నితిన్ సినిమాకు పవన్ టైటిల్

Saturday,March 11,2017 - 12:06 by Z_CLU

ఇన్నాళ్లూ పవన్ సినిమాలోని డైలాగ్స్ ను టైటిల్స్ గా పెట్టుకున్నాడు. పవర్ స్టార్ సినిమాలోని పాటల్ని రీమిక్స్ చేశాడు. ఇప్పుడు ఏకంగా పవన్ సినిమా పేరునే తన సినిమాకు టైటిల్ గా పెట్టేసే ప్లాన్ లో ఉన్నాడు నితిన్. కాకపోతే ఈ టైటిల్ ను కాస్త మారుస్తున్నాడు. పవన్ మొదటి సినిమా స్ఫూర్తితో అక్కడబ్బాయి-ఇక్కడమ్మాయి అనే టైటిల్ ను తాజాగా రిజిస్టర్ చేయించారు. త్రివిక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది.

ఈమధ్యే పవన్-త్రివిక్రమ్ నిర్మాతలుగా మారి నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకే అక్కడబ్బాయ్-ఇక్కడమ్మాయి అనే టైటిల్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైన తర్వాత సినిమా టైటిల్ పై ఓ క్లారిటీ వస్తుంది.

నిజానికి పవన్ కల్యాణ్ తో ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా కోసం అక్కడబ్బాయ్-ఇక్కడమ్మాయి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని అనుకున్నప్పటికీ.. ఆ వార్తల్ని త్రివిక్రమ్ తోసిపుచ్చాడు. పవన్ సినిమాకు వేరే టైటిల్ పెడతామని ప్రకటించాడు.