నా నువ్వే మూవీ రివ్యూ

Thursday,June 14,2018 - 02:51 by Z_CLU

నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , తమన్నా, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు

సంగీతం: శరత్

సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్

ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్

సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు

నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి

కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ

దర్శకత్వం: జయేంద్ర

కల్యాణ్ రామ్ ఎలా ఉంటాడో, అతడి సినిమాలు ఎలా ఉంటాయో ఆడియన్స్ కు ఓ ఐడియా ఉంది. ఆ ఐడియాను బ్రేక్ చేసిన సినిమా నా నువ్వే. కెరీర్ లో ఫస్ట్ టైం రొమాంటిక్ లుక్ లో కనిపించాడు కల్యాణ్ రామ్. తమన్నతో కలిసి ‘నా నువ్వే’ అనే సినిమా చేశాడు. మరి నందమూరి లవర్ బాయ్ ఆకట్టుకున్నాడా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ:

డెస్టినీ ని బలంగా నమ్మే అమ్మాయి మీరా (తమన్నా). విధిని అస్సలు నమ్మని వ్యక్తి వరుణ్(కళ్యాణ్ రామ్). వరుణ్ యుఎస్ కు వెళ్లాడానికి ప్రయత్నిస్తూ రెండుసార్లు ఫ్లయిట్ మిస్ అవుతాడు. అయితే అనుకోకుండా ఒక బుక్ ద్వారా వరుణ్ ఫోటో మీరాకు చేరుతుంది. అప్పటి నుంచి మీరాకు అన్ని కలిసొస్తాయి. వరుణ్ ఫోటో మీరాకు చేరగానే ఎప్పట్నుంచో రాస్తున్న పరీక్షల్లో సైతం పాస్ అయిపోవడం..మేజిక్ 100 అనే రేడియో ఛానల్ లో రేడియో జాకీ గా
ఉద్యోగం రావడం అన్నీ అలా జరిగిపోతాయి.

ఇవన్నీ వరుణ్ వల్లే అని భావించిన మీరా చూడకుండానే వరుణ్ ప్రేమలో పడిపోతుంది. ఈ క్రమంలో విధిని నమ్మని వరుణ్ మీరాతో ఒక బెట్ కడతాడు. అనుకోని సంఘటన వల్ల ఇద్దరూ విడిపోతారు. ఫైనల్ గా మీరా నమ్మే డెస్టినీ, వీరిద్దరినీ ఒకటి చేసిందా లేదా అనేదే నా నువ్వే సినిమా.

నటీనటుల పనితీరు :

ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఫస్ట్ టైం లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ పరంగానూ మంచి మార్కులే అందుకున్నాడు. మీరా అనే గ్లామరస్ క్యారెక్టర్ లో సినిమాకు హైలైట్ గా నిలిచింది తమన్న. వెన్నెల కిషోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి కామెడీ పండకపోగా.. పోసాని, ప్రియదర్శి ఉన్నంతలో ఎంటర్ టైన్ చేశారు. తనికెళ్ళ భరణి, , ప్రియ, సురేఖ వాణి తదితరులు తమ పరిధిలో నటించి పరవలేదనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పనితీరు :

అంతా ఊహించినట్టుగానే పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ టోటల్ సినిమాకే హైలెట్. కొన్ని సన్నివేశాల్లో, సాంగ్స్ పిక్చరైజేషన్ లో అతని కెమెరా వర్క్ మైమరిపిస్తుంది. శరత్ అందించిన మ్యూజిక్ బాగుంది… ‘హే హే ఐ లవ్ యు’, ‘నా నువ్వే’, ‘ప్రేమికా’, ‘నిజమా మనసా’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయ్యింది.

‘నిజమా మనసా’ సాంగ్ కు బృంద మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం అందించిన సాహిత్యం పాటలకు ప్రాణం పోసింది. మీరాఖ్, కిరణ్ ముప్పవరపు సంభాషణలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సురేష్ ఎడిటింగ్ పరవాలేదు. జయేంద్ర స్క్రీన్ ప్లే,  డైరెక్షన్ సినిమాకు మైనస్ గా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

– లవర్ బాయ్ గా కల్యాణ్ రామ్
– ఏడేళ్ల గ్యాప్ తర్వాత జయేంద్ర డైరక్షన్
– తమన్న-కల్యాణ్ రామ్ ఫ్రెష్ కాంబినేషన్
నా నువ్వేపై అంతో ఇంతో అంచనాలు పెంచిన ఎలిమెంట్స్ ఈ మూడే. ఆ మూడింటిపై ఫుల్ ఫోకస్ పెట్టి ఉంటే నానువ్వే సినిమా పాస్ అయ్యేది. కానీ చాలా చోట్ల ట్రాక్ తప్పింది.

డెస్టినీ చుట్టూ తిరిగే రొటీన్ ప్రేమకథనే సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు జయేంద్ర తన స్క్రీన్ ప్లేతో పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాడు. యాడ్ ఫిలిం మేకర్ గా మంచి గుర్తింపు అందుకున్న జయేంద్ర ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇలాంటి కథను ట్రై చేయడం అతడు చేసిన పెద్ద మిస్టేక్. పోనీ రొటీన్ స్టోరీలైన్ ఎంచుకున్నప్పటికీ.. ప్రేమకథకు అత్యంత కీలకమైన హీరోహీరోయిన్ల కెమిస్ట్రీపైన అయినా జయేంద్ర దృష్టిపెడితే బాగుండేది.

నా నువ్వేకు ఆయువుపట్టులాంటి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. కళ్యాణ్ రామ్- తమన్న మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోగా.. చాలా సందర్భాల్లో చిరాకు తెప్పిస్తుంది. దీనికి తోడు కామెడీ కూడా క్లిక్ అవ్వకపోవడం సినిమాలో మరో పెద్ద మైనస్. తప్పదన్నట్టు కామెడీ సన్నివేశాల్ని ఇరికించి మరీ పెట్టారు.

ఈ జానర్ సినిమా కళ్యాణ్ రామ్ కు కొత్త. అందుకే ఓ ప్రయత్నం చేసినట్టున్నాడు. కానీ ప్రేక్షకులకు కొత్త కాదు కదా. సినిమా చూస్తున్నంత సేపు గతంలో వచ్చిన ఎన్నో తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. జయేంద్రకు తనకంటూ ఓ మేకింగ్ స్టయిల్ ఉంది. పీసీ శ్రీరామ్ బ్రాండ్ విజువల్ మేజిక్ దానికి యాడ్ అయింది. కథ పరంగా సినిమా క్లిక్ అవ్వకపోయినా.. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదంటే దానికి కారణం జయేంద్ర టేకింగ్, పీసీ శ్రీరామ్ విజువల్స్.

ఏ ప్రేమకథకైనా హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే పాస్ మార్కులు పడిపోతాయి.  నా నువ్వే లో కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య ఆ మేజిక్ పండలేదు. దీంతో వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుడికి కలగదు. అది సినిమాకు పెద్ద మైనస్ అయింది. కళ్యాణ్ రామ్ మాత్రం కొత్తగా ట్రై చేశాడు. కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య వచ్చే కొన్ని సీన్స్, సాంగ్స్ అలరిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

కల్యాణ్ రామ్ లుక్

తమన్నా గ్లామర్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్

డైరెక్షన్

క్యారెక్టర్స్

కామెడీ సీన్స్

రేటింగ్ : 2.5/5