వాయిదాపడిన సూర్య సినిమా

Friday,October 23,2020 - 06:34 by Z_CLU

వివిధ ప‌ర్మిష‌న్లు రావాల్సి ఉన్నందున ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రం విడుద‌లలో జాప్యం జ‌రుగుతోంద‌ని హీరో సూర్య తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ లెట‌ర్ పోస్ట్ చేశారు. వాస్త‌వానికి ఆ చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించారు. ‘ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం విడుద‌ల‌లో జాప్యం జ‌ర‌గ‌డానికి కార‌ణాల‌ను, తాము ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను హృద‌యాన్ని స్పృశించేలా త‌న‌ లెట‌ర్‌లో ఆయ‌న వెల్ల‌డించారు.

ఒక లెట‌ర్ ద్వారా త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డం త‌న దిన‌చ‌ర్య కాద‌నీ, కానీ ఇప్పుడు త‌న అభిమానుల ముందు ఓపెన్ హార్ట్‌తో, పార‌ద‌ర్శ‌క మ‌న‌సుతో నిల‌బ‌డాల్సిన ఒక ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఆయ‌న చెప్పారు. ఎందుకంటే త‌ను ఇప్పుడున్న స్థాయికి రావ‌డంలో అన్నివేళ‌లా త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని అభిమానులేన‌ని సూర్య అన్నారు.

‘ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం వైమానిక రంగం నేప‌థ్యంలో న‌డిచే క‌థ అని అంద‌రికీ తెలిసిందేన‌నీ, కాబ‌ట్టి తాము అనేక ప‌ద్ధ‌తులు పాటించాల్సి వ‌చ్చింద‌నీ, ప‌ర్మిష‌న్లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌నీ సూర్య చెప్పారు. “ఇది జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. మేం నిజ‌మైన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు, సెక్యూరిటీతో డీల్ చేయాల్సి వ‌చ్చింది. కొన్ని ఎన్ఓసీలు (నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్లు) అనుమ‌తుల కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిరీక్ష‌ణ అనివార్య‌మ‌ని మేం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మ‌హ‌మ్మారి కాలంలో మిగ‌తా అన్ని విష‌యాల కంటే దేశం, దాని ప్రాధాన్యాల మీదే అధిక‌ దృష్టి పెట్టాల్సి వ‌స్తోంది” అని సూర్య తెలిపారు.

ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంలో ఎదుర్కొన్న ఘ‌ట‌న‌లు, క‌ష్టాల‌ను ఆధారం చేసుకొని రూపొందిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’ (సూరారై పొట్రు) చిత్రంలో సూర్య‌, డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు, అప‌ర్ణా బాల‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ధారులు. సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య‌, గునీత్ మోంగా నిర్మిస్తున్నారు.