టాలీవుడ్ అల్టిమేట్ ట్రెండ్ సెట్టర్

Friday,October 05,2018 - 02:31 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. కానీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అలా టాలీవుడ్ ను మలుపుతిప్పిన సినిమాలు చెప్పమంటే టాప్-5లో కచ్చితంగా ఉండే సినిమా శివ. ఇప్పుడీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకునే సందర్భం వచ్చింది. అవును.. శివ రిలీజై ఈరోజుకి సరిగ్గా 29 ఏళ్లయింది.

అక్టోబర్ 5, 1989న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ గతినే మార్చేసింది. సినిమాలో టేకింగ్, సౌండ్ ఎఫెక్టు, తక్కువ డైలాగులు, హీరోయిజం.. ఇలా అన్ని విభాగాల్లో కొత్తదనం చూపించింది శివ సినిమా. అంతెందుకు, చివరికి పోస్టర్ డిజైన్లలో కూడా శివ ట్రెండ్ సెట్టరే. హీరో లేకుండా పోస్టర్లు దించిన మొట్టమొదటి సినిమా శివ.


ఇప్పుడు విచ్చలవిడిగా వాడుతున్న స్టడీకామ్ కెమెరాను తెలుగుతెరకు పరిచయం చేసిన సినిమా శివ. ఈ శతాబ్దపు అత్యుత్తమ వంద చిత్రాల్లో శివ సినిమా కూడా ఒకటి. రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా శివ.

ఇళయరాజా కంపోజ్ చేసిన శివ సాంగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. టాలీవుడ్ కు ఎంతో టెక్నాలజీని పరిచయం చేసిన ఈ సినిమా, మరెంతోమంది నటుల్ని కూడా అందించింది. జెడీ చక్రవర్తిని వెండితెరకు పరిచయం చేయడంతో పాటు, రఘవరన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.