'ప్రతి రోజూ పండగే' మూవీ రివ్యూ

Friday,December 20,2019 - 01:55 by Z_CLU

నటీనటులు : సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, మహేష్ ఆచంట, సుహాస్ తదితరులు.

సంగీతం : తమన్ .ఎస్

ఛాయాగ్రహణం : జైకుమార్ సంపత్

సమర్పణ : అల్లు అరవింద్

నిర్మాత : బన్నీ వాస్

రచన- దర్శకత్వం : మారుతి దాసరి

విడుదల తేది : 20 డిసెంబర్ 2019

నిడివి : 145 నిమిషాలు

సెన్సార్ : U

సాయి ధరం తేజ్ తో మారుతి తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతి రోజూ పండగే’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో ఈ కాంబో హిట్ అందుకుందా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

రాజమండ్రిలో ఉండే రఘు రామయ్య (సత్య రాజ్)కి లంగ్ క్యాన్సర్ ఉందని ఐదు వారాల్లో చనిపోతాడని డాక్టర్ ద్వారా తెలుస్తుంది. తను అనారోగ్యానికి గురైన సంగతి అమెరికా , ఆస్ట్రేలియా , హైదరాబాద్ లో ఉండే తన పిల్లలకు తెలియజేస్తాడు. అయితే ఆ విషయం విన్నాక కూడా లైట్ తీసుకొని ప్రయాణాల గురించి తీరిగ్గా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇక తాత ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉందని తెలుసుకున్న పెద్ద కొడుకు(రావు రమేష్) కొడుకు సాయి(సాయి ధరం తేజ్) మాత్రం వెంటనే రాజమండ్రిలో దిగి తాత ముందు వాలిపోతాడు.

తను రావడమే కాకుండా తమ కుటుంబాలను కొన్ని రోజులకే అక్కడికి రప్పిస్తాడు. అయితే ఐదు వారాల పాటు తాతకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రతి రోజు పండగలా సెలెబ్రేట్ చేయాలని భావిస్తాడు సాయి. కానీ రఘు రామయ్య పిల్లలు మాత్రం ఆయన చావు వార్త కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ మైండ్ సెట్ ని సాయి ఎలా మార్చాడు…? చివరికి తాతపై తన పిల్లలకు మళ్ళీ ఎలా ప్రేమ పుట్టేలా చేసి చివరి రోజుల్లోసంతోషపెట్టాడు అనేది మిగతా కథ.

 

నటీ నటులు పనితీరు :

తాత మెచ్చిన మనవడి పాత్రలో సాయి తేజ్ బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి మార్కులు అందుకున్నాడు. రాశి ఖన్నా క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో టిక్ టాక్ సెలిబ్రిటీగా ఏంజెల్ ఆర్నా పాత్రలో బాగానే నటించింది. ముఖ్యంగా నటుడిగా ఈ సినిమా సాయి ను మరో మెట్టు ఎక్కించింది. తన పిల్లలకు దూరంగా ఉంటూ జీవితాన్ని వెళ్లగొట్టే తండ్రి పాత్రలో సత్య రాజ్ జీవించాడు. సత్య రాజ్ ఆ పాత్రలో ఓడిగిపోవడం వల్ల కొన్ని సన్నివేశాలకు బాగా కనెక్ట్ అవుతాం.

ఇక సినిమాలో అన్ని పాత్రలు ఒకెత్తు రావు రమేష్ పాత్ర మరో ఎత్తు. ఎమోషన్స్ ను పక్కన పెట్టి బిజినెస్ మైండెడ్ గా ఉండే పాత్రలో రావు రమేష్ బాగా నవ్వించాడు. చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దొరకడం ఎక్కడా తగ్గకుండా చేసి పాత్రలో ఇమిడిపోయాడు. సత్యరాజ్ స్నేహితుడి పాత్రలో విజయ కుమార్ నటన బాగుంది. మహేష్ ఆచంట కి మరో మంచి పనోడి పాత్ర దక్కింది. సుహాస్ కామెడీ టైమింగ్ కొన్ని సందర్భాల్లో నవ్వించింది. మొదటి భాగంలో వచ్చే సన్నివేశాల్లో మహేష్ నటన ఆకట్టుకుంటుంది.సింక్ బ్రదర్స్ క్యారెక్టర్స్ కి అజయ్ , సత్యం రాజేష్ న్యాయం చేసారు. ఈవెంట్ మేనేజర్ పాత్రలో ప్రవీణ్ ఓ సన్నివేశంలో నవ్వించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు వారి పాత్రలతో ఆకట్టుకొని సినిమాకు ప్లస్ అయ్యాడు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు తమన్ సంగీతం ప్లస్ అయ్యింది. ‘చినతనమే’,’ప్రతి రోజు పండగే’,’ఓ బావ’ , ‘తకిట తకిట’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు బలం చేకూర్చుంది. జైకుమార్ సంపత్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ కెమెరా వర్క్ తో పల్లెటూరి అందాలను మరింత అందంగా చూపించి విజువల్ గా ఎట్రాక్ట్ చేసాడు. కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి) బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేసారు. రవీందర్ వర్క్ బాగుంది.

వెంకట్ కంపోజ్ చేసిన రెండు ఫైట్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మారుతి కథ -కథనం, దర్శకత్వం ఆకట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక సీరియస్ సబ్జెక్ట్ ని ఎంటర్టైనింగ్ చెప్పడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఏ మాత్రం అటు ..ఇటు అయినా సినిమా తేడా కొడుతుంది. అలాంటి కథను ఎంతో చాక చక్యంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేసాడు మారుతి. ఒక ఎమోషనల్ కథను కామెడీగా చెప్పే ప్రయత్నంలో తనకున్న రైటింగ్ స్కిల్ ను సరిగ్గా వాడుకున్నాడు. అలాగే కథలో కామెడీ పండించే క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాటికి పర్ఫెక్ట్ అనిపించే నటులని ఎంచుకోవడం సినిమాకు బాగా కలిసొచ్చింది. వృద్దాప్యంలో ఉన్న తండ్రి పాత్రలో సత్య రాజ్ ను ఎంచుకోవడం కూడా సినిమాకు ప్లస్ అయింది.

తెలుగులో కామెడీ పండించే నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి పాత్ర వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని సినిమా చేసే నటుల్లో రావు రమేష్ ఒకడు. ఈ సినిమాలో కామెడీ పండించే ఓ మంచి పాత్ర దొరకడంతో అందరికంటే ఎక్కువగా మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. రావు రమేష్ కామెడీ పండించిన కొన్ని సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చి ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చే సీన్ లో ప్రేక్షకులు గుక్క తిప్పుకోకుండా నవ్వుకునేలా చేసాడు.

నిజానికి చావు బ్రతుక మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉండాలి. ఆ సందర్భంలో నవ్వుకోవడానికి ఎక్కువగా స్కోప్ ఉండదు. ప్రేక్షకుల మూడ్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ సినిమాకొచ్చే సరికి అది రివర్స్ అయింది. సరైన కామెడీ సన్నివేశాలు రాసుకోవాలే కానీ ఎలాంటి సందర్భంలో అయినా ప్రేక్షకులను నవ్వించొచ్చని రుజువు చేసాడు మారుతి. అలాగని ఎమోషన్ ను పక్కన పెట్టలేదు. ఎమోషన్ ని కూడా అక్కడక్కడా వాడుతూ సన్నివేశాలు రాసుకున్నాడు. చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ అని ఆత్రేయ గారు చెప్పిన విషయాన్ని సినిమాగా తీసి చూపించాలనుకున్నాడు మారుతి. ఆ విషయంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ లో చనిపోకముందే సమాధి కట్టడం, అంతిమ యాత్ర గురించి ప్లాన్ చేయడం వంటి సన్నివేశాలు కొంత మంది ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టినా దాన్ని ఎంటర్టైన్ మెంట్ యాంగిల్ లో చూసే వారికి మాత్రం వినోదం పంచుతాయి.

ముఖ్యంగా క్లైమాక్స్ లో తల్లి తండ్రుల మీదున్న ప్రేమను తమ పిల్లల మీదకి షిఫ్ట్ చేసి వృద్దాప్యంలో వారిని ఒంటరిగా వదిలేసే వారికి తన మాటతో చిన్నగా క్లాస్ పీకాడు మారుతి. ఆ సన్నివేశం అమ్మన్నాన్న లకు దూరంగా ఉండే వారందరికీ కనెక్ట్ అవుతుంది. మొదటి భాగాన్ని పూర్తిగా ఎంటర్టైన్ మెంట్ మీదే నడిపించిన మారుతి రెండో భాగంలో కథలో ఉండే ఎమోషన్ ని చెప్పే ప్రయత్నం చేసాడు. ఆ సన్నివేశాలు కనెక్ట్ అయ్యేవారికి బాగానే అనిపించినా మిగతా వారికి మాత్రం జస్ట్ ఒకే అనిపిస్తాయి. ఓవరాల్ గా ‘ప్రతి రోజూ పండగే’ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి విజయం సాదిస్తుందో చూడాలి.

రేటింగ్ : 3/5