SuperStar Krishna: టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ కన్నుమూత

Tuesday,November 15,2022 - 07:45 by Z_CLU

Super Star Krishna Passed Away at the age of 79

టాలీవుడ్ లో మరో శకం ముగిసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ స్థాయి అందుకొని, సూపర్ స్టార్ అనిపించుకున్న ఘట్టమనేని కృష్ణ ఇక లేరు. ఈ రోజు ఉదయం కన్నుమూశారు కృష్ణ. ఆయన వయసు 79 ఏళ్లు.

ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కృష్ణ. వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటిల్ కు తీసుకెళ్లారు. కొద్దిసేపటికే వైద్యులు ఆయన గుండె కొట్టుకునేలా చేయగలిగారు. కానీ ఇతర అవయవాలు సహకరించకపోవడంతో, ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు సూపర్ స్టార్.

1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. డిగ్రీ పూర్తిచేసిన కృష్ణ సినిమాల్నే కెరీర్ గా ఎంచుకున్నారు.

1965లో ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు కృష్ణ. అలా తొలి సినిమానే సక్సెస్ అందుకున్న కృష్ణ, మూడో సినిమాకే హిట్ హీరో అనిపించుకున్నారు. ఆయన నటించిన గూఢచారి-116 సినిమా పెద్ద హిట్టయింది. ఆంధ్రా జేమ్స్ బాండ్ అనే ఇమేజ్ ను తీసుకొచ్చింది.

Krishna

గూఢచారి-116 సక్సెస్ తో ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు కృష్ణ. తెలుగులో అత్యథికంగా 6 జేమ్స్ బాండ్ తరహా సినిమాల్లో నటించిన కృష్ణ, ఆ జానర్ లో అత్యథిక హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా నిలిచారు.

70-71 దశబ్దాల్లో కృష్ణ శకం నడిచింది. ఆయన నటించిన సినిమాలు ఏడాదిలో పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యేవి. 1968లో 10, 1969లో 15, 1970లో 16, ఇక 1972లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేశారు కృష్ణ.

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్..
టాలీవుడ్ లో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్. కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు కృష్ణ. టాలీవుడ్ లో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసిన కృష్ణ, తన కెరీర్ లో ఎన్నో సాహసాలు చేసి డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకున్నారు. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు ఏఎన్నార్ తమదైన పంథాలో సినిమాలు చేస్తుంటే, వాళ్లకు పోటీగా విలక్షణమైన చిత్రాలు అందిస్తూనే, భారీసంఖ్యలో సినిమాలు చేసి ఇండస్ట్రీ కళకళలాడేలా చేశారు కృష్ణ. రోజుకు 3 షిఫ్టులు పనిచేస్తూ టాలీవుడ్ కార్మికులకు అన్నం పెట్టారు. కృష్ణ సినిమాలు చేసినన్ని రోజులూ ఏ కార్మికుడూ ఖాళీగా లేడు. చివరికి షూటింగ్ గ్యాప్ లో సేదతీరే టైమ్ లో కూడా కృష్ణ నిద్రపోయే సీన్లను తీసేవారు మేకర్స్.

ఇక ప్రయోగాల విషయానికొస్తే… తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి తెలుగు కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్ స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70ఎంఎం సినిమా (సింహాసనం), తొలి ORW రంగుల చిత్రం (గూడుపుఠానీ), తొలి ఫ్యూజీ రంగుల చిత్రం (భలే దొంగలు), తొలి సినిమాస్కోప్ టెక్నో విజన్ (దొంగల దోపిడీ) లాంటి ఎన్నో ప్రయోగాలు కృష్ణ నుంచి వచ్చినవే. అంతేకాదు, తొలిసారి ఓ తెలుగు పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది కూడా కృష్ణ సినిమాతోనే. అదే అల్లూరి సీతారామరాజు. దర్శకుడిగా కూడా 16 సినిమాలు తీశారు కృష్ణ. కొత్త కొత్త గాయకుల్ని పరిశ్రమకు పరిచయం చేశారు. లెక్కలేనంతమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఇండస్ట్రీ ఎవరో ఒకరి సొత్తు కాదు అనే అభిప్రాయం కృష్ణ రాకతోనే మొదలైంది.

తన కెరీర్ లో వందమందికి పైగా దర్శకులతో పనిచేశారు కృష్ణ. అత్యథికంగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు చేశారు. ఆ తర్వాత విజయ నిర్మల దర్శకత్వంలో నటించారు. చంద్రశేఖర్ రెడ్డి, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు, దాసరి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు.

krishna

కుటుంబ జీవితం..
తన 19వ ఏట ఇందిరాదేవిని పెళ్లాడారు కృష్ణ. వీరికి ఐదుగురు సంతానం. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు. ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. వీళ్లలో ముందుగా నటుడిగా మారింది రమేష్ బాబు. కెరీర్ స్టార్టింగ్ లో సక్సెస్ లు అందుకొని తర్వాత నిర్మాతగా మారారు. ఇక మహేష్ బాబు సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మంజుల కూడా నటిగా, నిర్మాతగా చేశారు. మిగతావాళ్లంతా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు కృష్ణ.

ఎన్నో అవార్డులు..
5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన కృష్ణ, తన కెరీర్ లో 350కి పైగా సినిమాలు చేసి సూపర్ స్టార్ అనిపించుకున్నారు. తన సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. పద్మభూషణ్ నుంచి నంది అవార్డులు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు, లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు.

krishna

తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన కృష్ణ, గడిచిన ఐదేళ్లుగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా కరోనాతో ఆయన జనజీవన స్రవంతికి దూరమయ్యారు. వయసురీత్యా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఫొటోల్ని కుటుంబ సభ్యులు నమ్రత, మంజుల షేర్ చేస్తూనే ఉన్నారు. ఈమధ్య తన భార్య ఇందిరను కోల్పోయిన కృష్ణ, ఇప్పుడు తను కూడా ఈ లోకాన్ని వీడివెళ్లారు.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, ossips, Actress Photos and Special topics