ఈ వీకెండ్ ఖాళీ.. రేపట్నుంచి బంద్

Thursday,March 01,2018 - 01:17 by Z_CLU

ఈ వీకెండ్ టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదలకావట్లేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి ఎగ్జామ్స్ సీజన్ మొదలైంది. ఇక రెండోది రేపట్నుంచి థియేటర్లలో బంద్ ప్రకటించారు.

సౌత్ కు చెందిన నిర్మాతలంతా కలిసి జాయింట్ యాక్షన్ ఫోర్స్ గా ఏర్పడి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్పీ)తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. థియేటర్లలో డీఎస్పీ సర్పీస్ చార్జీలు నిలిపివేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా చార్జీలు మాఫీ చేయకుండా, కొంత తగ్గిస్తామని డీఎస్పీలు ప్రతిపాదించారు. దీనికి అంగీకరించని నిర్మాతలు రేపట్నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లలో సినిమాల ప్రసారాలు ఆపేయాలని నిర్ణయించారు.

వర్చువల్ ప్రింట్ ఫీ (VPF)ని పూర్తిగా రద్దుచేయాలనేది నిర్మాతల ప్రధానమైన డిమాండ్. సినిమా యాడ్స్ తమకే ఇవ్వాలని, కమర్షియల్ యాడ్స్ నిడివి 8 నిమిషాలు మించకూడదనేది మిగతా రెండు డిమాండ్స్. ఈ 3 డిమాండ్లపై బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో మూడు విడతలుగా చర్చించారు. ఈ డిమాండ్లకు యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్ డీ లాంటి డీఎస్పీలు అంగీకరించలేదు. దీంతో రేపట్నుంచి థియేటర్లలో సినిమా ప్రసారాలు నిలిపివేయాలని ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నిర్ణయించింది.