Thaman - తమన్ మరో మణిశర్మ

Tuesday,March 01,2022 - 12:57 by Z_CLU

S Thaman replaced Manisharma in Tollywood

కొన్నేళ్ళ పాటు తన మ్యూజిక్ తో మేజిక్ చేసి ఇప్పటికీ సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఒక టైంలో మణి గారి నుండి మెలోడీ వస్తుందంటే చాలు పదే పదే వినే పాట రాబోతుందని ఫిక్స్ అయిపోయే వారు మ్యూజిక్ లవర్స్. ఆ రేంజ్ లో తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేశారు మణి. అయితే మణి కేవలం పాటలతో కాదు తన మార్క్ నేపథ్య సంగీతంతో ఎన్నో సినిమాలకు బలాన్నిచ్చారు. ఒక టైంలో మా సినిమాకు మణి  పాటలు , నేపథ్య సంగీతం ఉండాల్సిందే అంటూ ఫిక్సయిపోయి ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు దర్శక నిర్మాతలు. ఇక హీరోలు కూడా సినిమా డిస్కషన్ స్టేజిలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మని తీసుకోవాల్సిందే అని దర్శక నిర్మాతలకు చెప్పేవారు. అల మణిశర్మ మ్యూజిక్ ఉండాల్సిందే అంటూ పట్టుబట్టిన హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అందుకే కొన్నేళ్ళ పాటు మణిశర్మ లేకుండా ఏ సినిమా చేయలేదు మహేష్.

ఇక మణిశర్మ మెలోడీ సాంగ్స్ లోనే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనూ మాస్టరే. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ లా నిలిచింది అని ప్రేక్షకులు చెప్పుకున్న సందర్భాలెన్నో. అందుకే ఆ మధ్య సాంగ్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మణిశర్మ గారే ఇవ్వాలని కోరుకునేవారు మేకర్స్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దానికి ఓ ఉదాహరణ. అయితే మణిశర్మ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మ్యూజిక్ లో ఆ క్రేజ్ అందుకొని దూసుకెళ్తున్నాడు తమన్.

అవును ఇప్పుడు తమన్ మ్యూజిక్ ఒక సెన్సేషన్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ పరంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవడమే. ఇప్పటికే మెలోడీ సాంగ్స్ తో యూ ట్యూబ్ ని షేక్ చేసి బిలియన్ వ్యూస్ తో రికార్డులు అందుకున్న తమన్ తాజాగా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులకు మణిశర్మని గుర్తుచేస్తున్నాడు. ‘అల వైకుంఠ పురములో’ ఆల్బం తమన్ ని వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ లవర్స్ కి బాగా దగ్గర చేసింది. అక్కడి నుండి బెస్ట్ సాంగ్స్  ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. తన సినిమాలకే కాకుండా… తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోరుకునే సినిమాలకూ స్కోర్ ఇస్తున్నాడు. ఈ విషయంలోనూ మణిశర్మని గుర్తుచేస్తున్నాడు తమన్. ఇప్పటికే కొన్ని  సినిమాలకు తన స్కోర్ ఇస్తూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. తాజాగా ‘రాధే శ్యామ్’ సినిమాకు కూడా స్పెషల్  స్కోర్ ఇచ్చాడు తమన్. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. ‘భాగమతి’ , ‘మజిలీ’ , ‘డీజే టిల్లు’ సినిమాలకు స్పెషల్ స్కోర్ ఇచ్చాడు తమన్.

ఏదేమైనా ఒకప్పడు తన క్రేజ్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పటికీ ట్రెండీ మ్యూజిక్ ఇస్తున్న మణిశర్మ తో తమన్ ని పోలిస్తే ఆయన శిష్యుడిగా తమన్ ఒప్పుకోకపోవచ్చు… కానీ ఇదే నిజం. తాజాగా ‘అఖండ’, ‘భీమ్లా నాయక్’ సినిమాలను స్కోర్ లేకుండా చూస్తే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics