బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ

Wednesday,August 09,2017 - 05:04 by Z_CLU

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ  తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా జయజానకి నాయక. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ మూవీ విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు బోయపాటి.

లవ్ బ్యాక్ డ్రాప్

జయజానకి నాయక ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేసే సినిమా. నేను సినిమా చేసిన ప్రతిసారి మీరే అడుగుతుంటారు. మీరు మారరా. కొత్త ప్రయత్నం చేయరా అని అడుగుతుంటారు. భద్ర చేసిన తర్వాత నేను చేసిన ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జయజానకి నాయక. లవ్ సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ఉంటుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ దానికి యాడ్ అవుతాయి.

కొత్తగా ఉంటుందనే ఆ టైటిల్ పెట్టాం

టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. కథకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. సినిమా చూశాక మీరే ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. అందుకే ఈ సినిమాకు జయజానకి నాయక అనే టైటిల్ పెట్టాం.

నా మార్క్ యాక్షన్ ఉంది

సరైనోడుతో ఈ సినిమాను పోల్చవద్దు. నా  గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. కాకపోతే యాక్షన్ కూడా ఉంటుంది. అందులో నా మార్క్ ఉంటుంది. అయితే కావాలని పెట్టలేదు. ఇక్కడ కొట్టాలి అని ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే ఫైట్ ఉంటుంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే పాటలు అద్భుతంగా ఉన్నాయి. సిచ్యుయేషన్ పరంగా సాంగ్స్ ఉన్నాయి. ప్రతి పాట కథలోంచే వచ్చింది. కావాలని పెట్టలేదు.

పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్

ఫస్ట్ టీజర్ లో రొమాంటిక్, లవ్ ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత టీజర్ లో మొదటి టీజర్ కు జస్టిఫికేషన్ కనిపిస్తుంది. ఇక థియేట్రికల్ ట్రయిలర్ లో ఈ రెండు టీజర్ల జస్టిఫికేషన్ ఉంటుంది. కావాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఏదో పొరపాటున అలా చేసింది కాదు. కావాలనే ప్లాన్డ్ గా అలా చేశాం.

అనవసరంగా ఖర్చు చేయలేదు

బడ్జెట్ పెరగలేదు. కథకు తగ్గట్టే పెట్టాం. అయినా పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టే బిజినెస్ కూడా అయింది కదా. ఏ సినిమాను నేను తక్కువచేసి తీయను. నన్ను నమ్మి సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను డిసప్పాయింట్ చేయను. ఏదైనా కథ ప్రకారమే ఉంటుంది. ప్రతి సినిమాను నా మొదటి సినిమాగా ఫీల్ అయి చేస్తా. బయ్యర్ల నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము చేయను.

క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువే

సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు మాత్రమే టెన్షన్ పడతాను. తీసేసిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండదు. షూటింగ్ స్పాట్ లో కూడా టెన్షన్ పడడం నాకు నచ్చదు. అవసరమైతే ముందు రోజు రాత్రి 2 గంటలైనా షాట్ డివిజన్ కంప్లీట్ అయిన తర్వాతే నిద్రపోతా. ఒక రాత్రి నిద్రలేకపోతే నాకేం కాదు. ఈ కథకు చాలా నిడివి ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. 3 కుటుంబాల మధ్య కథ ఇది. వాళ్ల మధ్య జరిగే సంఘటనల కోసం భారీ తారాగణం కావాలి. అందుకే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని తీసుకున్నాం.

ఆరుగురు ముద్దుగుమ్మలు

ఈ సినిమాలో ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్. మరో కీలక పాత్రలో సెకెండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ కనిపిస్తుంది. ఇక ఐటెంసాంగ్ కోసం క్యాథరీన్ ను తీసుకున్నాం. వదిన పాత్ర కోసం ఇస్థార్ అనే మరో హీరోయిన్ ను తీసుకున్నాం. నందుకు భార్యగా నటించిందామె. మరో కీలకమైన పాత్ర కోసం ధన్య బాలకృష్ణన్ హీరోకు ఫ్రెండ్ గా చేసింది. ఈ ఐదుగురు కాకుండా, సీనియర్ నటి వాణి విశ్వనాథ్ ను కూడా తీసుకున్నాం. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఉన్నది 4 సీన్లే అయినా అద్భుతంగా చేశారు.

చిరంజీవికి కథ రెడీగా ఉంది కానీ..

చిరంజీవికి కథ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడు చేస్తామో తెలీదు. ప్రస్తుతానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఆ సినిమా అయిన తర్వాత చిరంజీవి ఏం చేస్తారో తెలీదు. కథ మాత్రం రెడీగా ఉంది. చిరంజీవి సినిమా అల్లు అరవింద్ నిర్మాతగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఉంటుంది.

మహేష్, బాలయ్య కోసం కథలు రెడీ

ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే చాలా కొత్త జానర్ లో ట్రై చేస్తున్నాం. కాకపోతే డేట్స్ ఎక్కువ కావాలి. మహేష్ ది కూడా రెడీ. వచ్చే ఏడాది మే లేదా జూన్ లో బాలయ్య సినిమా మాత్రం కచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఇది ఎప్పుడో కమిట్ అయిన సినిమా. మహేష్, బాలయ్య కోసం కథలు రెడీగా ఉన్నాయి. మహేష్ సినిమా డిస్కషన్స్ అయిపోయాయి. కథ మాత్రం చెప్పలేదు. స్టోరీ రెడీగా ఉంది. మహేష్ ఎప్పుడంటే అప్పుడు చెబుతా.

అఖిల్ తో కూడా సినిమా

అఖిల్ నాకు చాలా క్లోజ్. అతడి కోసం కూడా స్టోరీలైన్ రెడీగా ఉంది. కాకపోతే ఎప్పుడనేది తెలీదు. టైమ్ చూసి ఎనౌన్స్ చేస్తాం. ఆర్డర్ లో అఖిల్ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పలేం. అఖిల్ ఆల్ రౌండర్. పైకి క్లాస్ గా కనిపిస్తాడు కానీ ఏదైనా చేయగలడు. అఖిల్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఎప్పుడనేది చెప్పలేం.