హీరో కార్తికేయ ఇంటర్వ్యూ

Wednesday,July 31,2019 - 04:15 by Z_CLU

‘ఆర్ ఎక్స్ 100’ తో హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ మూడో సినిమా ‘గుణ 369’తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా కార్తికేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే….

ఆ కిక్కే వేరు

‘ఆర్ ఎక్స్ 100’ రిలీజ్ నుండి ఇప్పటి వరకూ ఎక్కడికి వెళ్ళినా ఆర్ ఎక్స్ 100 హీరో… అని లేదా సినిమా టైటిల్ తోనే పిలుస్తున్నారు. నా డెబ్యూ సినిమా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఎంతో సంతోషం. పైగా ఇప్పుడు హిందీ , కన్నడ, తమిళ్ లో ఆ సినిమాను రీమేక్ చేస్తుంటే మరింత హ్యాపీ గా ఉంది. మనం చేసిన సినిమాను వేరే వాళ్ళు మిగతా భాషల్లో చేస్తుంటే ఆ కిక్కే వేరు.

ఇదొక్కటే గుర్తుపెట్టుకుంటారు

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన ‘హిప్పీ’ సినిమా ఫ్లాప్ అయింది. కానీ దాని ఎఫెక్ట్ ఈ సినిమాపై ఉండదని నమ్ముతున్నాను. హీరో రామ్ కి ఈ మధ్య పెద్ద సక్సెస్ లేదు. కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దేనికదే సెపరేట్. ఇదే ఎగ్జాంపుల్. నాకు జస్ట్ ఒక్క ఫ్లాపు మాత్రమే ఉంది. సినిమా బాగుంటే మన ముందు సినిమా రిజల్ట్ గురించి ఆడియన్స్ పట్టించుకోరు. ఈ సినిమాతో నా రెండు సినిమాలు మర్చిపోయి ఇదొక్కటే గుర్తుపెట్టుకుంటారు అదొక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను.


అనుకున్న దానికంటే

అర్జున్ గారు ఈ కథ చెప్పక ముందు వరకూ స్క్రిప్ట్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని ఊహించలేదు. వన్స్ ఆయన చెప్పడం మొదలెట్టాక బాగా ఎగ్జైట్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే సినిమా ఇంకా బాగా వచ్చింది. ఆయనకీ నాకు బాగా సింక్ అయ్యింది. ఆయనతో మళ్ళీ మళ్ళీ చేయాలనుంది.

‘గుణ’ వంతుడిగా

సినిమాకు ‘గుణ 369’ టైటిల్ పెట్టడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. సినిమాలో నేను నేను మంచి గుణాలున్న అబ్బాయిగా కనిపిస్తాను. అందుకే గుణవంతుడులో గుణ తీసుకున్నాం. ఆ టైటిల్ లో పవర్ కూడా ఉంటుంది. కథలో వచ్చే కీలక మార్పు వల్ల గుణ వంతుడిగా ఉండే నేను ఖైదీ నంబర్ 369 మారతాను. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. కథకి పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది.

పర్ఫెక్ట్ అనిపిస్తుంది

సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా కీలకం. ఆ క్యారెక్టర్ కి తెలిసిన వాళ్ళకంటే కొత్త అమ్మాయి అయితేనే క్లిక్ అవుతుందనుకున్నాం. అందుకే అనఘను హీరోయిన్ తీసుకోవడం జరిగింది. క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా ఆ అమ్మాయికి మంచి పేరొస్తుంది.


పార్ట్ అవ్వాలనిపించింది

ఈ సినిమా చేస్తున్నప్పుడు , చేసాక నేను కూడా ప్రొడక్షన్ లో పార్ట్ అయ్యుంటే బాగుండేది అనిపించింది. సినిమాకి బాగా డబ్బులొస్తాయని కాదు. ఒక మంచి సినిమాకు మనం ప్రొడక్షన్ లో కూడా పార్ట్ అయితే మనకి ఓ రెస్పెక్ట్ ఉంటుందని. మా నిర్మాతలకు ఆ అదృష్టం దక్కింది. రిలీజ్ తర్వాత ఒక మంచి సినిమా తీసారని ప్రొడక్షన్స్ కి పేరొస్తుంది అది కచ్చితంగా చెప్పగలను.

50 శాతం కథ… మిగతాది టీం

‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ గా చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో 50 శాతం కథ , క్యారెక్టర్ అయితే మిగతాది టీం. నాని -విక్రం కుమార్ గారు మైత్రి ఇలా పెద్ద వాళ్ళతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. సినిమా కోసం రేస్ కూడా నేర్చుకున్నాను. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది రిలీజ్ తర్వాత మీకే తెలుస్తుంది. రిలీజ్ తర్వాత కచ్చితంగా నటుడిగా నాకూ మంచి పేరొస్తుంది.

అన్ని చేయను

‘గ్యాంగ్ లీడర్’ లో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ కాబట్టి చేసాను. స్పెషల్ గా ఉండకపోతే విక్రం గారు అసలు నన్ను అప్రోచ్ అయ్యే వారు కాదు. ఈ సినిమా తర్వాత అలాంటి క్యారెక్టర్ మళ్ళీ వచ్చినా చేస్తాను. అలా అని సాదా సీదా విలన్ క్యారెక్టర్ మాత్రం చేయను.

అక్కడ అదే జరిగింది

మొన్న అల్లు అరవింద్ గారు మా సినిమా ఈవెంట్ లో వెల్కం టూ గీతా ఆర్ట్స్ అని అనడం వెనుక అసలు కథ వేరు. ఆయన బోయపాటి గారితో సినిమా అనౌన్స్ చేసాక నేను దగ్గరికి వెళ్లి మరి హీరో గా ..? అంటూ సరదాగా అడిగాను.ఆయన కూడా అంతే సరదాగా అలా అన్నారు.  కానీ నేను అన్నది మైక్ లో వినిపించలేదు. అది నిజమైతే బాగుంటుంది.


అప్రోచ్ అవ్వలేదు

‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్స్ నన్ను అప్రోచ్ అవ్వలేదు. త్వరలో వస్తాయని ఆశిస్తున్నాను. అప్పటి వరకూ నాకు వచ్చిన సినిమాలు చేస్తూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.

ఈ ఏడాదిలోనే

ప్రెజెంట్ శేఖర్ విక్యాత్ అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. ఆ సినిమాను నా సొంత బ్యానర్ లోనే చేస్తున్నాను. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుంది.

మరో డెబ్యూ డైరెక్టర్ తో

ఈ మధ్యే ఇంకో కథ ఫైనల్ చేసుకున్నాను. శ్రీ అనే డెబ్యూ డైరెక్టర్ మంచి కథ చెప్పాడు. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది.