ఇయర్ ఎండ్ స్పెషల్: ఫర్ ఏ చేంజ్

Thursday,December 19,2019 - 10:15 by Z_CLU

ఎప్పుడు చేసేదే చేస్తే అది రొటీన్.. పైగా బోర్ కొట్టడం కామన్.. అందుకే అప్పుడప్పుడు మన స్టార్స్ యూ టర్న్ తీసుకొని “ఫర్ ఏ చేంజ్’ మూడ్ లోకి వెళ్లిపోతుంటారు. ఇక ఈ ఏడాది కూడా కొందరు దర్శకులు , హీరోలు లైఫ్ లో కొత్తదనం కోరుకొని కొత్త దారిలో వెళ్ళారు. ఇంతకీ కొత్త రూట్లోకి వెళ్లిన వాళ్ళెవరు ? అందులో సక్సెస్ అయ్యారా..లేదా.. ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఈ ఏడాది ఎవరూ ఊహించని ఓ నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్. కెరీర్ స్టార్టింగ్ నుండి మొన్నటి వరకూ సినిమాలు డైరెక్ట్ చేసి బోర్ కొట్టేసిందో ఏమో కానీ సడన్ గా మెగా ఫోన్ వదిలి హీరోగా సినిమా చేయడానికి ఫిక్సయ్యాడు. తన సినిమాతో నిర్మాతగా కెరీర్ స్టార్ చేసిన దిల్ రాజు నిర్మాణంలో ‘సీనయ్య’ అనే సినిమా చేయబోతున్నాడు. నరసింహరావు డైరెక్షన్ లో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాతో వచ్చే ఏడాది హీరోగా కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు.

అప్పటి వరకూ హీరోయిజం చూపించి మెస్మరైజ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉన్నట్టుండి ‘ఫర్ ఏ చేంజ్’ అంటూ కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్ లో దర్శనమిచ్చాడు. ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ చూసి ఈ ఏడాది అందరూ సర్ప్రయిజ్ అయ్యారు. నిజానికి ఇదొక మంచి పరిణామమే. కథ బాగుంటే నెగిటివ్ క్యారెక్టర్ అయినా చేస్తానంటూ ముందుకొచ్చాడు వరుణ్.

గతేడాది వరకూ చాక్లెట్ బాయ్ క్యారెక్టర్ తో లవ్ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన రామ్ ఒక్కసారిగా మాస్ అవతార్ లో కనిపించి ఫర్ ఏ చేంజ్ అన్నాడు. ఆ చేంజ్ కి ఆడియన్స్ ఫిదా అయి ఇస్మార్ట్ శంకర్ సినిమాను బ్లాక్ బస్టర్ చేసేసారు. ఇక ఈ రేంజ్ మాస్ క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ ఇస్మార్ శంకర్ గా బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక బాడీ క్యారెక్టర్ వస్తే చేయడానికి సిద్దమంటూ ఇస్మార్ట్ స్టెప్ వేశాడు.

ఈ ఇయర్ హీరో నుండి నిర్మాతగా టర్న్ తీసుకొన్నాడు విజయ్ దేవరకొండ… మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ని హీరో చేసాడు. ఈ సినిమా విజయం అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే నిర్మాతగా మాత్రం మంచి ప్లానర్ అనిపించుకున్నాడు విజయ్.

రెడీ…కెమెరా …యాక్షన్…అని చెప్పి బోర్ కొట్టేసిందో లేక విజయ్ చెప్పించిన కథ ఎగ్జైట్ చేసిందో మెగా ఫోన్ పక్కన పెట్టి హీరోగా మారిపోయాడు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో హీరోగా సినిమా చేసేసి నటుడిగా మరిన్ని ప్రశంసలు అందుకున్నాడు.

హీరోగా రెండు సినిమాలు చేసిన విశ్వక్ సేన్ కూడా ఈ ఇయర్ హీరోగా చేస్తూనే మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేసాడు. ‘ఫలక్ నుమా దాస్’ అనే రీమేక్ సినిమాను స్వీయ దర్శకత్వంలో చేసి యూత్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసాడు.

కెరీర్ ఆరంభంలోనే ఫర్ ఏ చేంజ్ అంటూ ఓ డేర్ స్టెప్ తీసుకున్నాడు కార్తికేయ. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. కథ, క్యారెక్టర్ నచ్చితే విలన్ గా చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయనని ఈ సినిమా ద్వారా తెలియజేసాడు కార్తికేయ.

 

ఈ ఏడాది ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో నిర్మాతగా మారాడు సందీప్ కిషన్. దర్శకుడు కార్తీక్ రాజు చెప్పిన కథ నచ్చడంతో హీరోగా చేస్తూనే ప్రొడక్షన్ భాధ్యతలు చూసుకున్నాడు.

మొన్నటి వరకూ కామెడీ పాత్రలతో ఎంటర్టైన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఇయర్ డైరెక్టర్ గా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అనే సినిమా తీసి ‘ఫర్ ఏ చేంజ్’ అన్నాడు. తనే హీరోగా నటించి , నిర్మించి పనిలోపనిగా డైరెక్షన్ కూడా చేసేసాడు. కాకపోతే ఈ సినిమాతో డైరెక్టర్ గా విజయం అందుకోలేకపోయాడు శ్రీనివాస్ రెడ్డి.