వజ్రకవచధర గోవిందా మూవీ రివ్యూ

Friday,June 14,2019 - 02:56 by Z_CLU

నటీనటులు: సప్తగిరి, వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్, తంబిదొరై తదితరులు
కథ: జి టి ఆర్ మహేంద్ర
సంగీతం: విజయ్ బుల్గానిన్
కెమెరా: ప్రవీణ్ వనమాలి
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు,
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: జూన్ 14, 2019

సప్తగిరి నుంచి మరో సినిమా వచ్చింది. కామెడీ వేషాలు తగ్గించి, హీరోగా మారిన ఈ నటుడు వజ్రకవచధర గోవింద అనే సినిమా చేశాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సప్తగిరిని ఓ మెట్టు పైకి ఎక్కించిందా? అతడ్ని కామెడీ జానర్ నుంచి హీరోల గ్రూప్ లోకి తీసుకెళ్లిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 

కథ

రాయలసీమలో ఓ చిన్న కుగ్రామంలో ఉంటాడు గోవింద్ (సప్తగిరి). ఆ గ్రామంలో అంతా కాన్సర్ తో చనిపోతుంటారు. వాళ్లను కాపాడుతానంటూ హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన సప్తగిరి స్నేహితురాలు అర్చన.. గెలిచిన తర్వాత అందర్నీ మోసం చేస్తుంది. అదే సమయంలో ఓ నిధిని వెదికిపెట్టే ప్రాజెక్టు గోవింద్ కు వస్తుంది. నిధిని వెతికితే 10కోట్లు వస్తాయని, దానితో గ్రామంలో అందరికీ వైద్యం చేయించొచ్చని భావిస్తాడు.

నిధి కోసం తన బృందంతో కలిసి బాబా వేషంలో పరశురామక్షేత్రానికి వెళ్తాడు. అయితే నిధి కంటే ముందు ఓ వజ్రాన్ని కనుక్కుంటాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న త్రిపురసుందరితో (వైభవీ జోషీ) ప్రేమలో పడతాడు. అదే ఊరిలో ఉన్న బంగార్రాజు (తంబైదొరై)తో శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. వజ్రం కోసం ఓవైపు బంగార్రాజు, మరోవైపు ఎమ్మెల్యే పోటీపడుతుంటారు. ఇంతకీ ఆ వజ్రం ఏమైంది? సప్తగిరి దాన్ని ఏం చేశాడు? తన ఊరిని, ప్రేయసిని కాపాడుకున్నాడా లేదా అనేది స్టోరీ.

నటీనటుల పనితీరు

సప్తగిరి మళ్లీ అదే పాత సమస్యతో ఇబ్బంది పడినట్టు కనిపించాడు. కామెడీగా కనిపించాలా లేక హీరోయిజం ప్రదర్శించాలా అనే డైలామా అణువణువునా కనిపించింది. ఒక సందర్భంలో మాస్ హీరోలా కనిపిస్తాడు, మరో సీన్ లో పక్కా కమెడియన్ లా అనిపిస్తాడు. ఇలా నిలకడలేని మేనరిజమ్స్ తో కన్ఫ్యూజ్ చేశాడు. కానీ అతడిలోని ఎనర్జీ మాత్రం అలానే ఉంది. తనవరకు గోవింద్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ వైభవీ జోషీ గ్లామరస్ గా ఉంది. కానీ ఆమెకు సరైన క్యారెక్టర్ పడలేదు.

నటీనటుల్లో అర్చన, టెంపర్ వంశీ, అప్పారావు ఫర్వాలేదనిపిస్తారు. విలన్ గా నటించిన తంబిదొరై పెర్ ఫెక్ట్ అనిపించుకున్నాడు. సెకండాఫ్ లో జబర్దస్త్ బ్యాచ్ మొత్తాన్ని పెట్టారు. కానీ ఫలితం దక్కలేదు.

 

టెక్నీషియన్స్ పనితీరు

ఉన్నంతలో ప్రవీణ్ వనమాలి కెమెరా పనితనం బాగుంది. మహేంద్ర అందించిన కథకు సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు దర్శకుడు అరుణ్ పవార్. దర్శకత్వంలో కూడా పవర్ కు పాస్ మార్కులు మాత్రమే పడతాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం పనిచేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంతమాత్రం.


జీ సినిమాలు రివ్యూ

“హీరో అవ్వడానికే ఇండస్ట్రీకొచ్చాను. కమెడియన్ గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను.” రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తగిరి చెప్పిన మాటలివి. వజ్రకవచధర గోవింద సినిమా చూస్తే ఆ మాటల్లో అసలు మేటర్ అర్థమౌతుంది. సప్తగిరి నుంచి ఆడియన్స్ ఆశించే కామెడీ ఇందులో కనిపించదు. అప్పటి పంచ్ లు వినిపించవు. కేవలం సప్తగిరిని ఓ మాస్ హీరోగా చూడాలనే మైండ్ సెట్ తో వెళ్లిన వాళ్లకు మాత్రమే గోవిందుడు నచ్చుతాడు.

సినిమాలో అదిరిపోయే కామెడీ ఉంటుందని రిలీజ్ కు ముందు డైరక్టర్ చెప్పిన మాటలు విని థియేటర్ కు వెళ్తే బుక్ అవ్వడం ఖాయం. బూతు కామెడీకి తోడు సెకెండాఫ్ ను కిచిడీ చేసి పడేశారు. ఓవైపు సప్తగిరి తనలోని హీరోను ప్రదర్శిస్తుంటే.. మరోవైపు జబర్దస్త్ బ్యాచ్ అంతా మన సహనానికి పరీక్ష పెడుతుంది. ఏదో జరుగుతుందని మనం ఆశిస్తాం, అక్కడ ఇంకేదో చూపించి మనకు షాక్ ఇవ్వాలనుకొని, మేకర్స్ బుక్ అయ్యారు.

ఫస్టాఫ్ పూర్తయ్యేసరికి ఇదొక ట్రెజర్ హంట్ సినిమా అనిపిస్తుంది. కాస్త థ్రిల్ ఇస్తూ, కామెడీ పండిస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కట్ చేస్తే, సెకండాఫ్ కు వచ్చేసరికి నిధి గురించి ఎవరూ మాట్లాడరు. వాళ్లకు దొరికిన చిన్న వజ్రం చుట్టూ కథ తిరుగుతుంది. అంతేకాదు, ఆ వజ్రంతోనే కథ ముగుస్తుంది కూడా. ఈమాత్రం దానికి హీరోను బంగారు రేఖ ఉన్న జాతకుడిగా, దైవాంశసంభూతుడిగా బిల్డప్ ఇస్తూ చూపిస్తారు.

నిధి కోసం వెదుకుతూ కామెడీ పండించే కాన్సెప్ట్ తో గతంలో అల్లరినరేష్ ఓ సినిమా చేశాడు. దాన్నే యాజ్ ఇటీజ్ సప్తగిరి తీసినా సరిపోయేది. అలా చేస్తే కాపీ కొట్టినట్టవుతుందని ఇలా మార్చినట్టున్నారు. ఇది చూసిన తర్వాత కాపీ కొడితేనే బాగుండేదని అనిపిస్తుంది. సప్తగిరి ఎనర్జిటిక్ గా కనిపించాడు కానీ అతడి నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. హీరోగా ఉన్నప్పుడు సరిగ్గా సునీల్ కూడా ఇదే సమస్య ఫేస్ చేశాడు.

సప్తగిరి తన ఇమేజ్ ను పక్కనపెట్టి కంటెంట్ ఉన్న సినిమాలైనా చేయాలి, లేదంటే కంటెంట్ పక్కనపెట్టి పూర్తిస్థాయి కామెడీనైనా పండించాలి. రెండూ మిక్స్ చేస్తే అది వజ్రకవచధర గోవింద అవుతుంది.

రేటింగ్2/5