Movie Review - ముఖచిత్రం

Friday,December 09,2022 - 02:12 by Z_CLU

నటీనటులు – వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్, చైతన్యరావు, విశ్వక్ సేన్, రవిశంకర్, సునీల్ తదితరులు..
దర్శకుడు – గంగాధర్
స్టోరీ – సందీప్ రాజ్
సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్
మ్యూజిక్ – కాలభైరవ
ప్రొడ్యూసర్ – ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా
సమర్పణ – ఎక్ కే ఎన్
రన్ టైమ్ – 2 గంటల 6 నిమిషాలు
సెన్సార్ – A
రిలీజ్ డేట్ – డిసెంబర్ 9, 2022

చెప్పుకోవాలంటే అది చిన్న సినిమానే. కానీ విశ్వక్ సేన్ లాంటి హీరో అందులో గెస్ట్ రోల్ చేశాడు. దీనికితోడు ఎస్ కే ఎన్, సందీప్ రాజ్ లాంటి వ్యక్తులు దీనికి యాడ్ అయ్యారు. పైగా ప్రచారం గట్టిగా చేశారు. అలా ముఖచిత్రం సినిమా ఆడియన్స్ కంట్లో పడింది. ప్రమోషన్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఎట్రాక్ట్ చేసిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

mukhachitram
కథ
రాజ్ కుమార్ (వికాస్ వశిష్ఠ) ఓ ప్లాస్టిక్ సర్జన్. ది బెస్ట్ సర్జన్ అనిపించుకుంటాడు. ఇది బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ సత్య (చైతన్య రావు). ఇద్దరూ ఆపరేషన్లు చేయడంతో పాటు, వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు. రాజ్ కు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా వచ్చిన ఓ ఫొటో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రాజ్. సంప్రదాయబద్ధంగా కనిపించే అమ్మాయి మహతి (ప్రియ వడ్లమాని)ని ఏరికోరి పెళ్లి చేసుకుంటాడు.

అయితే పెళ్లయిన కొన్నాళ్లకే మహతి చనిపోతుంది. అదే టైమ్ లో రాజ్ ఫ్రెండ్ మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్)కు యాక్సిడెంట్ అయి ముఖం మొత్తం పాడైపోతుంది. మహతి ముఖాన్ని మాయాకు అమరుస్తాడు రాజ్. అలా రాజ్ ఇంట్లోకి మహతి ముఖంతో అడుగుపెడుతుంది మాయ. అలా రాజ్ ఇంట్లో అడుగుపెట్టిన మాయ తెలుసుకున్న నిజం ఏంటి? రాజ్ పై ఆమె ఎందుకు న్యాయపోరాటం చేసింది? లాయర్ విశ్వామిత్ర (విశ్వక్ సేన్)కు రాజ్ కుమార్ తో ఏంటి సంబంధం? అనేది మిగతా స్టోరీ.

నటీనటుల పనితీరు
ప్రియా వడ్లమాని.. ఇన్నాళ్లూ కొందరికి మాత్రమే తెలుసు. ఈ సినిమాతో ఆమె చాలామందికి తెలుస్తుంది. ఆమె ఎంత పెర్ఫార్మర్ అనే విషయం అందరికీ అర్థమౌతుంది. అమాయకమైన పిల్లగా, రెబల్ గా.. రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రియా మెప్పించింది. ఆమె కెరీర్ కు ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుంది. ఇక వికాస్ వశిష్ఠకు కూడా ముఖచిత్రం ప్లస్ అవుతుంది. అతడి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సెకండాఫ్ లో మంచి వేరియేషన్స్ చూపించి మెప్పించాడు. ఫ్రెండ్ పాత్రలో చైతన్యరావు కీలకమైన పాత్ర పోషించినప్పటికీ, పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదది.

ఇక తొలిసారి లాయర్ గా కనిపించిన విశ్వక్ సేన్, కనిపించినంతసేపు ఆకట్టుకున్నాడు. అయితే రెగ్యులర్ గా మనం సినిమాల్లో చూసే లాయర్ మేనరిజమ్స్ విశ్వక్ లో కనిపించలేదు. కాళ్లు ఆడిస్తూ, చేతులు ఊపుతూ, తన రెగ్యులర్ స్టయిల్ లోనే ఈ క్యారెక్టర్ ను పోషించాడు. మరో లాయర్ గా రవిశంకర్ మాత్రం తన విశ్వరూపం చూపించాడు. అతడి గెటప్, గొంతు అదిరిపోయాయి. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు
కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్లో నిలబెట్టింది. అయితే పాటలు ఇంకా బాగుంటే బాగుండేది. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. పవన్ కల్యాణ్ ఎడిటింగ్ అక్కడక్కడ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ లో కొంత నిడివి తగ్గిస్తే బాగుండేది.
దర్శకుడు గంగాధర్ విషయానికి వస్తే, కొన్ని సన్నివేశాల్ని బాగా హ్యాండిల్ చేశాడు. సందీప్ రాజ్ అందించిన కథ చాలా కొత్తగా ఉంది. మరీ ముఖ్యంగా ఓ ఎమోషనల్ పాయింట్ కు, మెడికల్-సైన్స్ అంశాల్ని మిక్స్ చేసి రాసుకున్న విధానం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే పరంగా కథారచయిత, దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

Mukhachitram-Movie-Review

జీ సినిమాలు రివ్యూ
సందేశం ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు. ప్రతి సినిమాతో ఏదో ఒక సందేశం ఇవ్వాలనే అనుకుంటాడు మేకర్. అయితే ఆ సందేశాన్ని ఎలా అందించాం, సినిమాలో ఆ ప్రాసెస్ ఎలా సాగిందనేది చాలా ముఖ్యం. ముఖచిత్రం విషయంలో చాలా మంచి పాయింట్ ను చర్చించారు. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ ఇది. కానీ దీన్ని చర్చించడం కోసం దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మెప్పించే విధంగా సాగలేదు.

ముఖచిత్రం ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. హీరో ఓ అమ్మాయి ప్రేమలో ఇనిస్టెంట్ గా పడడం, ఆమెను పెళ్లి చేసుకోవడం, రొమాన్స్.. ఇలా అంతా సాఫీగా సాగుతున్న టైమ్ లో పెద్ద కుదుపు. హీరోయిన్ చనిపోతుంది. దీంతో హీరో ఆమె ముఖాన్ని తీసి, అప్పుడే యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో చేరిన తన గర్ల్ ఫ్రెండ్ ముఖానికి తగిలిస్తాడు. ఈ విషయాన్ని ట్రయిలర్ లోనే చెప్పేశారు కాబట్టి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.

అయితే అసలు పాయింట్ ఇది కాదు. ఇదంతా చూపించిన తర్వాత, కథను మరో కోణంలోకి తిప్పుతాడు దర్శకుడు. నిజం చెప్పాలంటే అసలు కథ అక్కడ్నుంచే మొదలవుతుంది. వైవాహిక అత్యాచారం అనే కాన్సెప్ట్ ను చెప్పాలనుకున్న దర్శకుడు, దాని కోసం ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్, ఫ్యామిలీ లైఫ్, రొమాన్స్ లాంటివన్నీ పెట్టుకున్నాడు. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలై, అసలు కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమౌతుందో, ఫస్టాఫ్ తో పూర్తిగా డిస్-కనెక్ట్ అవుతాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈ పాయింట్ కోసం ఫస్టాఫ్ ను ఇంత సాగదీశాడా అనిపిస్తుంది.

సెకెండాఫ్ నుంచి సినిమా ఎంగేజింగ్ గా సాగుతుంది. హీరోయిన్ అసలు విషయాన్ని తెలుసుకోవడం, హీరో/విలన్ పై పోరాటం లాంటివి ఆసక్తికరంగా సాగుతాయి. విశ్వక్ సేన్ ఎంట్రీతో థర్డ్ యాక్ట్ మొదలవుతుంది. ఇక అక్కడ్నుంచి ఓ చిన్న సందేశాన్నిస్తూ సినిమాను ముగించారు. అయితే క్లయిమాక్స్ లో ప్రధానంగా 2 లోపాలు కనిపిస్తాయి.

వీటిలో ఒకటి విశ్వక్ సేన్ ముందు రవిశంకర్ లాంటి భారీ రూపాన్ని పెట్టడం. రవిశంకర్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్ ముందు విశ్వక్ తేలిపోయాడు. అతడి పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ, కథకు కావాల్సిన భారీతనాన్ని, ఎమోషనల్ ముగింపును విశ్వక్ అందించలేకపోయాడు. కోర్టులో విశ్వక్ సేన్ గెలిచినా, థియేటర్లలో రవిశంకరే మోతమోగించాడు. దీనికితోడు విశ్వక్ సేన్ తో సందేశాత్మకంగా స్పీచ్ ఇప్పించడం పెద్దగా మెప్పించదు. పైగా విశ్వక్ లాంటి కుర్ర హీరో ఇవ్వాల్సిన సందేశం కాదది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు కథ పరంగా ముఖచిత్రం సినిమాను ఓ మంచి ఎటెంప్ట్ గా చెప్పుకోవచ్చు. మేకర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో కథే హీరో. ఆ పాత్రల్లో వికాస్ వశిష్ఠ, ప్రియ వడ్లమాని, ఆయేషా ఖాన్, చైతన్యరావు ఒదిగిపోయారు. క్లైమాక్స్ లో రవిశంకర్, విశ్వక్ సేన్ మెరుపులు మెరిపించారు. ప్రియ వడ్లమాని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. ఆమె కెరీర్ కు ఇదొక మంచి బేస్ మెంట్ అవుతుంది. అన్నట్టు ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నాడు. ఒక సీన్ లో ఇలా కనిపించి అలా మాయమౌతాడు. టెక్నికల్ గా సినిమా బాగుంది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

ఓవరాల్ గా ఓ డిఫరెంట్ స్టోరీ చూడాలనుకునేవాళ్లకు ముఖచిత్రం నచ్చుతుంది. కాస్త స్లోగా సాగే ఫస్టాఫ్ ను భరిస్తే, సెకండాఫ్ నుంచి ఈ సినిమా మంచి అనుభూతిని, మెసేజ్ ను అందిస్తుంది.

రేటింగ్ – 2.5/5