వెన్నెలకంటి ఇక లేరు

Tuesday,January 05,2021 - 06:19 by Z_CLU

ప్రముఖ రచయిత, సాహితీవేత్త, తెలుగుభాషావేత్త వెన్నెలకంటి కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. తెలుగు సినీచరిత్రలో వెన్నలకంటిది ఓ అధ్యాయం. మరో వ్యక్తి తాకలేని సువర్ణాధ్యాయం.

ఇప్పటితరానికి వెన్నెలకంటి కేవలం ఓ డబ్బింగ్ రచయితగా, అంతకంటే ముందు గేయరచయితగా మాత్రమే తెలుసు. కానీ ఆయన అపర మేధావి. పద్యాలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. 11 ఏళ్ల వయసులోనే ‘భక్త దుఃఖనాశ పార్వతీశ’ అనే టైటిల్ తో శతకం రాశారు. 13 ఏళ్లకే లలితా శతకం రాశారు. కాలేజీకొచ్చాక ఒక శ్రీరామనవమి రోజున పొద్దునుంచి సాయంత్రం వరకు 108 పద్యాలు రాశారు.

సాహిత్యం సంప్రదాయ కవిత్వం నుంచి ఆధునికత వైపు అడుగులు వేస్తున్న టైమ్ లో… పూర్తిగా పద్యాలకే పరిమితమైన వెన్నెలకంటి చంద్రగిరిలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికే పరిమితమైపోయారు. అయితే ఈయనలో ఆధునిక సాహిత్యం రాసే సత్తా కూడా ఉందని గుర్తించిన వ్యక్తి, ప్రముఖ రచయిత నాగభైరవ కోటేశ్వరరావు. అలా గురువుగారి ప్రోత్సాహంతో సినిమాల్లోకి ప్రవేశించారు వెన్నెలకంటి. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, వెన్నెలకంటికి పరిశ్రమలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు.

ఆయనకు తొలి అవకాశం ఇచ్చిన నటుడు ప్రభాకర రెడ్డి. శ్రీరామచంద్రుడు సినిమాలో తొలి పాట రాసే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి పదేళ్ల వరకు వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు వెన్నెలకంటికి. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. మనసును కదిలించే సినీ సాహిత్యాన్ని అందించారు. “చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి బతికొస్తాను” లాంటి సాహితీ ప్రయోగాలు వెన్నెలకంటివే.

లిరిసిస్ట్ గా కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో డబ్బింగ్ సినిమాల వైపు మళ్లారు వెన్నెలకంటి. కమల్ హాసన్ నటించిన ఎపిక్ మూవీ నాయకుడు సినిమాకు తెలుగులో సంభాషణలు రాశారు. ఆ సినిమా పెద్ద హిట్టు. అలా తన కెరీర్ డబ్బింగ్ సినిమాల వైపు మళ్లుతుందని వెన్నెలకంటి కలలో కూడా ఊహించలేదు. అలా కెరీర్ లో లెక్కలేనన్ని డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా, లిరిసిస్ట్ గా వర్క్ చేశారు.

వెన్నెలకంటి తనయుడు శశాంక్ ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నాడు. డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక మరో తనయుడు రాకేందు మౌళి.. ఇండస్ట్రీలో రచయితగా, సింగర్ గా, నటుడిగా రాణిస్తున్నాడు.