'సవ్యసాచి' మూవీ రివ్యూ

Friday,November 02,2018 - 02:24 by Z_CLU

నటీనటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, షకలక శంకర్, సత్య తదితరులు.

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి

కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : చందు మొండేటి

విడుదల : 2 నవంబర్ 2018

నిడివి : 150 నిమిషాలు

ఇటీవలే శైలజా రెడ్డి అల్లుడు గా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సవ్యసాచి’గా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో చైతూ హిట్టు కొట్టాడా..? చందూ మొండేటి, చైతు కాంబో ఈసారి ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసింది ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

విక్రమ్ ఆదిత్య (నాగ చైతన్య) వానిష్‌ ట్విన్‌ సిండ్రమ్‌ వల్ల రక్తం పంచుకొని ఒకే శరీరంతో పుట్టిన కవలలు.. కాకపోతే ఆదిత్య, విక్రం శరీరంలో ఎడమ వైపు ఉంటాడు. అంటే బ్రెయిన్ నుండి ఎడమ చేతి వరకూ విక్రం శరీరంలో ఆదిత్య ఇమిడి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో విక్రం కి తెలియకుండా ఎడమ చేతి ద్వారా రెస్పాండ్ అవుతుంటాడు ఆదిత్య. అది విక్రం కి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. పెరిగి పెద్దయ్యాక ఒక యాడ్ ఫిలిం డైరెక్టర్ గా మారతాడు విక్రం… ఈ క్రమంలో విక్రంకి కాలేజి రోజుల్లో తను ప్రేమించిన ప్రియురాలు చిత్ర(నిధి అగర్వాల్) ఆరేళ్ళ తర్వాత కనిపిస్తుంది. ఇక చిన్నతనంలో తల్లిని కోల్పోయిన విక్రం తన అక్క (భూమిక) కూతురు మహాలక్ష్మిలో తన తల్లిని చూసుకుంటూ బ్రతికేస్తుంటాడు. అలా సాఫీగా సాగిపోతున్న విక్రం జీవితంలోకి భయంకరమైన తుఫాన్ లా వస్తాడు అరుణ్(మాధవన్).

విక్రం కుటుంబాన్ని హత మార్చాలనుకుంటాడు అరుణ్. అరుణ్ ఎటాక్ నుండి విక్రం అక్క ప్రాణాలతో బయటపడుతుంది. అదే సమయంలో విక్రం ప్రాణంలా భావించే పాపా మహా చనిపోలేదని తెలుస్తుంది.. మహా ని కిడ్నాప్ చేసి విక్రం తో మైండ్ గేమ్ ప్లే చేస్తాడు అరుణ్. ఇంతకీ అరుణ్ ఎవరు..? విక్రం.. అరుణ్ కి మధ్య ఏం జరిగింది. రెండు చేతులతో అర్జునుడిలా పోరాడే సమర్థుడు విక్రం చివరికి అరుణ్ ని ఎలా అంతమొందించాడు.. ఇదే సవ్యసాచి కథ.

 

నటీ నటుల పనితీరు :

సినిమా సినిమాకు నటుడిగా పరిణితి చెందుతూ వస్తున్న నాగచైతన్య మరోసారి యాక్టింగ్ లో మెప్పించాడు… కొన్ని సందర్భాలలో చైతు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. గతంతో పోలిస్తే డాన్సులతో కూడా అలరించాడు. తనకి తెలియకుండా తన ఎడమ చేయి రెస్పాండ్ అయ్యే సీన్స్ లో మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైం తెలుగులో నటించిన మాధవన్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సైకో విలనిజంతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. నిధి గ్లామర్ షో కి , పాటలకే పరిమితం అయ్యింది. తన క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోవడంతో జస్ట్ పరవాలేదనిపించుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి క్యారెక్టర్స్ కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న భూమిక మరోసారి అలాంటి క్యారెక్టర్ లోనే కనిపించింది. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినప్పటికీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీతో అలరించాడు. సత్య, సుదర్శన్ తమ కామెడి టైమింగ్ తో కొన్ని సందర్భాల్లో నవ్వించారు. మిగతా నటీనటులు తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేసారు కీరవాణి.. ఇక ‘వై నాట్ ‘,’1980,81,82 ‘ సాంగ్స్ పరవాలేదనిపించగా సవ్యసాచి టైటిల్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. రామకృష్ణ సబ్బాని, మోనికా సబ్బాని ప్రొడక్షన్ డిజైనింగ్ సినిమాకు కలిసోచ్చింది. ముఖ్యంగా మాధవన్ మెజిస్టిక్ హౌజ్ సెట్, అప్పటి వస్తువులను గుర్తుచేస్తూ వచ్చే సాంగ్ లో ఆర్ట్ వర్క్ బాగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. చందూ మొండేటి  కథ బాగున్నప్పటికీ కథనం కుదరలేదు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష:

కాస్త కొత్తగా, విచిత్రంగా అనిపించే కాన్సెప్టులు తీసుకొని కథలు రాసుకోవడం చందు మొండేటి స్టయిల్. కార్తికేయలో అదే చూపించాడు. సవ్యసాచికి కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాడు. కానీ ఈ సినిమాకు వచ్చేసరికి కథను విడిచి కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టాడు. అక్కడే ‘సవ్యసాచి’ రిజల్ట్ మారిపోయింది.

కథను నమ్ముకొని, స్క్రీన్ ప్లే కు కట్టుబడి ఉన్నది ఉన్నట్టు తీస్తే ఇది మరో ‘కార్తికేయ’ అయ్యేది. చైతూ కెరీర్ లో  హిట్ మూవీగా నిలిచేది. కానీ ఈసారి కథతో పాటు అక్కినేని అభిమానులపై కూడా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. చిక్కంతా అక్కడే వచ్చింది. లగ్గాయితు పాట పెట్టాల్సిన అవసరం ఏముంది? సుభద్ర ఎపిసోడ్ ఎందుకు? ఈ కథకు నాగార్జున, ఏఎన్నార్ రిఫరెన్సులు అవసరమా? అసలు సవ్యసాచికి, అమెరికా ఎపిసోడ్ కు ఏమైనా సంబంధం ఉందా..?

ఇలా చెప్పుకుంటూ పోతే ‘సవ్యసాచి’కి సంబంధం లేని ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి, మైండ్ లో అనుకున్న కథకు, ప్రేమమ్ టైమ్ లోనే చందు మొండేటి అనుకున్న స్క్రీన్ ప్లే జోడించి ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అయ్యేది.  అనవసర విషయాల జోలికి వెళ్లడంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా మాత్రమే నిలిచిపోతుంది. కార్తికేయలో స్క్రీన్ ప్లే చందు మొండేటిని స్పెషల్ గా నిలిపింది. ఆ మేజిక్ సవ్యసాచిలో మిస్ అయింది.

సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాకి వానిష్‌ ట్విన్‌ సిండ్రమ్‌ అనే ఎలిమెంట్ ని యాడ్ చేసిన చందూ, మిగతా కథను ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు. తొలి 10 నిమిషాలు కాస్త ఆసక్తిగా అనిపించినా ఆ తర్వాత లవ్ ట్రాక్ , కొన్ని సీన్స్ తో బోర్ కొట్టించాడు. అన్ని సందర్భాల్లో అలర్ట్ గా ఉండే ఎడమ చేయి ఎలిమెంట్ ని కేవలం కొన్ని సీన్స్ కే వాడుకోవడం సినిమాకు పెద్ద మైనస్.. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంత కన్విన్సింగ్ గా లేదు. ముఖ్యంగా మాధవన్ క్యారెక్టర్ గతంలో చూసిన కొన్ని విలన్ క్యారెక్టర్స్ ను గుర్తుకు తెచ్చింది తప్ప, ప్రత్యేకం అనిపించలేదు.

మైనస్సులు పక్కనపెడితే, అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా ఇది. నాగచైతన్యను క్లాస్, మాస్ యాంగిల్స్ లో ఒకేసారి చూపించిన మూవీ ఇది. మధ్యమధ్యలో ఏఎన్నార్, నాగ్ రిఫరెన్సులు అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. దీనికి తోడు రీమిక్స్ ఉండనే ఉంది. హీరోయిన్ చూడ్డానికి చాలా బాగుంది. తనకున్న అనుభవంతో నాగచైతన్య మాస్ యాక్షన్ బాగానే చేశాడు. సో.. అభిమానుల్ని పక్కనపెడితే, ప్రేక్షకులను ఓ మోస్తరుగా మాత్రమే ఎట్రాక్ట్ చేస్తుంది సవ్యసాచి.

బాటమ్ లైన్ – అభిమానుల ‘సవ్యసాచి’

రేటింగ్2.5/5