'గేమ్ ఓవర్' మూవీ రివ్యూ

Friday,June 14,2019 - 01:50 by Z_CLU

నటీ నటులు : తాప్సీ, వినోదిని,రమ్య ,సంచన నటరాజన్ ,అనీష్ కురివిల్ల, మాల పారవతి తదితరులు

సంగీతం : రోన్ ఏతాన్ యోహాన్

రచన : అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్

మాటలు : వెంకట్ కాచర్ల

సహ నిర్మాత : చక్రవర్తి రామచంద్ర

నిర్మాత : ఎస్.శశికాంత్

దర్శకత్వం : అశ్విన్ శరవణన్

నిడివి : 103 నిమిషాలు

విడుదల తేది : 14 జూన్ 2019

తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’తో మంచి సక్సెస్ సాదించిన తాప్సీ ‘గేమ్ ఓవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సైకలాజికల్ థ్రిల్లర్ తో ‘గేమ్ ఓవర్’ అంటూ థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ థ్రిల్ చేయగలిగిందా..? తన ఖాతాలో మరో హిట్టు వేసుకుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

స్వప్న (తాప్సీ ) వీడియో గేమ్ డిజైనర్‌. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తలుచుకుంటూ మానసికంగా ఇబ్బంది పడుతూ వీడియో గేమ్స్ కి అడిక్ట్ అవుతుంది. చీకటిని చూసి అనుక్షణం భయపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి గాయపడుతుంది. తన చేతిపై ఏడాది క్రితం వేయించుకున్న టాటూ వల్ల కూడా ఆమె బాధ పడుతుంటుంది. ఆ టాటూని చేతిపై నుండి తీసేవేసే క్రమంలో స్వప్నకి ఒక నిజం తెలుస్తుంది. దాంతో ఆ టాటూని తీసివేయాలనే ఆలోచనను విరమించుకుంటుంది.

ఒక వైపు కొందరు అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడుతుంటారు. అమృత(సంచన నటరాజన్) కూడా ఘోరంగా హత్య చేయబడుతుంది. ఇంతకీ ఈ హత్యలు చేస్తుందెవరు..? అసలు స్వప్నకి అమృతకి సంబంధం ఏమిటి..? స్వప్న చేతిపై ఉన్న టాటూ వెనకున్న నిజం ఏమిటి..? చివరికి స్వప్న దైర్యంతో వరుసగా హత్యలు చేస్తున్న కిరాతకులను ఎలా ఎదుర్కుని హత మార్చింది.. అనేది సినిమా కథాంశం.

 

నటీ నటుల పనితీరు :

లేడీ ఒరియంటెడ్ సినిమాలతో ఇప్పటికే తన టాలెంట్ ఏంటో రుజువు చేసుకున్న తాప్సీ మరోసారి స్వప్న క్యారెక్టర్ తో మెప్పించింది. ముఖ్యంగా సినిమాలో సగభాగం వీల్ చైర్ లో కూర్చొని బాగా నటించింది. ప్రతీ సన్నివేశంలో నటిగా తన ప్రతిభ చూపింది. స్వప్న ఇంట్లో మనిపనిమనిషి క్యారెక్టర్ లో వినోదిని నేచురల్ యాక్టింగ్ ఆకట్టుకుంది. సంచన నటరాజన్ కనిపించింది కాసేపే అయినప్పటికీ నటిగా మంచి మార్కులే అందుకుంది. అనీష్ కురివిల్ల , రమ్య సుబ్రమణియన్, మాల పారవతి వారి క్యారెక్టర్స్ తో పరవాలేదు అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నికల్ పరంగా సినిమాకు మంచి సపోర్ట్ దక్కింది. సినిమాకు సౌండింగ్ పెద్ద ఎస్సెట్. ప్రతీ సన్నివేశంలో సౌండింగ్ థ్రిల్ చేసింది. రోన్ ఏతాన్ యోహాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఎ.వసంత్ కెమెరా వర్క్ ఆకట్టుకుంది. సినిమాలో కొన్ని షాట్స్ , ఫ్రేమ్స్ అతని ప్రతిభని తెలియజేసేలా ఉన్నాయి. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బాగుంది. కాకపోతే మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. శివశంకర్ ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. సచిన్ సుధాకరన్, హరిహరన్ అందించిన సౌండింగ్ థ్రిల్ చేసేలా ఉంది. అశ్విన్ శరవణన్,కావ్య రాం కుమార్ రాసుకున్న కథ- కథనం ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఇంతవరకూ సిల్వర్ స్క్రీన్ పై చూడని ఓ డిఫరెంట్ పాయింట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసింది తాప్సీ. ఈ సినిమా కోసం ఓ కొత్త కథ రాసుకొని అంతే ఆసక్తిగా తెరకెక్కించి మెప్పించాడు అశ్విన్ శరవణన్. కావ్య, అశ్విన్ రాసుకున్న కథను తన టాలెంట్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది తాప్సీ. ఛాలెంజింగ్ క్యారెక్టర్ తో సినిమా అంతా తన భుజాలపై వేసుకొని నడిపించింది. తాప్సీ అసలెందుకు ఈ సినిమా ఎంచుకుందో సినిమా చూస్తే అర్థమవుతుంది. తను చెప్పినట్లు ఇంత వరకూ సిల్వర్ స్క్రీన్ పై తెలుగు ప్రేక్షకులు చూడని పాయింట్ తో తెరకెక్కిన సినిమా ఇది.

సినిమా ప్రారంభంలో ఒక అమ్మాయి హత్య చేయబడుతుంది. ఆ సన్నివేశం తర్వాత ప్రేక్షకుడు ఇకపై సినిమా అంతా హార్రర్ ఎలిమెంట్స్ తో నడుస్తుందని ఊహిస్తాడు. సరిగ్గా ఇక్కడే రచయితలుగా అశ్విన్ , కావ్య సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుడు ఊహించని విధంగా థ్రిల్లింగ్ సన్నివేశాలతో హార్రర్ జోలికి పెద్దగా వెళ్ళకుండా కమర్షియల్ ఎలెమెంట్స్ తగిలించకుండా కథను ఆసక్తికరంగా నడిపించాడు.

హార్రర్ , థ్రిల్లర్ సినిమాల్లో ఇంత వరకూ ప్రేక్షకులు చూడని పాయింట్ బాగానే డీల్ చేసాడు దర్శకుడు. కాకపోతే స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ లో పడేస్తుంది. ముఖ్యంగా రెండో భాగంలో ఏది కలా.. ఏది నిజం అనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. థియేటర్స్ బయటికొచ్చాక సినిమా కథాంశం ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోవడానికి సగటు ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. ఇక మొదటి భాగం మరీ నెమ్మదిగా సాగడం విసుగు తెప్పిస్తుంది. అవి పక్కన పెడితే రెండో భాగంలో థ్రిల్ చేసే సన్నివేశాలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుడిలో ఉత్కంట నెలకొంటుంది. థ్రిల్లర్ సినిమాను చివరి వరకూ అదే ఆసక్తితో నడిపించడం చాలా కష్టం. ఆ విషయంలో దర్శకుడిగా అశ్విన్ మరోసారి సక్సెస్ అయ్యాడు.

తాప్సీ నటన , కథ -కథనం , రెండో భాగంలో థ్రిల్ చేసే సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్స్… మొదటి భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, స్లో నెరేషన్ సినిమాకు మైనస్. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘గేమ్ ఓవర్’ బాగా నచ్చుతుంది.

రేటింగ్ : 2.75 /5