టాలీవుడ్ లో ఈరోజు స్పెషాలిటీ

Thursday,July 05,2018 - 04:20 by Z_CLU

టాలీవుడ్ లో ఈరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇదే రోజున విడుదలై చరిత్రలో నిలిచిపోయాయి. వాటిలో ఒకటి కృష్ణ నటించిన వజ్రాయుధం.

3 వందలకు పైగా సినిమాలు చేసిన సూపర్ స్టార్ కెరీర్ లో ఎన్నో విజయాల్లో ఒకటి వజ్రాయుధం. 1985న సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమా నేటితో 33 ఏళ్లు పూర్తిచేసుకుంది. రాఘవేంద్రరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. అదే ఏడాది అగ్నిపర్వతం సినిమాతో కృష్ణ-రాఘవేంద్రరావు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ సక్సెస్ వచ్చిన 6 నెలలకే వజ్రాయుధంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ కాంబినేషన్.

ఇక ఇదే రోజున విడదలై ఘనవిజయం అందుకున్న మరో సినిమా వేటగాడు. 1979, జులై 5న విడుదలైన ఈ సినిమా ఇవాళ్టికి సరిగ్గా 39 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్-శ్రీదేవి నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్-డూపర్ హిట్. దాదాపు 57 కేంద్రాల్లో ఈ సినిమా విడుదలైతే అన్ని సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇక 29 సెంటర్లలో వంద రోజులాడింది వేటగాడు సినిమా.

చరిత్రలో ఈరోజు విడుదలై ఘనవిజయం సాధించిన మరో చిత్రం భక్త తుకారాం. లెజెండ్ ఏఎన్నార్ నటించిన భక్తిరస చిత్రాల్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా. 1973 జులై 5న విడుదలైన ఈ సినిమా ఇవాళ్టితో 45 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. వి.మధుసూధనరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాకు పి.ఆదినారాయణరావు సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్. అంతేకాదు, ఇదే సినిమాలో తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ నటించారు.