎలా మలుపు తిప్పాయి? ఇంతకి వేణు గోపాల్ చెప్పిన కృష్ణమూర్తి ఎవరు? దీని వెనకాల ఉన్నదెవరు..?. చివరకు పోలీస్ అధికారి (రెహమాన్)ఈ కేసును ఎలా ఛేదించాడు? అనేది సినిమా కథ.

 

నటీనటుల పనితీరు:

హీరో హవీష్ ఇంటెన్స్, ఎమోషనల్ పాత్రలో తేలిపోయాడు. అతను నటనపరంగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పడించడంలో విఫలమయ్యాడు. హీరోయిన్లలో రెజీనా మిగతా హీరోయిన్లను డామినేట్ చేసింది. కథలో కీలకమైన పాత్ర , పైగా నెగెటివ్ షేడ్స్‌ పాత్ర కావడంతో రెజీనా హైలైట్ గా నిలిచింది. తను ప్రేమించిన వ్యక్తిని భర్తగా పొందాలని తహతహలాడే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. రెజినా తర్వాత నందిత శ్వేత పాత్ర రిజిస్టర్ అయింది. త్రిథా చౌదరి, అదితి, పూజితా పొన్నాడ పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ పాత్రలకు న్యాయం చేసారు.

గతంలో ఇలాంటి క్యారెక్టర్ లో బెస్ట్ అనిపించిన రెహమాన్ ఈసారి జస్ట్ పరవాలేదనిపించుకున్నాడు. డైరెక్టర్ అతని నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తీసుకోలేకపోయాడనిపించింది. మిగతా నటీనటుల్లో ఏడిద శ్రీరామ్, విద్యులేఖ, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి కనిపించారు. అయితే వీరి పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. కొంతలో కొంత ఏడిద శ్రీరాం, సత్య, జోష్ రవి పాత్రలు ఆకట్టుకుంటాయి.

 

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు నిజార్ షఫీ సినిమాటోగ్రఫర్ కావడంతో సినిమాను బెస్ట్ విజువల్స్ తో తెరకెక్కించాడు. అతని సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బాగుంది. ‘సంపోద్దోయ్ నన్నే’ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఎడిటింగ్ పరవాలేదు. డైలాగ్స్ ఆకట్టుకోలేదు. రమేష్ వర్మ రాసుకున్న పాయింట్ ఆసక్తిగా అనిపించినా.. స్క్రీన్ ప్లే మాత్రం బెడిసి కొట్టింది. దర్శకుడు నిజార్ షఫీ డైరెక్షన్ సినిమాకు మైనస్. డైరెక్షన్ లో లోపాలున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సెవెన్ ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయింది. పొలీస్ స్టేషన్ కెళ్ళి తన భర్త కనిపించడం లేదంటూ నందిత శ్వేత కంప్లయింట్ ఇచ్చే సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకూ ఆసక్తిగా సాగిన సినిమా రెండో భాగం వచ్చే సరికి ట్రాక్ తప్పింది. జెన్నీ, ప్రియా క్యారెక్టర్లు కథలోకి ఎంటర్ అయినప్పటి నుండి ప్రేక్షకుడిలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మొదటి భాగంలో వచ్చే కొన్ని ఊహించని ట్విస్టులు ప్రేక్షకుడిని థ్రిల్ చేసినప్పటికీ రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.

రమేష్ వర్మ రాసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా సినిమాకు ఆయువుపట్టు లాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తేలిపోయింది. అప్పటివరకూ అసలేమై ఉంటుందా..? అని ఆలోచనలో పడ్డ ప్రేక్షకుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసి నవ్వుకునే పరిస్థితి కలుగుతుంది. ఎమోషనల్ గా ఉండాల్సిన క్లైమాక్స్ ను మరీ కామెడీగా డిజైన్ చేసారు. అందువల్ల క్లైమాక్స్ లో కోపం రావాల్సిన ఓ నెగెటీవ్ క్యారెక్టర్ చూస్తే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. అందులోకి నటి సుంకర లక్ష్మి నటన కాస్త ఓవర్ అనిపించడం కూడా క్లైమాక్స్ ని పక్కన పెట్టేలా చేసింది.

కొన్ని సందర్భాల్లో తమ యాక్టింగ్ స్కిల్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాల్సిన నటీనటులు ఆ పాత్రలను న్యాయం చేయలేకపోవడంతో సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. నిజార్‌ షఫీలో దర్శకుడి కంటే సినిమాటోగ్రాఫరే ఎక్కువగా డామినేట్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించే నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం సినిమాకు మరో మైనస్. కథలో దమ్మున్నప్పటికీ కథనం సరిగ్గా రాసుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఇక సెకండ్ హాఫ్ మరీ నెమ్మదిగా సాగడం కూడా సినిమాకు మైనస్. మిస్సింగ్ కేసుతో మొదలై మర్డర్ మిస్టరీతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ గా ‘సెవెన్’ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని కొంత వరకూ మెప్పిస్తుంది.

రేటింగ్ : 2 /5