వీకెండ్ రిలీజెస్ - జూన్ 16

Thursday,June 15,2017 - 12:00 by Z_CLU

ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలేవీ లేవు. మరకతమణి, అవంతిక లాంటి కొన్నిసినిమాలపై మాత్రమే అంచనాలున్నాయి.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మరకతమణి. టైటిల్ కు తగ్గట్టే మరకతమణి చుట్టూ సాగే సస్పెన్స్ డ్రామా ఇది. పేరుకు సస్పెన్స్ డ్రామానే అయినప్పటికీ సినిమాలో సీరియస్ కామెడీ బోలెడంత ఉంది. దీనికి తోడు ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి మరకతమణిపై పడింది. ఈ వీకెండ్ అంచనాలతో వస్తున్న సినిమా ఇదొక్కటే.

శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా అవంతిక. పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు మేకర్స్. అరుంధతి, అమ్మోరు, రాజు గారి గది తరహాలో గ్రాఫిక్స్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో 35 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీరాజ్.

అవంతిక, మరకతమణి సినిమాలతో పాటు థియేటర్లలోకి వస్తున్న ఇంకో మూవీ రాజా మీరు కేక. లాస్య, నోయెల్, హేమంత్, రేవంత్, తారకరత్న నటించిన ఈ సినిమాకు కృష్ణ కిషోర్ దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ అండ్ ఆర్కే స్టుడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మరో మూవీ పెళ్లికి ముందు ప్రేమకథ. .”రాజుగారి గది” ఫేమ్ చేతన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ చెప్పారు. తాగుబోతు రమేష్, సత్య, శివ ప్రసాద్, రాకేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ సీన్స్ ఈ మూవీకి హైలెట్ అంటున్నారు మేకర్స్. సునయన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మధు దర్శకత్వం వహించారు.

వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న మరో ప్రేమకథ కాదలి. ట్రయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లు నటించారు. మినిస్టర్ కేటీఆర్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. హీరో రామ్ చరణ్ ఆడియో రిలీజ్ చేశాడు. రానా టీజర్ రిలీజ్ చేశాడు. దీనికి తోడు సోషల్ మీడియాలో సినిమాకు ప్రమోషన్ బాగా చేశారు. దీంతో కాదలి మూవీ ఆడియన్స్ కు బాగానే రిజిస్టర్ అయింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ తెలుగు సినిమాలతో పాటు కార్స్-3, డెస్పికబుల్ మి-3 అనే రెండు హాలీవుడ్ మూవీస్ కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. కార్స్ సిరీస్ కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అందుకే కార్స్-3 సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.