Manasantha Nuvve - అద్భుతమైన ప్రేమ కథకి 20 ఏళ్ళు

Tuesday,October 19,2021 - 09:32 by Z_CLU

ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి మనసుకి హత్తుకున్న ఓ ప్రేమకథ విడుదలైంది. ఆ సినిమానే ‘మనసంతా నువ్వే’. ఉదయ కిరణ్, రీమా సేన్ జంటగా VN ఆదిత్య దర్శకత్వంలో MS రాజు నిర్మించిన ఈ సినిమా వెనుక ఎంతో ఆసక్తికర కథ ఉంది. ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేవి పుత్రుడు తో ఊహించని అపజయం అందుకున్న నిర్మాత ఎమ్మెస్ రాజు తన మిత్రుడు కెమెరామెన్ S గోపాల్ రెడ్డి కలిసినెక్స్ట్ ఓ క్యూట్ లవ్ స్టోరీ లాంటి సినిమా చేయాలి చెప్పారు. వెంటనే గోపాల్ రెడ్డి సింగీతం , జయంత్ సి పరాంజీ దగ్గర పనిచేసిన చాకులాంటి కుర్రాడు ఉన్నాడు అంటూ VN ఆదిత్య ఫోన్ నంబర్ రాజు గారికిచ్చాడు. వెంటనే ఆదిత్య కి ఫోన్ కొట్టారు MS రాజు. హాస్పిటల్ కి వెళ్ళే సమయంలో రాజు గారు ఫోన్ చేయడంతో ఆదిత్య తర్వాత మాట్లాడతానండీ అంటూ ఫోన్ పెట్టేసి హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. వచ్చాకా తీరిగ్గా ఆరా తీస్తే ఫోన్ చేసింది అగ్ర నిర్మాత ఎమ్మెస్ రాజు అని తెలిసింది. ఆయన నాకెందుకు ఫోన్ చేశారు ? ఏమై ఉంటుంది ? అంటూ ఆలోచించసాగాడు ఆదిత్య.

manasantha Nuvve movie 20 years zeecinemalu special

మరుసటి రోజు ఆదిత్య నుండి కాల్ వస్తుందనుకుంటే రాలేదేంటి అని అనుకుంటూ మరోసారి ఫోన్ చేశారు రాజు. ఫోన్ లేపి ” అర్జెంట్ గా రాజమండ్రి వెళ్తున్నానండి. అక్కడ పూజా చేసుకొని వచ్చాక కలుస్తాను” అని చెప్పాడు. “సరే వచ్చాక కలవండి అంటూ సున్నితంగా ఫోన్ పెట్టేశారు రాజు. వారం దాటినా ఆదిత్య నుండి ఫోన్ రాకపోవడంతో గోపాల్ రెడ్డి చాలా మంచి కుర్రాడని చెప్పాడు ఇంత ఇర్రేస్పాన్సిబుల్ గా ఉన్నాడేంటి? అనుకుంటూ ఫైనల్ గా ఓసారి చేద్దాం వస్తే వచ్చాడు లేదంటే లేదు అంటూ ఫైనల్ కాల్ చేశారు. వెంటనే సుమంత్ ఆఫీస్ లో వాలిపోయాడు ఆదిత్య.

కోడి రామకృష్ణ గారు ఉండగా తనతో సినిమా ఎలా చేస్తారని అనుకున్నానని అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ఫైనల్ గా సినిమా ప్రపోజల్ పెట్టి రెండు ఓ ఐడియా చెప్పి ఈ లైన్ మీద వర్కౌట్ చేస్తే సినిమా చేద్దామని అన్నారు రాజు. ” ఇది ప్రేమించుకుందాం రా’ తరహా కథలాగే ఉందండి. నేనా సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశా. మళ్ళీ అదే కథతో సినిమా ఎలా చేయగలను ? అంటూ మనసులో ఉన్న మాటను దైర్యం చేసుకొని చెప్పేశాడు ఆదిత్య. ఇది నిన్ను టెస్ట్ చేయడానికి నేను చెప్పిన ఐడియా. నీ గురించి తెలుసుకోవడానికి టెస్ట్ చేశా అనగానే ఆదిత్య షాకయ్యాడు.

manasantha Nuvve movie 20 years zeecinemalu special

తర్వాత రెండో ఐడియా చెప్పారు రాజు. లవ్ స్టోరీతోనే దర్శకుడిగా మారాలనుకున్న ఆదిత్య కి ఆ పాయింట్ బాగా నచ్చేసింది. 1946 లో వచ్చిన అన్మోల్ ఘడీ అనే సినిమా స్పూర్తితో రాజు గారు చెప్పిన ఆ లైన్ ని రాజు, ఆదిత్య, పరుచూరి బ్రదర్స్, వీరు పొట్ల అందరూ కలిసి డెవలప్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా కథ రెడీ అయింది. ఇక ఈ సినిమాను చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో భాగ్యరాజా సినిమాలా స్టార్ట్ చేయాలన్నది ఆదిత్య ఆలోచన. వెంటనే మంచి చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కుదిర్చారు. హీరోతో పాటే ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ ని పాత సినిమాలో రేలంగి పాత్ర లాగా డిజైన్ చేశారు.

సినిమాలో కీలకమైన రెయిన్ సీన్ ని డైలాగ్ తో రాజు గారికి చెప్పాడు ఆదిత్య. ఆ సీన్ రాజు గారికి విపరీతంగా నచ్చడంతో వెంటనే పాతిక వేల రూపాయిల చెక్ ఆదిత్య చేతిలో పెట్టేశారు. కొన్ని రోజులకే కొత్త కుర్రాడితో MS రాజు కొత్త సినిమా ‘మనసంతా నువ్వే’ అంటూ ప్రకటన వచ్చేసింది. ముందుగా ఈ సినిమాను మహేష్ బాబు తో చేయాలని అనుకున్నారు రాజు గారు. కానీ ఈ కథకి కొత్త కుర్రడైతేనే బాగుంటుందని ఆదిత్య భావించారు. ఫైనల్ గా ‘చిత్రం’ , ‘నువ్వు నేను’ చేసిన ఉదయ్ కిరణ్ ని ఫిక్స్ చేశారు. ఆర్ పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్. ఫీల్ గుడ్ లవ్ స్టోరికి అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసేశారు ఆర్పి. మలయాళంలో విద్యాసాగర్ కంపోజ్ చేసిన ‘కన్నాడి కూడుంకూట్టి’ పాటను యథాతదంగా వాడుకున్నారు. అదే తూనీగా తూనీగా. ఆ పాట సినిమాకు బాగా కలిసొచ్చింది. పెద్ద హిట్టయింది.

manasantha Nuvve movie 20 years zeecinemalu special

చకచకా షూటింగ్ పూర్తి చేశారు. మేకింగ్ లోఅక్కడి కక్కడే కొన్ని మార్పులు జరిగాయి. అవి సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ఫైనల్ గా రామానాయుడు స్టూడియో లో రషెస్ చూసి చాలా మంది పెదవి విరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ తేడా కొట్టిందని చెప్పారు. అప్పుడు ఎడిటర్ కె.వి. కృష్ణా రెడ్డి ఎడిటింగ్ చిన్న చేంజ్ చేసి ఫస్టాఫ్ లో నీ స్నేహం సాంగ్ ని క్లైమాక్స్ లో మళ్ళీ యాడ్ చేసే సరికి ఫీల్ క్యారీ అయింది. ఎక్కడ లేని డెప్త్ వచ్చేసింది.

2001 అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా అక్కడి నుండి వసూళ్ళతో పరుగు పెట్టింది. నిర్మాత ఎమ్మెస్ రాజు కి మంచి కలెక్షన్లు , దర్శకుడికి సూపర్ హిట్ ఎంట్రీ , ఉదయ కిరణ్ కి హ్యాట్రిక్ హిట్ లభించింది. ఇరవై ఏళ్ళయినా ఈ సినిమా చూస్తే ఇంకా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ స్టోరి , పాటలు మనల్ని మైమరిపింప జేస్తాయి. ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.

-రాజేష్ మన్నె

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics