2-స్టేట్స్ రీమేక్ లో అడివి శేషు

Wednesday,January 03,2018 - 12:57 by Z_CLU

మొన్నటికి మొన్న 2-కంట్రీస్ రీమేక్ వచ్చింది. ఇప్పుడు 2-స్టేట్స్ వంతొచ్చింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన పుస్తకం ఆధారంగా హిందీలో 2-స్టేట్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా తెలుగు రీమేక్ లో అడవి శేష్ హీరోగా నటించబోతున్నాడు.

నిజానికి 2-స్టేట్స్ రీమేక్ వ్యవహారం ఇప్పటిది కాదు. ఇందులో హీరో పాత్ర కోసం తెలుగులో చాలామందిని సంప్రదించారు. ఒకదశలో నాగచైతన్య కూడా నటిస్తాడంటూ రూమర్లు వచ్చాయి. ఫైనల్ గా ఈ ప్రాజెక్టు అడవి శేష్ చేతికి చిక్కింది. వీవీ వినాయక్ వద్ద అసోసియేట్ డైరక్టర్ గా పనిచేసిన వెంకట్ రెడ్డి.. ఈ రీమేక్ తో డైరక్టర్ గా పరిచయమౌతున్నాడు.

ఎమ్ఎల్వీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చి నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.