సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 ఏళ్లు

Friday,January 12,2018 - 12:10 by Z_CLU

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘అసాధ్యుడు’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమా ఇది.

క్రైమ్‌ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అయినప్పటికీ.. కథలోని కొత్తదనం వల్ల ఘనవిజయాన్ని అందుకుంది. అడ్వంచర్‌ సినిమాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా ‘అసాధ్యుడు’. ఈ సినిమాలో ఓ చిన్న సన్నివేశం కోసం సూపర్‌స్టార్‌ కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామరాజు’గా నటించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ పాత్ర పోషించాలన్న కోరిక కృష్ణకు అంతకుముందే వుండేది. ఈ సినిమాతో అది కొంత తీరింది. చరిత్ర సృష్టించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్ర రూపకల్పనకు ‘అసాధ్యుడు’ చిత్రం నాంది పలికిందని చెప్పొచ్చు.

సంక్రాంతికి తొలిసారి విడుదలైన కృష్ణ సినిమా కూడా ఇదే. 1968 జనవరి 12న ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించడంతో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్‌ మొదలైంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఈ సినిమాతోనే పరిచయమయ్యారు.

‘అసాధ్యుడు’ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ ”ఈ జనవరి 12కి ‘అసాధ్యుడు’ రిలీజ్‌ అయి 50 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదట సంక్రాంతికి విడుదలైన చిత్రమిదే. అందులోనే 15 నిమిషాలు ఉండే బ్యాలేలో అల్లూరి సీతారామరాజుగా నేను యాక్ట్‌ చేశాను. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు ఫుల్‌ పిక్చర్‌ చెయ్యాలని మనసులో ఓ కోరిక వుండేది. ఈ బ్యాలేని దర్శకుడు రామచంద్రరావుగారే పిక్చరైజ్‌ చేశారు. ఆ తర్వాత ‘అల్లూరి సీతారామారాజు’ చిత్రానికి కూడా ఆయన్నే డైరెక్టర్‌గా సెలెక్ట్‌ చేసుకొని ప్రారంభించడం జరిగింది” అన్నారు.