VD స్పెషల్: దేవదాసు నుంచి అర్జున్ రెడ్డి వరకు

Sunday,February 14,2021 - 10:30 by Z_CLU

కాలం మారినా, మనుషులు మారినా ప్రేమ మాత్రం మారదు. అదెప్పుడూ శాశ్వతం.

నిజమే.. కానీ సిల్వర్ స్క్రీన్ పై ప్రేమను చూపించే విధానం మాత్రం చాలా మారిపోయింది. ఐదేళ్లకో ట్రెండ్ ఎలా మారుతుందో, ప్రేమకథల్లో కూడా దశాబ్దానికో నెరేషన్ పుట్టుకొచ్చింది. ప్రేమను ఆరాధనగా చూపించిన రోజుల నుంచి ప్రేమ నుంచి వయిలెన్స్ పుట్టుకొచ్చిన రోజులకు వచ్చింది తెలుగు సినిమా.

దేవదాసు-పార్వతిల ప్రేమ అజరామరం. ఇప్పటికీ ప్రేమకథల్లో దీనిది ప్రత్యేక స్థానం. తెలుగులో ప్రేమకథల లిస్ట్ చెప్పకంటే అది దేవదాసు నుంచే మొదలవుతుంది.

 

‘దేవదాసు’ ప్రేమ కాస్తా ‘ప్రేమాభిషేకం’, ‘ప్రేమనగర్’ కాలానికి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఈ 3 సినిమాల్లో హీరో ఒకరే. దేవదాసులో భగ్నప్రేమికుడ్ని చూపించిన అదే అక్కినేని, ప్రేమాభిషేకం, ప్రేమనగర్ లో త్యాగాన్ని చూపించారు.

 

ప్రేమకథల్లో మరో క్లాసిక్ ‘అభినందన’. ప్రేమించిన అమ్మాయిని వేరొకరు పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమికుడు తట్టుకోలేకపోతాడు. చనిపోదామని అనుకుంటాడు. కానీ అక్కడే సీన్ రివర్స్ అవుతుంది. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకొని, వాళ్లిద్దర్నీ కలిపి భర్త ప్రాణత్యాగం చేస్తాడు. ఈ హార్ట్ టచింగ్ పాయింట్ ఈ సినిమాను ఎవర్ గ్రీన్ గా నిలిపింది.

 

దాదాపు ఇదే పాయింట్ తో కొన్నాళ్లకు ప్రేయసిరావె అనే సినిమా వచ్చింది. ఇది కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీనే. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమానే. ‘అభినందన’ సినిమాలో ప్రేయసి-ప్రియుడ్ని కలిపేందుకు భర్త ప్రాణత్యాగం చేస్తే.. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లాడిందని తెలుసుకొని.. వాళ్లు కుటుంబం బాగుండాలని ప్రియుడు ప్రాణత్యాగం చేసిన కథే ‘ప్రేయసిరావె’.

ప్రేమకథలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చిన మరో సినిమా గీతాంజలి. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో దేవదాసు గురించి ఎలాగైతే చెప్పుకుంటామో, ‘గీతాంజలి’ కూడా కూడా అలా చెప్పుకోవాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ ట్రాజడీ లవ్ స్టోరీ ఇప్పటికీ చాలామంది సినీప్రేమికుల హాట్ ఫేవరెట్. బహుశా ట్రాజడీ ఎండింగ్ తో సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ఇదేనేమో.

 

‘గీతాంజలి’ తర్వాత ప్రేమకథలు కొత్త మలుపు తీసుకున్నాయి. ‘సుస్వాగతం’, నువ్వే కావాలి, ‘చిత్రం’ లాంటి ఎన్నో పాథ్-బ్రేకింగ్ మూవీస్ వచ్చాయి. ప్రేమ కోసం పరితపించే హీరో, ఆఖరి నిమిషంలో తన ప్రేమను గెలుచుకుంటాడు. కానీ అప్పటికే సర్వస్వం కోల్పోతాడు. అప్పుడు హీరో ఏం చేశాడనే కాన్సెప్ట్ తో సుస్వాగతం సినిమా తెరకెక్కింది. ఇక టీనేజ్ లవ్ స్టోరీస్ గా నువ్వేకావాలి, చిత్రం సినిమాలు వచ్చాయి. స్నేహం నుంచి తెలియకుండానే ప్రేమ పుడుతుందనే కాన్సెప్ట్ తో నువ్వేకావాలి.. ప్రేమకు, సెక్స్ కు మధ్య సున్నితమైన గీతను చూపిస్తూ చిత్రం సినిమాలు వచ్చాయి.

 

ఆ తర్వాత ప్రేమకథల్లో ‘ఆర్య’ మరో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఫీల్ మై లవ్ అంటూ వచ్చిన ఈ సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ప్రేమకథల్లో ఈ సినిమాది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే. ఈ మూవీ తర్వాత  పేద-ధనిక మధ్య అంతరాల్ని చెరిపే ప్రేమతో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా వచ్చింది.

 

ఇక రీసెంట్ గా ‘నిన్నుకోరి’, ‘అర్జున్ రెడ్డి’ అంటూ ప్రేమ మరో కొత్త టర్న్ తీసుకుంది. ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. తన ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లైపోయినా ఆ ప్రేమను అలా కొనసాగించడం. ప్రేమను జీవితానికి అన్వయించుకోవడం అనే కాన్సెప్ట్ తో నిన్నుకోరి సినిమా వచ్చింది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ఈ తరం ప్రేమకథ. ప్రేమలో మునిగితే ఓ వ్యక్తి ఎలా తయారవుతాడు.. వ్యక్తిత్వం, జీవితం, ఉద్యోగంలో ఎలాంటి మార్పులొస్తాయనే కాన్సెప్ట్ ను అర్జున్ రెడ్డిలో డీటెయిల్డ్ గా చూపించారు.

ఇలా ‘దేవదాసు’ నుంచి అర్జున్ రెడ్డి వరకు ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించకపోయినా మరెన్నో ప్రేమకథలు తెలుగు తెరను కలర్ ఫుల్ గా మార్చేశాయి. సిల్వర్ స్క్రీన్ పరంగా ప్రేమ ఎన్ని టర్న్స్ తీసుకున్నా.. రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ ఒకటే. Love Allహ్యాపీ వాలంటైన్స్ డే.