'గతం' మూవీ రివ్యూ

Saturday,November 07,2020 - 07:59 by Z_CLU

నటీనటులు: భార్గవ పొలుదాసు, రాకేశ్ గాల్బే, పూజిత కూరపర్తి, హర్ష వర్ధన్ ప్రతాప్, లక్ష్మీ భరద్వాజ్
రచన, దర్శకత్వం: కిరణ్ రెడ్డి
బ్యానర్స్: ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
నిర్మాతలు : భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు
నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి
ఎడిటర్: జి.ఎస్
సౌండ్ డిజైన్: డేవిడ్ డె లుకా
రన్ టైమ్ : 100 నిమిషాలు
రిలీజ్ : నవంబర్ 6, 2020

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. ఓటీటీ వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ ఇంకాస్త పెరిగింది. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వాళ్లిద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది గతం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ
సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Gatham movie review telugu 3

కథ

అమెరికాలోని ఓ హాస్పిటల్ బెడ్ పై నుంచి అప్పుడే స్పృహలోకి వస్తాడు రిషి(రాకేష్). అతడు తన గతాన్ని మరిచిపోతాడు. హాస్పిటల్ లో తనకు సేవలు చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత కూరపాటి)ని కూడా గుర్తుపట్టలేడు. ఆమె సహాయంతో తన తండ్రి దగ్గరకు బయలుదేరతాడు.
ఇంతలో మధ్యలో కారు ఆగిపోతుంది. మరోవైపు చీకటి పడుతుంది.

అంతలోనే అటువైపు వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (భార్గవ పోలుదాసు) వాళ్లకు సహాయం చేస్తాడు. ఆ రాత్రికి తన కాటేజ్ కు తీసుకెళ్తాడు. కాటేజ్ కు వెళ్లిన తర్వాత ఆ అపరిచితుడు, అతడి కొడుకు చేసే పనులు రిషి-అదితిలకు డౌట్స్ తెప్పిస్తాయి. ఆ వెంటనే తాము కాటేజ్ లో ట్రాప్ అయినట్టు గ్రహిస్తారు.

అలా ట్రాప్ అయిన ఈ జంట ఎలా బయటపడింది? అసలు రిషి-అదితి ప్రేమికులేనా? రిషి గతానికి, వాళ్లను ట్రాప్ చేసిన అగంతకుడికి ఉన్న కనెక్షన్ ఏంటనేది గతం సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు

సినిమాలో అంతా కొత్తవాళ్లు నటించారు. వాళ్లకు యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఉందని కూడా అనుకోలేం. అలా ఉంది వాళ్ల నటన. ఉన్నంతలో రాకేష్ గాల్బే బాగానే యాక్ట్ చేశాడు. పాజిటివ్-నెగెటివ్ షేడ్స్ రెండూ చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ విజయ్ దేవరకొండను అనుకరించే ప్రయత్నం కూడా చేశాడు. కాకపోతే ఈ కథకు అతడి నటన సరిపోలేదు.

రెండో ముఖ్యమైన పాత్రను భార్గ పోలుదాసు పోషించాడు. ఇటు విలనిజం, అటు సెంటిమెంట్ రెండూ పండించాల్సిన ఈ పాత్రలో అతడు తేలిపోయాడనే చెప్పాలి. ఇతర పాత్రల విషయానికొస్తే ఎవ్వరూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ అనుభవం లేకపోవడంతో చాలా కష్టపడి నటించినట్టు అనిపిస్తుంది.

 

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా మాత్రం సినిమా టాప్ రేంజ్ లో ఉంది. ముందుగా కెమెరా వర్క్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందు అంతోఇంతో ప్రేక్షకుల్ని ఆకర్షించిందంటే దానికి కారణం మనోజ్ సినిమాటోగ్రఫీ. మంచుతో కప్పబడిన అమెరికా అందాలతో పాటు, సినిమా మూడ్ ను ఎలివేట్ చేసేలా మనోజ్ అందమైన ఫ్రేములు చూపించాడు. విజువల్స్ అవుట్-స్టాండింగ్ గా ఉన్నాయి.

శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద ఎస్సెట్. పాటలు లేని ఈ కథకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణంపోశాడు పాకాల. సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే కెమెరా, మ్యూజిక్ గురించే మాట్లాడుకోవాలి. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ విషయంలో మాత్రం వీక్ అయ్యాడు. అది తప్ప మిగతావన్నీ పెర్ ఫెక్ట్. ఇంతమంది కొత్తవాళ్లతో దర్శకుడు ఈమాత్రం చేయడం గొప్ప విషయం.

Gatham movie review telugu 2

జీ సినిమాలు రివ్యూ

ఇంతకుముందే చెప్పుకున్నట్టు దర్శకుడు స్క్రిప్ట్ డిపార్ట్ మెంట్ లో వీక్ అయ్యాడు. రైటింగ్ టేబుల్ పై ఆయన మరింత దృష్టి పెట్టాల్సింది. ఫస్ట్ పార్ట్ లో చూపించినంత సస్పెన్స్ సెకెండాఫ్ కు వచ్చేసరికి మిస్సయ్యాడు. రొటీన్ రివెంజ్ డ్రామాను తలపించాడు. మరీ ముఖ్యంగా
సైకలాజికల్ థ్రిల్లర్ తీస్తున్నాం కాబట్టి, ఆ ఎలిమెంట్స్ కూడా ఉంచడం కోసం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఎట్రాక్ట్ చేయవు.

ఒకరికొకరు సంబంధం లేనట్టు పాత్రలు పరిచయం చేసి, వాటిని కనెక్ట్ చేసిన తీరు బాగుంది. చిక్కుముడులు బాగా వేసి ఫస్టాఫ్ ను హుక్ చేసిన దర్శకుడు.. ఎప్పుడైతే సస్పెన్స్ రివీల్ అయిపోతుందో, ఇక అక్కడ్నుంచి సగటు తెలుగు సినిమాను చూపించాడు. రెగ్యులర్ గా థ్రిల్లర్స్ ఫాలో అయ్యేవాళ్లకు ‘గతం’ పెద్దగా షాక్ ఇవ్వదు. దాదాపు 50శాతం సీన్స్ లో ట్విస్టులు ముందే ఊహించుకోవచ్చు. హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు ఈ సినిమా అస్సలు కిక్ ఇవ్వదు.

క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ మెంట్ తో పాటు.. చాలా చోట్ల లాజిక్ మిస్సవ్వడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఉదాహరణకు క్లైమాక్స్ లో విలన్ ను హీరో మంచులో పక్కకు తోసేసి పరుగెడతాడు. కానీ విలన్ చేతిలో ఉన్న గన్ ను మాత్రం తీసుకోవాలని అనుకోడు. సినిమాను మొదలుపెట్టి ఫస్ట్ లాక్ వేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. అసలే ఓటీటీ మూవీ కావడం వల్ల ప్రేక్షకుడు ఈజీగా మైండ్ మార్చుకునే అవకాశం ఉంది. దీనికితోడు కీలకమైన క్లైమాక్స్ ను సింపుల్ గా తేల్చేయడం రుచించదు. దీనికితోడు మరో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే.. నటీనటుల్లో ఏ ఒక్కరు ప్రేక్షకుడితో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోయారు.

అయితే ఎన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్ కోసం ఈ సినిమా చూడాల్సిందే. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫస్టాఫ్ లో వచ్చే ట్విస్టులు, అప్పటివరకు హీరో అనుకునే క్యారెక్టర్ విలన్ గా మారడం లాంటివి సినిమాకు మంచి బలాన్నిచ్చాయి. దీనికితోడు కేవలం వంద నిమిషాల్లోనే బోర్ కొట్టించకుండా సినిమాను ముగించడం కూడా ప్లస్ పాయింటే.

ఓవరాల్ గా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం కాకపోయినా, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్ – కొంచెం థ్రిల్.. ఇంకొంచెం ట్విస్ట్
రేటింగ్2.5/5