అన్నమయ్యకు 20 ఏళ్లు

Monday,May 22,2017 - 03:40 by Z_CLU

తెలుగుతెరపైకి భక్తిరస చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షుకులకు నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించి, ఈమధ్య కాలంలో ది బెస్ట్ డివోషనల్ మూవీగా పేరుతెచ్చుకుంది అన్నమయ్య సినిమా. దర్శకేంద్రురు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజుతో 20 ఏళ్లు పూర్తిచేసుకుంది.

20 ఏళ్లయినా ఇప్పటికీ అన్నమయ్య సినిమా చూస్తే అది భక్తిభవం కలుగుతుంది. మరీ ముఖ్యంగా కీరవాణి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తాయి. ప్రతి ఆలయంలో ఈ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది అన్నమయ్య.

సుమన్ వెంకటేశ్వరస్వామిగా దేవుని అవతారంలో, నాగార్జున అన్నమయ్యగా భక్తుడి పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమా స్పెషల్ మెన్షన్ యాక్టర్ కింద నాగార్జునకు కూడా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే, 42 సెంటర్లలో వంద రోజులాడింది అన్నమయ్య. వీటిలో 2 సెంటర్లలో 176 రోజులాడి రికార్డు సృష్టించింది. చెన్నైలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

అన్నమయ్య సినిమా పేరిట మరో అరుదైన రికార్డు కూడా ఉంది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ గా అన్నమయ్య చరిత్ర సృష్టించింది. ఈ 20 ఏళ్లలో ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. దటీజ్ అన్నమయ్య.