సర్కార్ మూవీ రివ్యూ

Tuesday,November 06,2018 - 02:16 by Z_CLU

నటీనటులు : విజయ్ , కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, యోగి బాబు తదితరులు

సంగీతం : ఎ.ఆర్. రెహ్మాన్

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్

నిర్మాత : అశోక్‌ వల్లభనేని

రచన -దర్శకత్వం : మురుగదాస్

నిడివి : 163 నిమిషాలు

విడుదల తేది : 6 నవంబర్ 2018

 

దళపతి విజయ్ – మురుగదాస్ కాంబినేషన్ లో భారీ క్రేజ్ తో తెరకెక్కిన ‘సర్కార్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…? ఈ సినిమాతో విజయ్ , మురుగదాస్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

 

కథ :

అమెరికా వెళ్లి పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడిన సుందర్ రామస్వామి (విజయ్)… ఎన్నికల సమయంలో తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియాకి వస్తాడు. ఇక  సుందర్  ఇండియా రావడానికి ఏదో పెద్ద కారణం ఉందనుకొని ఊహించిన వారు ఓటు వేయడం కోసం వచ్చాడని తెలుసుకొని షాక్ అవుతారు. తన చిన్నతనంలోనే ఓటు విలువ తెలుసుకున్న సుందర్ ఎక్కడున్నా ఎన్నికల సమయానికి కచ్చితంగా తన స్వస్థలం చేరుకొని ప్రతీ ఎన్నికల్లో ఓటు వేస్తుంటాడు. అలా ఓటు వేసేందుకు వచ్చిన సుందర్ రామ స్వామికి తన ఓటుని వేరే వ్యక్తి ద్వారా దొంగ ఓటు వేయబడిందని తెలుస్తుంది. ఈ క్రమంలో తన ఓటు దొంగ వోటు వేయబడిందని కోర్టులో కేసు వేసి ఎన్నికల కౌంటింగ్ పై స్టే కోరి మరీ తను  ఓటు వేసే అవకాశం పొందుతాడు.

తమ  ఓటు దుర్వినియోగం అయితే మళ్ళీ ఓటు వేసే అధికారం పొందొచ్చని సుందర్‌ ద్వారా తెలిసుకున్న దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు తమ ఓటు దొంగ ఓటు వేయబడిందని అదే తరహాలో కోర్టులో కేసులు వేస్తారు. ప్రజలు వేసిన కేసుల వల్ల ఎన్నికలను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి పుణ్యమూర్తి(కరుప్పయ్య) అతని సర్కార్ చేసే అక్రమాలను తెలుసుకొని రాజకీయాల్లో మార్పు రావాలన్న ఉద్దేశ్యంతో స్వతహాగా ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించకుంటాడు సుందర్. అదే సమయంలో తమ పార్టీని తన తండ్రిని సపోర్ట్ చేస్తూ కోమలవల్లి(వరలక్ష్మి)రంగంలోకి దిగుతుంది. కార్పోరేట్ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ అధికార రాజకీయనాయకులతో ఎలా పోరాడాడు? ఈ క్రమంలో సుందర్ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. చివరికి ప్రజల సహాయంతో పుణ్యమూర్తి సర్కార్ ని ఎలా దించాడు.. అనేది సర్కార్ కథ.

 

నటీనటుల పనితీరు :

తమిల్ లో భారీ ఇమేజ్ తో దూసుకెళ్తున్న విజయ్ మరోసారి మేజిక్ చేసాడు. ముఖ్యంగా కోర్టు సీన్స్, హాస్పిటల్ సీన్ , క్లైమాక్స్ ఎపిసోడ్ లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. పెద్దగా స్కోప్ లేని క్యారెక్టర్ కావడంతో కీర్తీ సురేష్ పరవాలేదనిపించుకుంది. వరలక్ష్మి తన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు ప్లస్ అయ్యింది. రాధారవి తన నటనతో అలరించాడు. ముఖ్యమంత్రి పాత్రలో కరుప్పయ్య  పరవాలేదనిపించుకున్నాడు. యోగిబాబు కామెడీ పండలేదు. ఇక మిగతా నటీనటులంతా వారి క్యారెక్టర్స్ తో ఫరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

రెహ్మాన్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్.. సాంగ్స్ పరవాలేదనిపించినా తనదైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు రెహ్మాన్. ‘ఉలికితే ఉద్యమం’, ‘OMG పిల్ల’ పాటలు అలరించాయి. ఈ పాటలకు వనమాలి, చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ లో అతని పనితనం కనిపించింది. ఎడిటింగ్ పరవాలేదు. సెకండ్ హాఫ్ లో కాస్త ట్రిమ్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. రామ్ లక్షణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మురుగదాస్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లేలో లోపాలున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

తన ప్రతి సినిమాకు ఏదో ఒక కీ పాయింట్ ఎంచుకొని దాని చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లే రాసుకొనే మురుగదాస్ ఈసారి కూడా అలాంటి మంచి పాయింట్ నే ఎంచుకున్నాడు. కాకపోతే అనుకున్న కథని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. దొంగ ఓటు అనే పాయింట్ అందరినీ ఎట్రాక్ట్ చేసినప్పటికీ దాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు మురుగదాస్..

ముఖ్యంగా తొలి 10 నిమిషాల పాటు ప్రేక్షకుడిలో ఉత్కంఠ కలిగించిన దర్శకుడు చివరివరకూ ఆ ఆసక్తిని రేకెత్తించడంలో విఫలం అయ్యాడు. నిజానికి పొలిటికల్ డ్రామాలో ఊహించని ఎత్తుగడలతో కూడిన సన్నివేశాలు పడాలి.. అప్పుడే ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతాడు. అయితే సర్కార్ లో అలాంటి సన్నివేశాలు ఆశించిన రేంజ్ లో లేవు. అదే సినిమాకు మైనస్. విజయ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్, పొలిటికల్ సీన్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త బోర్ కొట్టించాడు. సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొంత సేపటికే ప్రేక్షకుడికి గతంలో వచ్చిన పొలిటికల్ డ్రామా సినిమాలు గుర్తొస్తాయి. సెకండ్ హాఫ్ డ్రాగ్ అనిపిస్తూ నడిచిన సినిమా ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలతో మళ్ళీ వేగం పుంజుకుంటుంది. ఇక తన ప్రతీ సినిమాకు బలమైన సన్నివేశాలు రాసుకునే మురుగదాస్ ‘సర్కార్ ‘ స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త శ్రద్ధ పెడితే రిజల్ట్ బెటర్ గా ఉండేది.

ఎప్పటిలాగే క్లైమాక్స్ లో తను చెప్పాలనుకున్న పాయింట్ ను క్లారిటీ గా చెప్తూ కార్పోరేట్ సిస్టంలా పనిచేసే యువకులు, సమాజంపై సేవాభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పాడు. కథ , విజయ్ క్యారెక్టర్, ఫైట్స్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు, హీరోయిజం ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్, రెహ్మాన్ నేపథ్య సంగీతం, సినిమాకు ప్లస్ పాయింట్స్… కొన్ని సందర్భాల్లో వచ్చే లాజిక్ లేని సీన్స్, స్క్రీన్ ప్లేలో లోపాలు, లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ సినిమాకు మైనస్.

ఓవరాల్ గా విజయ్ – మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సర్కార్’ జస్ట్ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్ : 2 / 5