'ఆకాశం నీ హద్దురా' రివ్యూ

Thursday,November 12,2020 - 08:43 by Z_CLU

నటీనటులు : సూర్య, అపర్ణ బాలమురళి, కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమా తదితరులు
బ్యానర్ : 2డీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : సూర్య శివకుమార్
కథ, దర్శకురాలు : సుధా కొంగర ప్రసాద్
స్క్రీన్ ప్లే : షాలిని ఉషాదేవి & సుధా కొంగర
సినిమాటోగ్రఫీ : శ్రీనికిత్ బొమిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటర్ : సతీష్ సూర్య
రన్ టైమ్ : 2 గంటల 30 నిమిషాలు
రిలీజ్ డేట్ : నవంబర్ 12, 2020

వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్న సూర్య.. తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. పైగా నిర్మాత కూడా. మరి సూర్య సక్సెస్ అయ్యాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Suriya

కథ:

గంటూరు జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరులో ఉన్న మాస్టారి కొడుకు చంద్రమహేష్ అలియాస్ మహా (సూర్య). ఆ మాస్టారు వల్లనే ఆ పల్లెటూరికి కరెంట్ వస్తుంది. రైలు కూడా ఆగుతుంది. మహా అంతకంటే పెద్ద కలకంటాడు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటాడు. తన కల కోసం ఎయిర్ ఫోర్స్ లో జాబ్ ను కూడా వదిలేస్తాడు.

అయితే మహా అనుకున్నంత ఈజీగా అతడి కల నెరవేరదు. ఆల్రెడీ విమానయాన రంగంలో పాతుకుపోయిన పర్వేష్ (పరేష్ రావల్) పూర్తిస్థాయిలో మహాను అడ్డుకుంటాడు. దీనికితోడు అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, తన కుటుంబ స్థితి కూడా మహాకు పెద్ద అడ్డంకిగా మారుతాయి.

వీటన్నింటినీ అధిగమించి తన కల ఎయిర్ దక్కన్ ను మహా ఎలా సాకారం చేసుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు:

సూర్య నటవిశ్వరూపం చూడాలనుకుంటున్నారా? అయితే ఆకాశం నీ హద్దురా సినిమా చూడాల్సిందే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు సూర్య మేజిక్ కనిపిస్తుంది ఈ సినిమాలో. అతడిలో ఓ అద్భుతమైన నటుడు దాగున్నాడనే విషయం ఈ సినిమా మరోసారి ప్రూవ్ అయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సూర్య యాక్టింగ్ అద్భుతం.

హీరోయిన్ అపర్ణ బాలమురళికి కూడా మంచి మార్కులు పడతాయి. ఈ క్యారెక్టర్ కు తగ్గ మాస్ లుక్స్ ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. విలన్ పాత్రలో పరేష్ రావల్ పెర్ ఫెక్ట్ గా సూటవ్వగా.. నాయుడు క్యారెక్టర్ లో మోహన్ బాబు సర్ ప్రైజ్ ఇచ్చారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

డైరక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు అన్నీ. ఆమె రాసుకున్న కథ-స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. సెకెండాఫ్ లో కొన్ని సీన్స్ కాస్త సాగినట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా చూస్తే సుధా కొంగర డైరక్టర్ గా సక్సెస్ అయ్యారు. ఎమోషన్స్ పండించడంలో సుధా కొంగరకు తిరుగులేదనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఈ సినిమాతో డబుల్ అయింది. ఇలాంటి అండర్ డాగ్ కథల్ని హ్యాండిల్ చేయడంలో ఆమె పండిపోయారు.

ఇక డైరక్టర్ ఆలోచనల్ని స్క్రీన్ పైకి తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ శ్రీనికిత్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. డైరక్టర్-సినిమాటోగ్రాఫర్ సింక్ లో ఉంటే మేజిక్ చేయొచ్చని చెప్పడానికి ఆకాశం నీ హద్దురా సినిమా ఓ చక్కటి ఎగ్జాంపుల్. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సతీష్ సూర్య ఎడిటింగ్ అతికినట్టు సరిపోయాయి.

నిర్మాతగా సూర్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాడు. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ప్రతిష్టను పెంచేలా తెరకెక్కింది ఈ సినిమా.

Suriya interview Aakasam Nee Haddhu Ra

జీ సినిమాలు రివ్యూ:

హీరోకు ఫ్లాపులొస్తే కష్టం, ఓ నటుడికి ఫ్లాపులొస్తే అదేమంత పెద్ద సమస్య కాదు. సరైన కథ, క్యారక్టర్ దొరికితే ఇట్టే బౌన్స్ బ్యాక్ అవుతాడు. సూర్య విషయంలో ఇదే జరిగింది. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ హీరో, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఎట్టకేలకు హిట్ కొట్టాడు. తన నటనతో ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. సినిమాలో ఎక్కడా మనకు హీరో సూర్య కనిపించడు. చంద్రమహేష్ అలియాస్ మహా మాత్రమే కనిపిస్తాడు.

సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే కెప్టెన్ గోపీనాథ్, ఎన్ని కష్టాలు పడి ఎయిర్ దక్కన్ సంస్థను స్థాపించారు అనే రియల్ లైఫ్ కథకు కాస్త ఫిక్షన్ జోడించి తీసిన ఈ సినిమా ప్రతి ఎపిసోడ్ లో ఆకట్టుకుంటుంది. రియల్ లైఫ్ స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఎవరైనా చేస్తారు. కానీ దాన్ని కమర్షియల్ పంథాలో చెప్పిన వాళ్లకే విజయం వరిస్తుంది. ఈ విషయంలో డైరక్టర్ సుధా కొంగర నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు.

షాలినీ ఉషాదేవితో కలిసి సుధా కొంగర రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఎక్కడా వంక పెట్టడానికి లేదు. స్మూత్ గా సినిమాను స్టార్ట్ చేసి, ప్రేక్షకుడ్ని మూడ్ లోకి తీసుకెళ్లి, ఎమోషనల్ గా కదిలించి, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఇవ్వడంతో “ఆకాశం నీ హద్దురా” సినిమా అందరితో సూపర్ హిట్ అనిపించుకుంటుంది.

సినిమాలో కేవలం ఒకట్రెండు ఎపిసోడ్స్ బాగున్నాయని చెప్పలేం. ప్రతి దానికి ఇంటర్ లింక్ ఇస్తూ మంచి సీన్స్ పడ్డాయి. మరీ ముఖ్యంగా హీరో ఎందుకు అంత బలంగా తన ఆశయానికి కట్టుబడి ఉంటాడో చెప్పడం కోసం తండ్రి ఫ్లాష్ బ్యాక్ ను వాడుకోవడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. తండ్రి చావుబతుకుల్లో ఉంటే విమానం టిక్కెట్ కోసం డబ్బుల్లేక హీరో అడుక్కునే సీన్.. సూర్య కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. హీరో ఆశయానికి ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా జతచేయడంతో సినిమా రిజల్ట్ పై ఏమాత్రం అనుమానం కలగదు.

సూర్య నటనకు హీరోయిన్ తో పాటు ఇతర పాత్రల నుంచి ఫుల్ సపోర్ట్ దక్కడంతో ఓ మంచి ఎమోషనల్ మూవీ సిద్దమైంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇద్దరి గురించి చెప్పుకోవాలి. చేసింది తక్కువ సీన్లలోనే అయినప్పటికీ మోహన్ బాబు తన మార్క్ చూపించారు. ఇక తెరవెనక సత్యదేవ్ వాయిస్, సూర్య పాత్రకు ప్రాణం పోసింది. ఈమధ్య కాలంలో వచ్చిన సూర్య సినిమాల్లో అతడి వాయిస్ వింటే డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగేది. ఈ సినిమా మాత్రం సత్యదేవ్ వాయిస్ తో పూర్తిగా నేటివిటీ ఫీల్ సంతరించుకుంది. పైగా తన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీతో సత్యదేవ్ మెప్పించాడు. ఇకపై సూర్య సినిమాలకు వరుసగా ఇతడే డబ్బింగ్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా సూట్ అయింది.

ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ను అక్కడక్కడ డ్రాగ్ చేసినట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా ఓ మంచి ఎమోషనల్ మూవీని, ఓ కొత్త కథను చూసిన ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఓటీటీలో వరుసగా వస్తున్న ఫ్లాప్ సినిమాలకు సూర్య మూవీ అడ్డుకట్ట వేసింది.

బాటమ్ లైన్ – ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య
రేటింగ్ 3/5