సమ్మోహనం మూవీ రివ్యూ

Friday,June 15,2018 - 02:22 by Z_CLU

నటీనటులు: సుధీర్‌బాబు, అదితిరావు, న‌రేశ్‌, త‌ణికెళ్ల భ‌ర‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, హ‌రితేజ‌, అభయ్ తదితరులు

ఛాయాగ్రహణం : పి.జి.విందా

సంగీతం : వివేక్ సాగ‌ర్

నిర్మాత‌ : శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

విడుదల తేది : 15 జూన్ 2018

సెన్సార్ : U

సుదీర్ బాబు, అదితి రావు కాంబినేషన్ లో ‘సమ్మోహనం’ సినిమా తీసాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఈసారి సినిమా పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనల చుట్టూ అల్లుకున్న ఓ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఇంద్రగంటి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడా… సుదీర్ బాబు -అదితి రావు కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ…

కథ :

విజయ్(సుధీర్ బాబు) పెయింటర్. చిన్నప్పటి నుంచే ఆర్ట్ మీద ఉన్న ఆసక్తితో పుస్తకాల్లో పెయింటింగ్స్ వేస్తుంటాడు. విజయ్ తండ్రి శర్వా(నరేష్)కు సినిమాలంటే పిచ్చి. కానీ విజయ్ కు మాత్రం సినిమా అంటేనే గిట్టదు, సినిమా వాళ్ళంటే కాస్త చులకన భావంతో ఉంటాడు. ఓ సినిమా షూటింగ్ కోసం తనకు ఓ పాత్ర ఇస్తాననడంతో తన ఇంటిను షూటింగ్ కోసం ఇస్తాడు శర్వ. ఆ షూటింగ్ కోసం విజయ్ ఇంట్లో అడుగు పెడుతుంది హీరోయిన్ సమీరా రాథోడ్(అదితి రావు హైదరి). తెలుగు రాకపోవడంతో తెలుగు నేర్చుకునేందుకు విజయ్ సపోర్ట్ తీసుకుంటుంది.

ఈ క్రమంలో సమీరాతో ప్రేమలో పడతాడు విజయ్. ఓ సందర్భంలో సమీరాకు తను ప్రేమిస్తున్న విషయాన్ని తెలియజేస్తాడు. అయితే విజయ్ ప్రేమను సమీరా తిరస్కరిస్తుంది. ఇంతకీ విజయ్ ప్రేమను సమీరా ఎందుకు తిరస్కరించింది… కారణం తెలుసుకున్న విజయ్ దాన్ని ఎలా పరిష్కరించి సమీరా ప్రేమను పొందాడనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు :

సుధీర్ బాబు సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి కెరీర్ లో ఇదొక బెస్ట్ క్యారెక్టరని చెప్పొచ్చు. ఇక తన అందం, నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది అదితి రావు హైదరి. ఈ సినిమాకి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్న అదితి.. సమీరా క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ అనిపించుకుంది. నరేష్ మరోసారి తన కామెడి టైమింగ్ తో ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఓ సందర్భంలో వచ్చే సీన్స్ లో నరేష్ నటన కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో రాహుల్ రామకృష్ణ, అభయ్ పంచ్ డైలాగ్స్ తో నవ్వించారు. నందు, తనికెళ్ళ భరణి, కాదంబరి కిరణ్, పవిత్ర, హరితేజ, హర్షిని తదితరులు వచ్చి పోయే పాత్రలతో కాకుండా సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

టెక్నీషియన్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది పి.జి.విందా సినిమాటోగ్రఫీ గురించి…. అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి… ఇద్దరూ తమ వర్క్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచారు. ముఖ్యంగా తన బాగ్రౌండ్ స్కోర్ తో కొన్ని ఎమోషనల్ సీన్స్ ను ఎలివేట్ చేసాడు వివేక్ సాగర్. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత సాహిత్యం వినిపించేలా పాటలున్నాయి. ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడా కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉండొచ్చు. ఇంద్రగంటి మాటలు, స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ మీద వేసిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా ఎంటర్టైన్ చేశాయి. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలో కాస్త ఆసక్తి కలిగింది. దానికి తోడు మణిరత్నం ‘చెలియా’ హీరోయిన్ అదితి రావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్ అనగానే సినిమాపై కొన్ని అంచనాలు నెలకొన్నాయి. సుదీర్ బాబు , అదితి రావులతో ఇంద్రగంటి ఎలాంటి సినిమా చేస్తాడా అనే చర్చ కూడా నడిచింది.. కట్ చేస్తే టీజర్, ట్రైలర్ ఎట్రాక్ట్ చేయడం, చిరంజీవి, మహేష్ బాబు ఈ సినిమాను ప్రమోట్ చేయడం సినిమాపై బజ్ క్రియేట్ చేసి హైప్ తీసుకొచ్చాయి.

ఒక కాన్సెప్ట్ ను తీసుకొని తన మేకింగ్ స్టైల్ తో సింపుల్ గా సినిమాను తెరకెక్కించి విజయాలు అందుకునే ఇంద్రగంటి మోహన్ కృష్ణ… మొదటి సారిగా సినిమా రంగంలో జరిగే సంఘటనల చుట్టూ ఓ ప్రేమకథను అల్లి ఈ సినిమాను రూపొందించాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి తన మార్క్ సంభాషణలు, సన్నివేశాలతో అలరిస్తూ వస్తున్న ఇంద్రగంటి ఈసారి కూడా తన మార్క్ సీన్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్ చేసాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం రొటీన్ కథనే ఎంచుకున్న ఇంద్రగంటి తన స్క్రీన్ ప్లే మేజిక్ చేసాడు . గతంలో చూసిన సన్నివేశాలే అయినప్పటికీ అవి గుర్తురాకుండా తన టాలెంట్ చూపించి మెస్మరైజ్ చేసాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ తో అలరిస్తూ కథను నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ జర్నీతో మెప్పించాడు.

సినిమాలంటే అస్సలు ఇష్టం లేని ఓ అబ్బాయి సినిమానే నమ్ముకొని జీవిస్తున్న హీరోయిన్ ప్రేమలో పడే కథతో ఈ సినిమాను తెరకెక్కించిన ఇంద్రగంటి బలమైన సన్నివేశాలతో, కామెడీతో బాగా అలరించాడు. సినిమా పరిశ్రమలో కొందరిపై సెటైర్స్ వేస్తూనే మరోవైపు సినిమా రంగంలో కొందరు గొప్ప వ్యక్తులు కూడా ఉంటారని గొప్పగా చెప్పాడు. సినిమా పరిశ్రమలో జరిగే సంఘటనలు కొందరిని ఎలా బాధ పెడతాయి.. సినిమా రంగంలో ఉన్న వ్యక్తుల గురించి బయట కొందరు ఏమనుకుంటారు… నిజజీవితంలో వారు ఎలాంటి సంఘటనలు ఎదుర్కుంటారు.. లాంటి సన్నివేశాలతో ఆలోచింపజేశాడు ఇంద్రగంటి. ముఖ్యంగా తన ప్రతీ సినిమాలో నటీ నటులను పర్ఫెక్ట్ గా వాడుకునే ఇంద్రగంటి ఈసారి కూడా ప్రతీ ఆర్టిస్టు ను బాగా వాడుకొని ఆ క్యారెక్టర్స్ తో అలరించాడు.

ఏ ప్రేమకథకైనా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సీన్స్ పండాలి… అప్పుడే ఆ లవ్ స్టోరీ ని ఆసక్తిగా చూడగలం… హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవి సినిమాకు ప్లస్ అయ్యాయి. సుదీర్ బాబు, అదితి ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అదితి రావు హైదరీ సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్, సుదీర్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్, కామెడీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, క్యారెక్టర్స్ ఇలా అన్నీ కలిసి సినిమాను పాస్ చేసేసాయి.ఫైనల్ గా ‘సమ్మోహనం’ రొమాంటిక్ కామెడీ డ్రామాగా అలరిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

అదితి రావు హైదరీ

సుదీర్ బాబు పెర్ఫార్మెన్స్

స్క్రీన్ ప్లే – డైరెక్షన్

కామెడీ

రొమాంటిక్ సీన్స్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

డైలాగ్స్

 

మైనస్ పాయింట్స్ :

ప్రీ ఇంటర్వెల్

కొన్ని సందర్భాల్లో స్లో అనిపించే నెరేషన్

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

ప్రీ క్లైమాక్స్

 

 

రేటింగ్ : 3 / 5