Movie Review - KGF చాప్టర్ 2

Thursday,April 14,2022 - 12:14 by Z_CLU

నటీ నటులు : యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ , రవీన టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ , మాళవిక అవినాష్  , అర్చన, అయ్యప్ప శర్మ తదితరులు

సంగీతం : రవి బసృర్

సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

నిర్మాణం : విజయ్ కిరగండుర్

విడుదల : వారాహి చలన చిత్ర

రచన – దర్శకత్వం : ప్రశాంత్ నీల్

విడుదల తేది : 14 ఏప్రిల్ 2022

నిడివి : 168 నిమిషాలు

భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఈరోజే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది ‘KGF చాప్టర్ 2’ . మరి కన్నడ సినిమా పరిశ్రమకి ఓ భారీ గుర్తింపు,  గౌరవం తీసుకొచ్చిన KGF కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాతో యష్ , ప్రశాంత్ మరోసారి మెస్మరైజ్ చేశారా ? ఈ సీక్వెల్ అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ అనిపించుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

kgf-chapter2-release-zeecinemalu

కథ :

గరుడ (రామచంద్రరాజు)ను చంపిన రాకీ (యష్) కేజీఎఫ్ కు కింగ్ అవుతాడు. కొత్తగా మరో 9 మైన్స్ గుర్తించి, భారీ ఎత్తున బంగారాన్ని తయారుచేస్తాడు. మరోవైపు అతడిపై కుట్రలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఈసారి మాఫియా పరంగానే కాకుండా, పొలిటికల్ గా కూడా రాకీని చంపేందుకు అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కేజీఎఫ్ ను వదిలి వెళ్లిన అధీరా (సంజయ్ దత్) తిరిగొస్తాడు. కేజీఎఫ్ లో ప్రతి అణువు తెలిసిన అధీరాకు రాకీ దొరికిపోతాడు. కానీ అధిరా మాత్రం ఒక ఛాన్స్ ఇస్తాడు. దాన్ని రాకీ సద్వినియోగం చేసుకుంటాడు. దుబాయ్ మాఫియాతో మాట్లాడి భారీ తుపాకులు, ఆయుధాలు తెప్పించుకొని అధిరాకు చెక్ పెడతాడు. కేజీఎఫ్ నుంచి పారిపోయిన అధిర, మూసేసిన మైన్ నుంచి రహస్యంగా తిరిగి కేజీఎఫ్ లోకి అడుగుపెట్టి రాకీని దెబ్బకొడతాడు. ఇందులో భాగంగా తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న రీనా (శ్రీనిధి శెట్టి)ను కోల్పోతాడు రాకీ. దీంతో అక్కడికక్కడే అధిరాను చంపేస్తాడు.

మరోవైపు రాకీని రాజకీయంగా కూడా ఎదుర్కొనేందుకు చాలామంది పావులు కదుపుతారు. ఇందులో భాగంగా ఎంపీలంతా ఒక్కటై ఐరన్ లేడీ రమికా సేన్ (రవీనా టాండన్)ను ప్రధానిని చేస్తారు. సీబీఐ ఆఫీసర్ రాఘవన్ (రావు రమేష్), ప్రధానికి అన్ని విషయాలు చెప్పి కేజీఎఫ్ ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. రాకీకి చెందిన అన్ని ఆర్థిక మార్గాల్ని మూసేస్తుంటారు. తనకు వ్యతిరేకంగా ఎంపీ గురు పాండియన్ (అచ్యుత్) పని చేస్తున్నాడని తెలుసుకున్న రాకీ.. ఏకంగా పార్లమెంట్ నే తన ఆధీనంలోకి తీసుకుని, పార్లమెంట్ లో ఎంపీని కాల్చిచంపేస్తాడు. దీంతో రాకీని అరెస్ట్ చేయాలని, కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది రమికా సేన్.

తనపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ రావడంతో.. అప్పటికే సప్లై ఆపేసిన వేల టన్నుల బంగారంతో, ఓ పెద్ద కార్గో షిప్ తో హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అవుతాడు రాకీ. అంత బంగారంతో రాకీ ఏమయ్యాడు? ఇండియాకు దొరికాడా లేదా అనేది క్లైమాక్స్.

నటీ నటుల పనితీరు : 

యష్ నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. పార్ట్ 1 లో తన యాక్టింగ్ స్టామినా ఏంటో చూపించిన యష్ చాప్టర్ 2 లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా లుక్ , డైలాగ్ డెలివరీ , హీరోయిజంతో ఎట్రాక్ట్ చేశాడు యష్. శ్రీనిధి శెట్టి తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ప్రధాన మంత్రి పాత్రకి రవీన టాండన్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. సంజయ్ దత్ పవర్ ఫుల్ విలనిజంతో మెస్మరైజ్ చేశాడు. తల్లి పాత్రలో కనిపించిన అర్చన సెంటిమెంట్ డ్రామా సీన్స్ లో బాగా నటించింది. ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , మాళవిక , అచ్యుత్ కుమార్, అయ్యప్ప , శరణ్ శక్తి మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు సంబంధించి మొట్ట మొదట చెప్పుకోవాల్సింది రవి బసృర్ మ్యూజిక్ గురించే. రవి కంపోజ్ చేసిన సాంగ్స్ ఒకెత్తయితే ఎలివేషన్స్ ఎపిసోడ్స్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మరో ఎత్తు. చాలా సన్నివేశాలను తన స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పాటలకు ప్లస్ అయ్యింది. భువన్ గౌడ విజువల్స్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచాయి. ముఖ్యంగా కొన్ని షాట్స్ చూస్తే భువన్ కెమెరా వర్క్ ని మెచ్చుకోకుండా ఉండలేము. అన్బు- అరివి యాక్షన్ కోరియోగ్రఫీ మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజిషన్ చాలా బాగుంది.

ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాగుంది. సినిమా రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ అనవసరం అనిపించే  సీన్ ఒక్కటి లేకుండా చూసుకున్నారు.  సందర్భానుసారంగా వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. “రక్తంతో రాసిన కథ ఇది. సిరా తో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తమే అడుగుతుంది ” , ‘వయిలెన్స్ వయిలెన్స్ .. ఐ డోంట్ లైక్ ఐ అవాయిడ్ , బట్ వయిలెన్స్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్”, నాతో దోస్తీ అక్కర్లేదు , నాతో దుష్మని ఎవ్వరూ తట్టుకోలేరు బిజినెస్ చేద్దామా ? ఆఫర్ క్లోస్ సూన్ ” లాంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.

ప్రశాంత్ నీల్ రైటింగ్ , టేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి  ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తన మార్క్ ఎలివేషన్స్ తో సినిమాను తారా స్థాయికి తీసుకెళ్ళాడు. మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ చూపించి సీక్వెల్ కి పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు ప్రశాంత్. విజయ్ కిరగండుర్ ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచాయి. పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ పై రిచ్ ఫ్రేమ్ లో కనిపించింది.

KGF 2 Yash still

జీ సినిమాలు రివ్యూ :

ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటే ఎలా ఉంటుంది? సినిమాలో అడుగడుగునా ఎలివేషన్స్ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఓ కొత్తరకం స్క్రీన్ ప్లే చూడగానే ఏం అనిపిస్తుంది? అవన్నీ ఎలా ఉంటాయో కేజీఎఫ్ ఛాప్టర్-1తో దేశం మొత్తం చూసింది. ఈరోజు రిలీజైన KGF Chapter 2తో దానికి రెండింతలు ఎక్స్ పీరియన్స్ అందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్-1 సక్సెస్ తో పెరిగిన అంచనాలన్నింటినీ పార్ట్-2తో అందుకున్నాడు.

కేజీఎఫ్ ను రాకీభాయ్ ఎలా సొంతం చేసుకున్నాడనే విషయాన్ని పార్ట్-1లో చూపించిన దర్శకుడు.. పార్ట్-2లో నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయాడు. కేజీఎఫ్ రారాజుగా రాకీ భాయ్ ను ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అక్కడ్నుంచి ఒక్కొక్క పాత్రను పరిచయం చేసుకుంటూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ఎప్పట్లానే ఈసారి కూడా కథను ఆనంద్ తో మొదలుపెడతాడని అంతా అనుకున్నారు. అనంత్ నాగ్, మాళవిక పాత్రలు మాట్లాడుకోవడంతో ఛాప్టర్-2 స్టార్ట్ అవుతుందని భావించారు. కానీ దర్శకుడు ఇక్కడ్నుంచే ట్విస్టులు ఇవ్వడం ప్రారంభించాడు. అనంత్ నాగ్ పాత్రను పార్ట్-1లో కథతో సంబంధం లేకుండా చూపించిన దర్శకుడు.. పార్ట్-2లో మాత్రం ఆ పాత్రను కథలో ఓ భాగం చేశాడు. అదేంటనేది ఇక్కడే చెబితే స్పాయిలర్ అవుతుంది.

అలా అనంత్ నాగ్ పాత్ర నుంచి ట్విస్టులు ఇవ్వడం మొదలు పెట్టిన దర్శకుడు.. అధీరా, రమికా సేన్ రాఘవన్ పాత్రల్ని సందర్భోచితంగా ప్రవేశపెట్టాడు. ఓ వైపు కథను నడిపిస్తూనే, మరోవైపు ఎక్కడా స్క్రీన్ ప్లే డౌన్ అవ్వకుండా చూసుకున్నాడు. అధిర, రాకీ ఒకర్నొకరు ఛాలెంజ్ చేసుకోవడం, చంపే అవకాశం వచ్చినప్పటికీ ఇద్దరికీ ఇద్దరూ మరో ఛాన్స్ ఇచ్చుకోవడం బాగుంది. కేజీఎఫ్ కు ప్రమాదం వచ్చినప్పుడు.. చాలా డబ్బు, బంగారం తీసుకొని హెలికాప్టర్ లో వెళ్లిపోతాడు రాకీ. సరిగ్గా ఇక్కడ ఇంటర్వెల్ కార్డు వేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాడు దర్శకుడు.

సెకెండాఫ్ లో కూడా సినిమా ఎక్కడా తగ్గలేదు. అధిరాకు రాకీ చెక్ పెట్టడం, ఢిల్లీలో ప్రభుత్వం మారడం, రాకీ-రీనా పెళ్లి చేసుకోవడం, అధిరా తిరిగి దొంగదారిలో కేజీఎఫ్ లో అడుగుపెట్టడం.. అన్నీ చకచకా జరిగిపోతాయి. ఎప్పటికప్పుడు మధ్యమధ్యలో మదర్ సెంటిమెంట్ చూపిస్తూ.. చొప్పించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా బాగా కుదిరాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మూడున్నరేళ్ల కింద వచ్చిన కేజీఎఫ్ చాప్టర్-1ను ప్రేక్షకులకు గుర్తుచేయడం కోసం దర్శకుడు ఎంచుకున్న పద్ధతి, వాడుకున్న సందర్భం, చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు కేజీఎఫ్ ఛాప్టర్-2లో కూడా స్క్రీన్ ప్లే లో అప్ అండ్ డౌన్స్ ఉండవు. స్టార్ట్ అవ్వడమే హై-పిచ్ లో స్టార్ట్ అవుతుంది.. అలానే కంటిన్యూ అవుతుంది.. అదే విధంగా ముగుస్తుంది కూడా. ఛాప్టర్-1లో మేజిక్ క్రియేట్ చేసిన మూమెంట్ ఇదే. ఛాప్టర్-2లో కూడా అదే మేజిక్ రిపీట్ అయింది. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. నువ్వు ఎలా పుట్టావనేది ఈ ప్రపంచానికి అనవసరం. చనిపోయేటప్పుడు మాత్రం కోటీశ్వరుడిగా మాత్రమే చనిపోవాలి. పార్ట్-1లో హీరో తల్లి కోరిక ఉంది. కథకు మూలం కూడా ఇదే. పార్ట్-2లో దీనికో మంచి ముగింపు ఇచ్చారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎప్పట్లానే తన టీమ్ ను హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నాడు. సినిమాటోగ్రఫీ, రీ-రికార్డింగ్ చాలా బాగున్నాయి. ఈసారి ఈ లిస్ట్ లోకి గ్రాఫిక్స్ ను కూడా చేర్చుకోవచ్చు. క్లైమాక్స్ లో జెట్ విమానాలతో చూపించిన సీజీ షాట్స్ మినహాయిస్తే.. మిగతా అన్ని చోట్లా గ్రాఫిక్స్ ను చాలా చకచక్యంగా మిక్స్ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో కూడా ప్రశాంత్ ను మెచ్చుకోవాల్సిందే. ఇక స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే.. మొదటి భాగంలో వేసిన ముడులన్నింటినీ, ఛాప్టర్-2లో ఒక్కొక్కటిగా విడదీస్తూ అన్ని పాత్రలకు మంచి ముగింపునిచ్చాడు. చివరికి రాకీ భాయ్ పాత్ర ఏమౌతుందనే ఉత్కంఠకు కూడా పార్ట్-2తో చెక్ పెట్టాడు.

ఫస్టాఫ్ లో రాకీ భాయ్ ఎంట్రీ, అధిరా ఎంట్రీ, రాకీ-అధిరా ఫైట్, సాంగ్ బాగా వచ్చాయి. ఇక సెకండాఫ్ లో పోలీస్ స్టేషన్ పై రాకీ ఫైరింగ్ చేసే సన్నివేశం, పార్లమెంట్ భవనంలోకి వెళ్లి మరీ ఎంపీని కాల్చే సీన్, క్లైమాక్స్, అధిరా గ్యాంగ్ పైకి రాకీ కాల్పులు జరిపే సన్నివేశం హైలెట్స్ గా నిలిచాయి. ఎక్కడైనా స్పీడ్ తగ్గింది అనిపించిందంటే అది కేవలం హీరోహీరోయిన్ల రొమాన్స్, ఆ టైమ్ లో పెట్టిన సాంగ్ మాత్రమే. ఇది తప్ప సినిమాలో మిగతా భాగమంతా దర్శకుడి స్క్రీన్ ప్లే మేజిక్ కనిపిస్తుంది.

ఓవరాల్ గా కేజీఎఫ్-1 చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో, ఈ పార్ట్-2 చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే చాప్టర్-1 ను మించిన రేంజ్ లో ఛాప్టర్-2 ఉంది. అదిరిపోయే ఫైట్స్, ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పెర్ఫార్మెన్సులు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్.

బాటమ్ లైన్ – సలామ్ రాకీ భాయ్

రేటింగ్ – 3.25/5

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics