సినారె కన్నుమూత

Monday,June 12,2017 - 12:43 by Z_CLU

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి కన్నుమూశారు. సినారెగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సి.నారాయణరెడ్డి వయసు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విశ్వంభర అనే రచనకు గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు సినారె.

తెలుగు సినీ రంగానికి సినారె చేసిన సేవలు ఎనలేనివి. ఎన్టీఆర్ నటించిన గులేబాకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే అనే పాటను సినారె రచించారు. అదే ఆయనకు తొలి సినిమా పాట. ఇప్పటికీ సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది ఆ సాంగ్.

అప్పట్నుంచి లెక్కలేనన్ని పాటలు రాశారు సినారె. ప్రతి పాటలో ఎంతో భావుకత, మరెంతో అర్థం ఉంటుంది. అలా తన కెరీర్ లో 3వేలకు పైగా పాటలు రాశారు సినారె.

చదువుకున్న అమ్మాయిలు, అమరశిల్పి జక్కన, బందిపోటు, చెల్లెలి కాపురం, తాత మనవుడు, శివరంజని.. ఇలా ఎన్నో సినిమాల విజయాల వెనక సినారె సాహిత్యం ఉంది. సినారె రచించిన చివరి గీతం అరుంధతి సినిమాలోనిది. అందులో జేజమ్మ.. జేజమ్మ అనే పాటను రచించింది సినారేనే.

పాటల్లో గ్రాంధికం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లోనే అలతి పదాలు వాడి సినీసాహిత్యాన్ని సామాన్యుడికి దగ్గర చేశారు సినారె. పాట అంటే పాడుకునేలా ఉండాలనేది సినారె ఉద్దేశం. అందుకే గ్రాంథిక పదాలు రాసిన అదే చేతులతో, చిన్నచిన్న పదాలతో కూడా పాటలు రాశారు. తెలుగు సినీరంగం ఉన్నంతవరకు సినారె గుర్తుండిపోతారు.