'వీర భోగ వసంత రాయులు' మూవీ రివ్యూ

Friday,October 26,2018 - 03:43 by Z_CLU

నటీనటులు: నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు,శ్రీయ సరన్, మనోజ్ నందన్ తదితరులు

సంగీతం: మార్క్ కే రాబిన్

నిర్మాత‌: అప్పారావ్ బెల్లానా

రచన – ద‌ర్శ‌కుత్వం: ఇంద్ర‌సేన ఆర్

నిడివి : 132 నిమిషాలు

విడుదల తేది : 26 అక్టోబర్  2018

 

నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి ఇదివరకూ కొన్ని సినిమాలు చేశారు.. కాస్త భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేశారు.. వీరిద్దరితో పాటు ఈసారి సుధీర్ బాబు కూడా కలిశాడు. మరి ఈ ముగ్గురు ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకున్నారు…. ఈ మల్టీస్టారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంత వరకూ ఎంటర్ టైన్ చేసింది…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

కథ :

ఓ చిన్న కుర్రాడు(చరిత్ మానస్) తన ఇల్లు కనపడట్లేదంటూ పోలీస్ స్టేషన్ లో అడుగుపెడతాడు.. ఇల్లుతో పాటు తన తల్లితండ్రులు కూడా కనిపించట్లేదని పోలీసులకు తెలియజేస్తాడు. ఈ ఆసక్తికరమైన కేసును టేకప్ చేస్తాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్(సుధీర్ బాబు). అలాగే 300 ప్రముఖులు ఉన్న ఫ్లైట్ హైజాక్ అవుతుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రంగంలోకి దిగుతాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ రెడ్డి(నారా రోహిత్). ఈ కేసులో భాగంగా దీపక్ రెడ్డికి నీలిమ(శ్రియ శరన్) అనే మరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పరిచయం అవుతుంది.

మరోవైపు సిటీలో స్కూల్ వయసులో ఉన్న అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. అయితే ఈ మూడు సంఘటనల వెనుక ఉన్నది వీరభోగవసంతరాయలు (శ్రీవిష్ణు) అని తెలుస్తుంది. అతని అదుపులో ఉన్న 300 బందీలు విడిచిపెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఒక టాస్క్ ఇస్తాడు వసంతరాయులు. మరోవైపు అనుమానాస్పద హత్యలు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అసలింతకీ వీర భోగ వసంత రాయులు ఎవరు.. అతని కథేంటి..? అన్ని సంఘటనలకి అతనే కారణమా… చివరికి ఇన్వెస్టిగేషన్ టీం అతన్ని పట్టుకోగాలిగిందా… అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నారా రోహిత్ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించాడు. న్యూ మేకోవర్, పెర్ఫార్మెన్స్ తో శ్రీ విష్ణు బెస్ట్ ఇచ్చాడు. సుధీర్ బాబు ఉన్నంతలో పరవాలేదనిపించుకున్నాడు. సుదీర్ కి డబ్బింగ్ కుదరలేదు. శ్రియ జస్ట్ ఓకే. సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ పరవాలేదనిపించుకున్నాడు. మనోజ్ నందం, రవి ప్రకాష్, శశాంక్ తమ క్యారెక్టర్స్ కి  న్యాయం చేశారు.

 

సాంకేతికవర్గం పనితీరు :

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా కీలకం.. మార్క్ కే రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఎస్ వెంక‌ట్, న‌వీన్ యాద‌వ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా మెన్స్ ప్రతిభ కనిపిస్తుంది. శ‌శాంక‌ర్ మాలి ఎడిటింగ్ పరవాలేదు. ఇంకా కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఇంద్ర‌సేన కథ-కథనం ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తున్న నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి ‘వీరభోగ వసంత రాయులు’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారనగానే… వీరి నుండి మరో డిఫరెంట్ సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్..

సినిమా విషయానికొస్తే స్క్రిప్ట్ రాసుకునే టైంలో దర్శకుడు ఇంద్రసేనకు ఇది కాస్త ఎగ్జైటింగ్ కథ అనిపించొచ్చు కానీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం రొటీన్ అనిపించింది. నిజానికి ఈ కథకి టాలెంటెడ్ స్టార్ కాస్టింగ్ ను ఎంచుకున్న దర్శకుడు వారితో ఈ కథను రక్తి కట్టించేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.

సినిమా ప్రారంభంలో ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగించిన దర్శకుడు కాసేపటికే అర్థం పర్థం లేని సీన్స్ తో విసుగు తెప్పించాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే సినిమాకు అతిపెద్ద మైనస్. సుధీర్ బాబు, శ్రియ డబ్బింగ్ వాయిస్ లు వింటుంటే ప్రేక్షకులకు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు మైనస్.

కొన్ని సందర్భాల్లో ఈ సినిమాతో దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడు అనే ప్రశ్న ప్రేక్షుకుడిలో మొదలవుతుంది. నిజానికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అప్పుడే ప్రేక్షుకుడు థ్రిల్ అవుతాడు. తను చెప్పాలనుకున్న కథను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు ఇంద్రసేన.

బాలికలపై అత్యాచారాలు, కిడ్నాపులను ఇతి వృత్తంగా తీసుకొని ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు చాలా చోట్ల తడబడ్డాడు. కథ రొటీన్ అనిపించడం, స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేకపోవడంతో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కూడా ఏం చేయలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు మరీ బోర్ కొట్టించినా క్లైమాక్స్ సీన్స్ పరవాలేదనిపిస్తాయి.

ఫైనల్ గా నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు లను చూసి థియేటర్స్ కి వెళ్ళే ప్రేక్షకులను ‘వీర భోగ వసంత రాయులు’ డిసప్పాయింట్ చేస్తుంది.

రేటింగ్ : 1.5 / 5