మెగాస్టార్ చేతుల మీదుగా ఏఎన్నార్ అవార్డ్స్

Monday,November 18,2019 - 11:41 by Z_CLU

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డులు ఇస్తోంది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది.

2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వైభ‌వంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ” సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, అదే నాకు అన్నీ ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఇవ్వాలని ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ సృష్టించబడింది. ఇవి ఈ అవార్డ్స్ గురించి నాన్న చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము.” అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “మా అమ్మ గారికి నాగేశ్వర రావు గారు అంటే అంత అభిమానం కాబట్టే నాకు సినిమా అంటే అంత అభిమానం ఏర్పడింది. అందుకే చదువు అయిపోగానే ఇండస్ట్రీ కి రావాలని కోరుకున్నాను, వచ్చాను. నాగేశ్వర రావు గారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి చెప్పిన ఎన్నో విషయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడింది. ఆ రకంగా నాగేశ్వర రావు గారు నాకు గురుతుల్యులు.” అన్నారు.

ఈ కార్యక్రమంలో..విజయ్ దేవరకొండ, సుమంత్, నాగచైతన్య, అఖిల్, నిహారిక, మంచు లక్ష్మి, అడివి శేష్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, లావణ్య త్రిపాఠి, నిర్మాత పి.వి.పి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.