'వెంకటాపురం' రివ్యూ

Friday,May 12,2017 - 12:50 by Z_CLU

రిలీజ్ డేట్ : మే 12, 2017

నటీనటులు : రాహుల్, మహిమా మక్వాన్

సంగీతం: అచ్చు

కెమెరా: సాయిప్రకాష్

నిర్మాతలు : శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వేణు మడికంటి

రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం..


కథ :

పిజ్జా షాప్ లో డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్(రాహుల్) ఒక సందర్భంలో తన అపార్ట్మెంట్ కు కొత్తగా వచ్చిన చైత్ర(మహిమా మక్వాన్)తో ప్రేమలో పడతాడు. అలా అనుకోకుండా ఆనంద్ జీవితంలోకి వచ్చిన చైత్ర ఓ సందర్భంలో హత్యకు గురవుతుంది. వీరిద్దరి జీవితంలో అనుకోకుండా జరిగిన ఆ సంఘటన ఏమిటి? చైత్రను హత్య చేసిందెవరు..? ఫైనల్ గా ఈ మర్డర్ మిస్టరీ ని పోలీస్ ఆఫీసర్ అజయ్ (అజయ్) ఎలా ఛేదించాడు.. అనేది సినిమా కథాంశం..

 

నటీనటుల పనితీరు :

హ్యాపీ డేస్ లో టైసన్ క్యారెక్టర్ తో యూత్ అందరికీ ఫెవరెట్ గా మారిన రాహుల్ ఈ సినిమాలో ఓ సాధారణ కుర్రాడిగా, పిజ్జా డెలివరీ బాయ్ గా ఆకట్టుకున్నాడు.. ముఖ్యంగా లేటైనా హీరోగా రాహుల్ ఒక మంచి ఎటెంప్ట్ చేశాడు. ఇప్పటి వరకూ చేయని క్యారెక్టర్ కావడంతో కొత్త కోణంలో కనిపించి తన దైన నటనతో నటుడిగా మరో మెట్టు పైకి వెళ్ళాడు..  మహిమా మక్వానా తన యాక్టింగ్ తో పరవాలేదనిపించు కుంది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అజయ్ సినిమాకు ప్లస్ అయ్యాడు. ఇక కాశీ విశ్వనాధ్, అజయ్ గోష్, శశాంక్ తదితరులు తమ క్యారెక్టర్స్ ని న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు అచ్చు గురించే. గతంలో కొన్ని సినిమాల్లో సాంగ్స్ తో ఆకట్టుకున్న అచ్చు తన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలెట్ గా నిలిచాడు. అన్ని పాటలకు సాహిత్యం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది..మెయిన్ గా పాటల పిక్చరైజేషన్ లో తన పనితనం చూపించాడు సాయి ప్రకాష్. డైలాగ్స్ కొన్ని సందర్భాలలో మాత్రమే ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని పాత్రలకు డబ్బింగ్ కుదరలేదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు..


జీ సినిమాలు సమీక్ష :

వెంకటాపురం అనేది ఓ చిన్న సినిమా. ఇందులో నటీనటులు, టెక్నీషియన్లు కూడా  పేరున్నవాళ్లు కాదు. కానీ ఈ మూవీ విడుదలకు ముందే అందర్నీ ఎట్రాక్ట్ చేసిందంటే దానికి కారణం ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రయిలర్. అయితే విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న బజ్, సరైన ప్రమోషన్ లేకపోవడంతో రిలీజ్ టైమ్ లో కనిపించలేదు. దీనికి తోడు ఫస్టాఫ్ సరిగా లేకపోవడం సినిమాపై క్రేజ్ ను తగ్గించింది.

టైటిల్స్ నుంచే సినిమాను ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసిన దర్శకుడు.. భీమిలి అరాచకాలకు అడ్డాగా మారిందంటూ కాస్త ఆసక్తి కలిగించాడు.. కానీ ఆ ఇంట్రెస్ట్ ను ఫస్ట్ హాఫ్ లో అలాగే మెయింటెన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ కథను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తో మాత్రమే ఆకట్టుకున్న దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మాత్రం తన టాలెంట్ చూపించాడు. మంచి స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ట్ ట్విస్టులతో ఆకట్టుకున్నాడు. అయితే నటీనటుల నుంచి తగిన నటన రాబట్టుకోవడం, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, డబ్బింగ్ పై ఫోకస్ పెట్టకపోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే బోరింగ్ సీన్స్, స్క్రీన్ ప్లే, లాజిక్స్ లేని సీన్స్ సినిమాకు మైనస్ గా నిలిచాయి. మిస్టరీ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడే ప్రేక్షకుల్ని వెంకటాపురం ఓ మోస్తరుగా మెప్పిస్తుంది.

రేటింగ్ : 2.5 /5