'వెంకీ మామ' మూవీ రివ్యూ

Friday,December 13,2019 - 02:30 by Z_CLU

నటీ నటులు : వెంకటేష్ , నాగ చైతన్య , రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్, ప్రకాష్ రాజ్, నాజర్  తదితరులు

సంగీతం : థమన్

ఛాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ 

నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

నిర్మాతలు : సురేష్ బాబు , విశ్వ ప్రసాద్

మూల కథ : జనార్ధన మహర్షి

రచన-దర్శకత్వం : రవీంద్ర బాబీ

విడుదల తేది : 13 డిసెంబర్ 2019

సెన్సార్ : U/A

నిడివి : 149 నిమిషాలు

కొన్ని మల్టీ స్టారర్ కాంబినేషన్ సినిమాల మీద ఆటోమేటిక్ గా అంచనాలు నెలకొంటాయి.  అయితే అలాంటి అంచనాలతోనే రియల్ లైఫ్ మామ అల్లుడు ‘వెంకీ మామ’ తో స్క్రీన్ మీదకి వచ్చారు. మరి ‘వెంకీ మామ’తో మామ అల్లుడు మెస్మరైజ్ చేసారా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోపోయిన కార్తీక్ (నాగ చైతన్య) ను తన తండ్రి మాట లెక్క చేయకుండా దగ్గరకి తీసుకుంటాడు మేనమామ వెంకట రత్నం(వెంకటేష్). స్కూల్ డేస్ నుండే కార్తీక్ ను గారాబం చేస్తూ అన్నీ తానై అమ్మ నాన్న లోటు తెలియకుండా పెంచుతాడు. అయితే పై చదువుల కోసం సిటీ కెళ్ళిన కార్తీక్ హారిక(రాశి ఖన్నా)తో ప్రేమలో పడతాడు. హారిక కూడా కార్తీక్ ను ప్రేమిస్తుంది. కొన్ని రోజులకే తన మావయ్య కోసం హారికను దూరం పెట్టి తన సొంత ఊరికి చేరుకుంటాడు కార్తీక్.

ఈ విషయం తెలుసుకున్న వెంకతరత్నం కార్తిక్ -హారికలను మళ్ళీ ఒకటి చేసి పెళ్లి చేయాలని చూస్తాడు. అలాగే తన కోసం పెళ్ళికి దూరంగా ఉన్న మామ కి ఎలాగైనా ఓ అత్తయ్య ను చూసి పెళ్లి చేయాలన్న ఉద్దేశ్యంతో ఊరికి టీచర్ గా వచ్చిన మీరా(పాయల్ రాజ్ పుత్)ను వెంకీ కి జత చేసి పెళ్లి చేయాలని చూస్తుంటాడు కార్తీక్. మరో పక్క తన రాజకీయ జీవితం కోసం ఎం.ఎల్.ఏ(రావు రమేష్) మామ అల్లుడిని విడదీయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఓ ఇన్సిడెంట్ వల్ల మామకి దూరంగా వెళ్లి ఆర్మీలో జాయిన్ అవుతాడు కార్తీక్. మూడేళ్ళ తర్వాత కార్తీక్ జాడ తెలుసుకొన్న వెంకటరత్నం అలియాస్ మిలటరీ నాయుడు కాశ్మీర్ కి వెళ్లి కార్తీక్ ను కలిసే ప్రయత్నం చేస్తాడు. అసలింతకీ ప్రాణం కంటే ఎక్కువగా భావించే మేనమామను వదిలి కార్తీక్ ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు..? చివరికి వెంకటరత్నం కార్తీక్ ను కలుసుకున్నాడా లేదా అనేది ‘వెంకీ మామ’ మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

వెంకటరత్నం పాత్రతో వెంకటేష్ ఎప్పటిలాగే మెస్మరైజ్ చేసాడు. తన కామెడీ టైమింగ్ , ఎనర్జీ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. నాగ చైతన్య కూడా తన రోల్ తో మెప్పించాడు. కాకపోతే మావయ్య పాత్ర ముందు చైతూ పాత్ర తేలిపోయింది. డాన్సులు , ఫైట్స్ తో ఇద్దరూ ఎట్రాక్ట్ చేసారు. రాశి ఖన్నా , పాయల్ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు. పాయల్ హాట్ అందాలతో కాకుండా హోమ్లీ లుక్ లో కనిపిస్తూ నటనతో ఆకట్టుకుంది. ఇంటి పెద్దగా కొడుకు- మనవడి జీవితం కోసం ఆలోచిస్తూ దిగులు చెందే పాత్రలో నాజర్ మెప్పించాడు. ప్రకాష్ రాజ్ కనిపించింది కాసేపే అయినా మేజర్ జయదేవ్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.

చమ్మక్ చంద్ర , హైపర్ ఆది ఊహించనంత కాకపోయినా డైలాగ్ కామెడీతో మోస్తరుగా నవ్వించారు. ఓ సన్నివేశంలో విద్యులేక రామన్ తన కామెడీతో ఎంటర్టైన్ చేసింది. అలాగే చైతూ -ఆది లను బంధించే సన్నివేశంలో శివన్నారాయణ కామెడీ పేలింది. రోలర్ రఘు కామెడీ ట్రాక్ రొటీన్ అనిపించి పెద్దగా నవ్వించలేకపోయింది. ఎం.ఎల్.ఏ పాత్రలో రావు రమేష్ నటన రొటీన్ అనిపించింది. ఇక అతని పక్కనే ఉండే రౌడీ పాత్రలో దాసరి అరుణ్ పరవాలేదనిపించుకున్నాడు. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

రిలీజ్ కి ముందే పాటలతో కొంత హైప్ తీసుకొచ్చిన తమన్ సినిమాకు రెండు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించి ప్లస్ అయ్యాడు. ‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్, ‘ఎన్నాళ్ళకో’ , ‘కోకో కోలా పెప్సీ’ సాంగ్ విజువల్ గా కూడా ఆకట్టుకున్నాయి. రామజోగయ్య శాస్త్రీ, కాసర్ల శ్యాం సాహిత్యం ఆకట్టుకున్నాయి. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను, మామ అల్లుడ్ని స్క్రీన్ పై బాగా చూపించాడు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే బాగుండేది. జాతరలో వచ్చే ఫైట్ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఆర్ట్ వర్క్ బాగుంది.

జనార్ధన మహర్షి అందించిన మూల కథతో పాటు కథనంలో కూడా కొత్తదనం లేదు. ఇక బాబీ డైరెక్షన్ లో కొన్ని లోపాలున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కాంబినేషన్లపై ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కథ -కథనం రాసుకోవాలి. వారి నుండి ఎలాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారనే దానితో పాటు సినిమాతో ఎలా ఎంగేజ్ చేయాలనేది తెలుసుకోవాలి. మామ అల్లుడి మీద ఎమోషన్ వర్కౌట్ అయ్యే కథను తీసుకున్నారు బాగానే ఉంది కానీ రెండో దానిపై కూడా ఇంకాస్త శ్రద్ధ పెట్టి మంచి స్క్రీన్ ప్లే అదిరిపోయే సన్నివేశాలు , హిలేరియస్ కామెడీ ఇవన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే బాగుండేది.

రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్ లైఫ్ మీద కూడా తమ కెమిస్ట్రీతో కొంత వరకూ మేనేజ్ చేస్తూ మేజిక్ చేసారు. కానీ సన్నివేశాల్లో బలం లేకపోవడం చేసేదేం లేక దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రారంభం నుండి ఎండింగ్ వరకూ మామ అల్లుడి బాండింగ్ ను గొప్పగా చెప్పాలనే ఉద్దేశ్యంతో కొన్ని లాజిక్స్ ను పట్టించుకోకుండా తోచింది తీస్తూ వెళ్ళిపోయాడు బాబీ. సినిమా ఆరంభంలో ఊహ రాకుండానే మేనమామను చూసి మామ అని పిలుస్తాడు అల్లుడు. ఆ సన్నివేశానికి ముందు తన తల్లి ఆ పిల్లాడితో మామ అనిపించే సన్నివేశం పెట్టారు. కానీ ఆ పిల్లాడు మామ అని పిలవడం కొందరికి అతి అనిపించకమానదు. సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ తో చూస్తే మాత్రం ఆ సీన్ పాసిబుల్ అనిపిస్తుంది.

జాతకాలను నమ్ముతూ జీవించే ఓ తండ్రి , అవేవి పట్టించుకోకుండా ప్రేమతో ఏదైనా జయించొచ్చనే సిద్దాంతాన్ని నమ్మే కొడుకు, చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పోయి మేన మామ దగ్గర పెరిగే ఓ బాబు ఇలా మూడు క్యారెక్టర్స్ చుట్టూ ఓ లేయర్ అల్లి కథను సిద్దం చేసుకున్నాడు బాబీ. కానీ ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సిన చోట మాత్రం బలమైన సన్నివేశాలతో మెస్మరైజ్ చేయలేకపోయాడు. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి విలేజ్ క్యారెక్టర్స్ తో మంచి కామెడీ పండించే స్కోప్ ఉన్నప్పటికీ పాత కామెడీ ట్రాక్, డైలాగ్ కామెడీనే నమ్ముకున్నాడు బాబి.

పల్లెటూరు, అక్కడ మామ అల్లుడు , అలాగే కొన్ని పాత్రలు, ఆకట్టుకునే పాటలతో మొదటి భాగాన్ని బాగానే తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో మాత్రం తడబడి కొన్ని సందర్భాల్లో బోర్ కొట్టించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ,  అపార్థం చేసుకోవడం వల్ల వచ్చే సిల్లీ కామెడీ , రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు ఇవన్నీ గతంలో వచ్చిన ఎన్నో తెలుగు సినిమాలను గుర్తుచేస్తూ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. అదంతా పక్కనపెడితే అప్పటికే వెంకీ మరణించాడని ప్రకాష్ రాజ్ పాత్రతో చెప్పించి, చైతూతో ఓ ఎమోషనల్ డైలాగ్ ద్వారా వెంకీని మళ్ళీ బ్రతికించే క్లైమాక్స్ మాత్రం కామెడీగా అనిపిస్తుంది. దానికి ముందు బార్డర్ దగ్గర వచ్చే అప్పగింతల సన్నివేశంతో పాటు మిలటరీ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చివర్లో జాతకలకంటే మనిషి ప్రేమ గొప్పది దానికి వీళ్ళే నిదర్శనం అంటూ తను చెప్పాలనుకున్న పాయింట్ కి క్లారిటీ ఇచ్చాడు బాబీ.ఇవన్నీ పక్కన పెడితే మామ అల్లుడి కోసం ‘వెంకీ మామ’ ను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2: 75 / 5