రూలర్ మూవీ రివ్యూ

Friday,December 20,2019 - 01:40 by Z_CLU

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
బ్యానర్: సీకే ఎంటర్ టైన్ మెంట్స్
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు-అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్
రన్ టైమ్: 150 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: డిసెంబర్ 20, 2019

అటుఇటుగా రెండేళ్ల కిందట జైసింహా వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ లో ఇప్పుడు రూలర్ వస్తోంది. మరి ఈసారి బాలయ్య-కేఎస్ రవికుమార్ కలిసి ఏం చేశారు? రూలర్, బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
ఏషియన్ అనే సాఫ్ట్ వేర్ సంస్థకు అధినేత అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ). కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే కాకుండా, ఎన్నో వ్యాపారాల్లో తిరుగులేని సంస్థగా తన కంపెనీని మలుస్తాడు అర్జున్ ప్రసాద్. ఇందులో భాగంగా చాలా ఏళ్లుగా తొక్కిపెట్టిన ఓ ఫైల్ పై అర్జున్ ప్రసాద్ దృష్టి పడుతుంది. ఉత్తర ప్రదేశ్ లో పవర్ ప్లాంట్ కు సంబంధించిన ఫైల్ అది. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్టును అర్జున్ ప్రసాద్ తల్లి (జయసుధ) ఆపేస్తుంది. దీంతో అర్జున్ ప్రసాద్ ఆ ప్రాజెక్టును టేకప్ చేయాలని
నిర్ణయిస్తాడు.

ఉత్తరప్రదేశ్ లో ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లిన అర్జున్ ప్రసాద్, అక్కడ లోకల్ రౌడీ, ఎంపీ భవానీనాథ్ ఠాగూర్ తో తలపడతాడు. అదే టైమ్ లో ఆ ఊరి ప్రజలంతా అర్జున్ ప్రసాద్ ను ధర్మ
అంటూ పిలుస్తుంటారు. తమకు తెలిసిన వ్యక్తిగానే చూస్తారు.

ఇంతకీ ధర్మ ఎవరు? అర్జున్ ప్రసాద్ కు ధర్మకు సంబంధం ఏంటి? భవానీనాథ్ చెర నుంచి ఆ ఊరి ప్రజల్ని అర్జున్ ప్రసాద్ కాపాడాడా లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు
బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది నటసింహం గురించే. చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు వింటేజ్ బాలయ్యను చూస్తారు. అప్పుడెప్పుడో వచ్చిన నరసింహనాయుడులోని ఉత్సాహం, సింహాలోని రౌద్రం కలిపి ఈ సినిమాలో చూపించాడు బాలయ్య. దీనికితోడు మేకోవర్ ఒకటి. ఫస్టాఫ్ మొత్తానికి బాలయ్య టోనీస్టార్క్ గెటప్పే హైలెట్. దీనికోసం ఈ వయసులో అతడు బరువు తగ్గడం, మాస్ స్టెప్స్ వేయడం గొప్ప విశేషం. ఇక పడతాడు సాంగ్ అయితే నందమూరి అభిమానులకు పండగే.

హీరోయిన్లంతా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం సోనాల్ చౌహాన్ దే. అందంతో ఆమె బాగానే ఎట్రాక్ట్ చేసింది. సెకెండాఫ్ నుంచి వేదిక, భూమిక తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

నాగినీడు, ఝాన్సీ, జయసుధ, ప్రకాష్ రాజ్, సయాజీ షిండే తన పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
సినిమాలో మెయిన్ టెక్నీషియన్ కేఎస్ రవికుమార్ గురించే చెప్పుకోవాలి. కమర్షియల్ ఫార్ములా చెడకుండా, బాలయ్య ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా, మంచి క్వాలిటీతో, తక్కువ టైమ్ లో రూలర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కాకపోతే తీసిన సన్నివేశాల్లో కొత్తదనం కనిపించ లేదు. కేఎస్ రవికుమార్ టేకింగ్ పదేళ్ల కిందటే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పరుచూరి మురళి రాసిన కథ వల్ల ఇలా జరిగిందా లేక కేఎస్ రవికుమార్ టేకింగ్ ఇలా ఉందా అనేది చెప్పలేం.

ఇక మ్యూజిక్ డైరక్టర్ చిరంతన్ భట్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. సెకండాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు. ఇక పడతాడు సాంగ్ అయితే ఫ్యాన్స్ కు పండగే. ఫుల్ జోష్ తో సాగుతుంది ఆ పాట. యేల..యేల సాంగ్ కూడా బాగుంది. సినిమా మేజర్ ఎట్రాక్షన్స్ లో ఈ రెండు పాటలకు కూడా స్థానం ఉంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎప్పట్లానే కలర్ ఫుల్ గా సాగగా.. ఇంటర్వెల్ లో వచ్చిన అన్బు-అరివు కంపోజ్ చేసిన ఫైట్ లో కొత్తదనం మిస్ అయిందిసెకండాఫ్ లో రామ్-లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి. సి.కల్యాణ్ మరోసారి రాజీ పడకుండా ఖర్చు చేశాడు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విభాగాలు మాత్రం బాగాలేవు.

జీ సినిమాలు సమీక్ష
బాలకృష్ణ సినిమాలు ఎలా ఉంటాయనే విషయంపై ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. నటసింహాన్ని అతడి అభిమానులు ఆ చట్రంలోనే ఊహించుకుంటారు, బాలయ్య కూడా ఆ లైన్ దాటి పక్కకురాలేడు. రూలర్ కూడా బాలయ్య కోసం తయారైన కథ, అతడి అభిమానుల కోసం వచ్చిన సినిమా. బాలయ్య కూడా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా రూలర్.

నిజానికి తన గత సినిమాల్లో బాలయ్య ఇలాంటి పాత్రలు చాలానే చేశాడు. ఫస్టాఫ్ లో ఒక షేడ్, సెకెండాఫ్ లో మరో షేడ్ లోకి ట్రాన్స్ ఫార్మ్ అయి విలన్లను చితక్కొట్టే టైపు పాత్రలు బాలయ్యకు కొట్టిన పిండి. అంతెందుకు.. అతడి కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాల్లో కూడా దాదాపు ఇదే తరహా ట్విస్టులు కనిపిస్తాయి. అప్పటి ఆ సినిమాలకు, ఇప్పటి రూలర్ కు గెటప్స్ లో తేడా తప్ప, మెయిన్ స్టోరీ-ట్విస్టుల్లో పెద్దగా తేడాలు కనిపించవు. కానీ నందమూరి అభిమానులకు అదే ఇష్టం, కాబట్టి దర్శకులు అలాంటి స్టోరీలే తెస్తారు, బాలయ్య అలాంటి స్టోరీలే చేస్తాడు. అదంతే..

ఇక సినిమా విషయానికొస్తే..60కి దగ్గరపడిన బాలయ్య ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. మేకవర్ కోసం ఈ వయసులో బరువు తగ్గాడు, అభిమానుల కోసం కష్టపడి స్టెప్పులేశాడు. సినిమా మొత్తం బాలయ్య డెడికేషన్ కనిపిస్తుంది. అయితే టోనీస్టార్క్ గెటప్ పై పెట్టిన ఫోకస్ లో సగమైనా ధర్మ పాత్రపై పెడితే బాగుండేది. సెకెండాఫ్ నుంచి బాలయ్యను, అభిమానులు తప్ప సామాన్య ప్రేక్షకులు చూడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ గెటప్ అతడికి సూట్ అవ్వలేదు.

తన గెటప్ ను మరిపించడం కోసం బాలయ్య చాలా ప్రయత్నం చేశారు. కానీ పాటల్లో, ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆ గెటప్ అడ్డమైంది. అసలే రొటీన్ ఫ్లాష్ బ్యాక్, దానికి తోడు ఈ గెటప్ కూడా యాడ్ అవ్వడం సెకెండాఫ్ ను తగ్గించాయి. దీనికి తోడు సాగదీత సన్నివేశాలు ఫ్లోను పూర్తిగా ఆపేశాయి. మరీ ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ కు ముందు దాదాపు 15-20 నిమిషాల పాటు బాలయ్య కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అంతా ఊహించినట్టే శత్రుసంహారం జరిగిపోతుంది. శుభం కార్డు పడిపోతుంది.

సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే.. కేఎస్ రవికుమార్, బాలయ్య కలిసి ఏ ట్విస్టులైతే వర్కవుట్ అవుతాయని భావించారో, అవన్నీ పాత మలుపులే. ఏ ఫైట్స్ అయితే కొత్తగా ఉంటాయని అనుకున్నారో అవన్నీ చూసేసిన ఫైట్సే. ఇక ఏ గెటప్ అయితే బాగుంటుందనుకున్నారో (పోలీస్ గెటప్) అదే ఫ్లాప్ అయింది.

ప్లస్ పాయింట్స్
– బాలయ్య సాఫ్ట్ వేర్ లుక్
– 2 పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్

మైనస్ పాయింట్స్
– రొటీన్ స్టోరీ
– సెకెండాఫ్ సాగదీత
– స్క్రీన్ ప్లే, డైరక్షన్

ఓవరాల్ గా బాలయ్య ఎనర్జీ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. సినిమాలో మాత్రం ఎలాంటి కొత్తదనం కనిపించదు. బాలయ్య మాస్ ఫ్యాన్స్ కు సినిమా ఎక్కే ఛాన్స్ ఉంది.

రేటింగ్2.5/5