నా బాలీవుడ్ రీఎంట్రీకి ఇదే రైట్ మూవీ

Tuesday,August 20,2019 - 04:52 by Z_CLU

సైరా టీజర్ రిలీజ్ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు చిరంజీవి. ఆజ్ కా గుండారాజ్ తర్వాత మళ్లీ బాలీవుడ్ స్క్రీన్ పై కనిపించని మెగాస్టార్, హిందీలో తన రీఎంట్రీకి సైరానే కరెక్ట్ మూవీ అన్నారు. మంచి కంటెంట్ దొరక్కపోవడం వల్లనే బాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చానని క్లారిటీ ఇచ్చారు.

“ఆజ్ కా గూండారాజ్ తర్వాత మళ్లీ రాలేకపోయాను. అలా జరిగిపోయింది. పైగా బాలీవుడ్ కు మళ్లీ రావడానికి మంచి కంటెంట్ దొరకలేదు. దీనికితోడు ఆమధ్య నేను నటించడం ఆపేశాను. రాజకీయాల్లో పదేళ్లు ఉన్నాను. మళ్లీ 2016 నుంచే మళ్లీ నటిస్తున్నాను. బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి సైరానే కరెక్ట్ సినిమా అనిపించింది.”

పదేళ్ల కెరీర్ గ్యాప్ లో ఫిలిం మేకింగ్ టెక్నాలజీ చాలా మారిపోయిందన్నారు చిరంజీవి. రీల్స్, ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్ అంతా మారిపోయిందని, 150వ సినిమా చేస్తున్నప్పుడు అంతా కొత్తగా ఉందన్నారు. అయితే టెక్నాలజీ ఎంత మారినా కంటెంట్ లో ఎమోషన్, సోల్ మారదని.. అదే తనను ముందుకు నడిపిస్తుందన్నారు మెగాస్టార్. సైరా కోసం దర్శక-నిర్మాతలు సురేందర్ రెడ్డి, చరణ్ తనను బాగా కష్టపెట్టారని సరదాగా అన్నారు.

“స్టోరీ విన్నప్పుడు పెద్దగా టెన్షన్ పడలేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. బాడీ డబుల్ కాన్సెప్ట్ ఉంది. డూప్ పెట్టి లాగించేద్దాం, చేసేద్దాం అనుకున్నాను. కానీ దర్శకుడు, నిర్మాత నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. వీళ్లిద్దరూ నాతో దగ్గరుండి అన్ని ఫైట్స్ చేయించారు. నా భుజానికి సర్జరీ కూడా అయింది. అయినా వాళ్లు నన్ను వదల్లేదు. కత్తియుద్ధం, గుర్రపుస్వారీ చేయించారు. ఇదంతా సరదాగా చెబుతున్నాను. కష్టపడ్డం నాకు ఇష్టం. షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాను.”

బాలీవుడ్-టాలీవుడ్ కు కనెక్ట్ అయ్యేలా మంచి కంటెంట్ దొరికిన ప్రతిసారి హిందీలో సినిమా చేస్తానని స్పష్టంచేశారు మెగాస్టార్. తన రియల్ లైఫ్ గురువు అమితాబ్ బచ్చన్ తో నటించడం తన అదృష్టం అన్నారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది సైరా.