#HBDRamcharan చరణ్ బర్త్ డే స్పెషల్

Wednesday,March 27,2024 - 01:06 by Z_CLU

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం. ఈ సందర్భంగా జీ సినిమాలు బర్త్ డే స్పెషల్ స్టోరీ….

మెగా స్టార్ వారసుడిగా ‘చిరుత’ తో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పూరి జగన్నాథ్ రాసిన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. డాన్స్ , యాక్టింగ్ తన బ్లడ్ లోనే ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా చిరుతలో చరణ్ డాన్సు చూసి అందరూ ఫిదా అయ్యారు. అక్కడి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రయాణాన్ని గొప్పగా మార్చుకున్నాడు చరణ్.

వారసత్వం అనేది ఒకటి లేదా రెండో సినిమా వరకే. అక్కడి నుండి ఎవరైనా సొంతంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే కష్టపడాల్సిందే. ఈ విషయం లో చరణ్ కి పూర్తి మార్కులు పడతాయి. రెండో సినిమా మగధీర తో రికార్డులు కొట్టి , మూడో సినిమా ఆరెంజ్ తో యూత్ కి ఫెవరెట్ అయ్యాడు. మగధీరలో కొన్ని సన్నివేశాలు చూస్తే రామ్ చరణ్ నటన ను కచ్చితంగా మెచ్చుకోవాలనిపిస్తుంది. కాల భైరవ పాత్రలో చరణ్ నటన అందరినీ మెప్పించింది.

రచ్చ , ఎవడు , నాయక్ , గోవిందుడు అందరి వాడేలే , బ్రూస్ లీ , ధృవ, ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తూ హీరోగా మరింత ఎదిగిన చరణ్ ‘రంగస్థలం’ లో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. చిట్టి బాబు గా చరణ్ నటన అద్భుతం అంటూ చూసిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకునేలా చేశాడు. సుకుమార్ రాసిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చిట్టి బాబు పాత్రకు ప్రాణం పోసాడు చరణ్. రామ్ చరణ్ కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉండే కేరెక్టర్ చిట్టి బాబు. ఆ సినిమాలో తన నటనకి అవార్డు రాకపోయినా ప్రేక్షకుల కాంప్లిమెంట్స్ , ప్రేమ సొంతం చేసుకున్నాడు.

రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అభిమానులను , ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఆ సినిమాతో కూడా మంచి వసూళ్లు రాబట్టి హీరోగా తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కి చూపించాడు. నిజానికి మగధీర నుండే భారీ వసూళ్లు , సరికొత్త రికార్డులు కొలకొల్పిన చరణ్ హీరోగా ఆరంభంలోనే ప్రతీ సినిమాతో అవలీలగా 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇది నిజంగా గొప్ప విషయం.

చిట్టి బాబు గా మెప్పించిన చరణ్ లో మరో కోణాన్ని ఆవిష్కరించిన పాత్ర రామ రాజు. RRR లో అల్లూరి సీతా రామరాజు గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో విజిల్స్ క్లాప్స్ కొట్టించాడు చరణ్. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగి వరల్డ్ వైడ్ గా గొప్ప గుర్తింపు అందుకున్నాడు.

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చరణ్ కి ఈ ఏడాది చాలా స్పెషల్. తండ్రిగా ప్రమోషన్ అందుకున్న చరణ్ కూతురు క్లిన్ కారతో కలిసి ఈ ఏడాది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూంది జీ సినిమాలు.